ETV Bharat / bharat

విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరణ- కఠిన చర్యలు ఉండవు : జేపీ నడ్డా

సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు సంబంధించిన కేసులపై కేంద్రం కీలక ప్రకటన- - దిల్లీలో నమోదైన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటామని నడ్డా వెల్లడి

JP Nadda On CJP March
కేంద్ర మంత్రి జేపీ నడ్డా (PIB)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 6:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

JP Nadda On CJP March : విద్యార్థుల నిరసనలకు సంబంధించి నమోదైన కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇటీవల దిల్లీలో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన అన్ని ఎఫ్​ఐఆర్​లను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు విద్యార్థి నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లపై కీలక నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే నడ్డా ఈ ప్రకటన చేశారు.

సీజేపీ సెప్టెంబర్‌ 5న తలపెట్టిన నిరసనను విరమించుకోవడాన్ని కేంద్ర మంత్రి నడ్డా స్వాగతించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని నడ్డా వెల్లడించారు. ఆయా రాష్ట్రాల పరిధిలో సీజేపీ నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం యువత సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ ఏడాది నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, జూన్ 20న జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన చేపట్టింది. అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం పలు నగరాలకు విస్తరించింది. జులై 20న సీజేపీ చేపట్టిన చలో పార్లమెంటు ఆందోళనలో నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఇతర డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో జులై 25న సీజేపీ ఈ ఆందోళనను విరమించింది. అయితే ఆ హామీలను కేంద్రం అమలు చేయడం లేదంటూ సెప్టెంబర్ 5న మరోసారి మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది.

ఎఫ్​ఐఆర్​లు కొట్టివేసిన సుప్రీంకోర్టు
కాగా, ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా, విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కొట్టివేస్తూ మంగళవారం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం కేంద్రం కూడా కేసుల ఉపసంహరణకు హామీ ఇచ్చింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, విద్యార్థుల ఆందోళనల అనంతరం సీజేపీ నాయకత్వానికి ఇచ్చిన మూడు హామీలను ప్రభుత్వం నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై జులై 20 నుంచి 25 వరకూ దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు తన అధికారాలను ఉపయోగించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసింది. యువ నిరసనకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి పూర్తి న్యాయం చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాల్ని వినియోగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే కేంద్రం అభ్యర్థన మేరకు జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న తీవ్రమైన నేరచరిత్ర కలిగిన 2,873 మందిపై మాత్రం ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసేందుకు దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రాణనష్టం లేదా ఆస్తి విధ్వంసంలో వారి పాత్రపై దర్యాప్తు చేయాలని సూచించింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ హామీల నేపథ్యంలో సెప్టెంబర్ 5న తలపెట్టిన నిరసన మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్​ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. సెప్టెంబర్‌ 5న దిల్లీలోని ఇండియా గేట్‌ నుంచి దిల్లీ పోలీస్‌ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత మార్చ్‌ నిర్వహించాలని గతంలో పార్టీ ప్రకటించింది. అయితే కేంద్రం ఇచ్చిన హామీ, ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు సంబంధించిన చర్యల నేపథ్యంలో ఆ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు సీజేపీ నాయకుడు సౌరవ్‌ దాస్‌ ప్రకటించారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సీజేపీ మొదటి నుంచీ వారి తరఫున నిలిచిందని ఆయన తెలిపారు. దిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.

'బీజేపీ, ఓట్ చోరీ ఆయోగ్ వ్యూహాలు మార్చుకుంటూనే ఉంటాయ్​'- మహారాష్ట్ర SIRపై రాహుల్ ఆరోపణలు

'ఎకానమీపై మోదీ చేస్తున్న ప్రచారం 'లెట్స్, కెమెరా, ఇన్‌యాక్షన్' అన్నట్లుగా ఉంది'- ప్రధానిపై ఖర్గే ఫైర్