కన్నతండ్రే కాలయముడు- కత్తెరతో 8నెలల పసికందు గొంతు కోసి హత్య
భార్యతో గొడవ, ఆ కోపం బిడ్డపై చూపిన మృగాడు- కత్తెరతో దారుణం, ఆపై ఆత్మహత్యాయత్నం- గది తలుపులు పగులగొట్టి చూసేసరికి రక్తపు మడుగులో చిన్నారి

Published : February 14, 2026 at 11:01 AM IST
FATHER KILLS DAUGHTER IN JAIPUR : రక్షించాల్సిన తండ్రే రాక్షసుడిగా మారాడు. భార్యతో జరిగిన చిన్న గొడవకు అభం శుభం తెలియని 8 నెలల పసికందును బలి తీసుకున్నాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా, అత్యంత కిరాతకంగా కత్తెరతో చిన్నారి గొంతు కోసి హతమార్చాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. గుండెలు పిండేసే విషాద ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని మాల్పురా గేట్ పోలీస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు కోలుకున్న తర్వాత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
జైపుర్ ఈస్ట్ డీసీపీ సంజీవ్ నైన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లాలాపుర్వా ప్రాంతానికి చెందిన షాదాబ్ మహ్మద్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. షాదాబ్ మహమ్మద్ పూణేలో పని చేస్తున్నాడు. అతని భార్య, 8 నెలల కుమార్తె షెహనాజ్‌తో కలిసి రాజస్థాన్ జైపుర్‌లోని సాంగనేర్ ప్రాంతంలో ఉన్న తన పుట్టింటికి వచ్చింది. ఆమె వచ్చిన రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న పుణెలో ఉంటున్న భర్త షాదాబ్ కూడా జైపుర్‌లోని అత్తగారింటికి చేరుకున్నాడు.
అదేరోజు ఉదయం ఉదయం 10 గంటలకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనతో పాటు వెంటనే తమ ఇంటికి తిరిగి రావాలని షాదాబ్ తన భార్యను అడిగాడు. మరో మూడు నాలుగు రోజులు ఆగి వస్తానని ఆమె చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది పెద్ద గొడవకు దారితీసిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త షాదాబ్ విచక్షణ కోల్పోయాడు. భార్యపై దాడికి దిగాడు. ఆమె గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన బావమరిది (భార్య తమ్ముడు) సోహిల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో షాదాబ్ పక్కనే ఉన్న టీ కెటిల్ తీసుకుని సోహిల్ తలపై బలంగా కొట్టాడు. గొడవ పెద్దది కావడంతో చుట్టుపక్కల వారు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. షాదాబ్ శాంతింపజేశారు. గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు.
గదిలో మృత్యుఘోష
అందరూ అక్కడి నుంచి వెళ్లిపోగానే షాదాబ్ రాక్షసుడిగా మారాడు. 8 నెలల తన చిన్నారిని ఎత్తుకుని ఒక గదిలోకి వెళ్లాడు. లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న పదునైన కత్తెరను తీసుకున్నాడు. ఏ పాపం తెలియని కన్నబిడ్డ గొంతును ఆ కత్తెరతో కోసేశాడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహంపై దుప్పటి కప్పి ఉంచాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి షాదాబ్ ప్రయత్నించాడు.
తలుపులు పగులగొట్టి చూస్తే
గదిలో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు షాదాబ్‌పై అనుమానం వచ్చింది. పొరుగువారి సాయంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల నిందితుడు గాయాలతో పడి ఉన్నాడు. పాప ఎక్కడ అని వెతకగా, దుప్పటి కింద రక్తపు మడుగులో పసికందు కనిపించింది. ఆ దృశ్యం చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
సమాచారం అందుకున్న మాల్పురా గేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తమోడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన నిందితుడు షాదాబ్‌ను సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడి అరెస్ట్
భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాదాబ్ శుక్రవారం కోలుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైపుర్ ఈస్ట్ డీసీపీ సంజీవ్ నైన్ పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. కన్నబిడ్డను కిరాతకంగా చంపిన తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

