2026లో కొత్త శిఖరాలకు భారత్- ఐరోపా బంధం: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లక్సెంబర్గ్ పర్యటన - భారత్ - ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని వెల్లడి

Published : January 7, 2026 at 7:55 AM IST
|Updated : January 7, 2026 at 8:52 AM IST
EAM MInister S Jaishankar luxembourg visit : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లక్సెంబర్గ్‌లో పర్యటించారు. అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత్, ఐరోపా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2026లో సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన లక్సెంబర్గ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐరోపాకు భారత్ మరింత ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అనిశ్చితి పెరిగిందని జైశంకర్ తెలిపారు. ప్రతి దేశం తమ ప్రయోజనాలను అంచనా వేసుకుంటూ, ప్రమాదాలను తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తోందన్నారు. ఇదే సమయంలో విశ్వసనీయమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించుకోవాలనే దిశగా ఆయా దేశాలు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. ఈ పరిణామాలే భారత్–యూరోపియన్ యూనియన్‌ను మరింత దగ్గర చేస్తున్నాయని పేర్కొన్నారు. 2026లో ఐరోపా దేశాలతో సంబంధాల కోసం భారత్ తన సమయాన్ని, శక్తిని మరింత ఎక్కువగా కేటాయిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
"నేటి దౌత్య సంబంధాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ప్రపంచం అస్థిరతతో ఉంది. దీనివల్ల ప్రతి దేశం తమ సొంత ప్రయోజనాలను, ప్రమాదాలను పునఃసమీక్షించుకుంటున్నాయి. తమపై ఎటువంటి ప్రమాదాలు లేదా నష్టాలు పడకుండా ఎలా జాగ్రత్త పడాలో ఆలోచిస్తున్నాయి. అదే సమయంలో, దేశాలన్నీ తాము పూర్తిగా నమ్మదగ్గ అత్యంత సన్నిహిత భాగస్వామ్యాల కోసం, దృఢమైన స్నేహ బంధాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ పరిణామాలే భారత్, ఐరోపా సమాఖ్యలను మరింత దగ్గరయ్యేలా చేస్తున్నాయి" - భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్
తుది దశకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్ - ఐరోపా సమాఖ్య మధ్య చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీఏ) చర్చలు ప్రస్తుతం అత్యంత కీలకమైన, నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో ఐరోపా సమాఖ్యలో కీలక సభ్యదేశమైన లక్సెంబర్గ్ మద్దతు చాలా కీలకమన్నారు. తన పర్యటనలో భాగంగా లక్సెంబర్గ్ ప్రధాని, ఉప ప్రధాని, గ్రాండ్ డ్యూక్‌లతో జరిపిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని జైశంకర్ తెలిపారు. ప్రధానంగా అంతరిక్ష రంగం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్ నిర్వహించనున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. సాంకేతికత అనేది సామాన్యుల జీవన ప్రమాణాలను పెంచేలా ఉండాలన్నది ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు.
లక్సెంబర్గ్ అభివృద్ధిలో అక్కడి భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను మంత్రి జైశంకర్ ప్రశంసించారు. నేను కలిసిన ప్రతి దేశాధినేత భారతీయ కమ్యూనిటీపై ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలతో భారతీయులు కలిసిపోయిన తీరు, వారు అందిస్తున్న సహకారం అభినందనీయమని జైశంకర్ అన్నారు. త్వరలోనే లక్సెంబర్గ్ నుంచి ఒక పెద్ద వ్యాపార ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించనుందని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరో మెట్టు ఎక్కించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈయూ నిర్ణయాల్లో లక్సెంబర్గ్ కీలకం
భారత్–లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సంబంధాలపై జైశంకర్ ప్రత్యేకంగా మాట్లాడారు. యూరోపియన్ యూనియన్‌లో లక్సెంబర్గ్ కీలకమైన దేశమని అన్నారు. ఈయూ ఏర్పాటు నుంచి లక్సెంబర్గ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్ యూనియన్ నిర్ణయాల్లో ఈ దేశ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈయూతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వేగంగా విస్తరించాలనుకుంటున్న ఈ సమయంలో లక్సెంబర్గ్ మద్దతు ఎంతో కీలకమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు ప్రస్తుతం ప్రస్తుతం తుది దశకు చేరుకున్న వేళ జైశంకర్ లక్సెంబర్గ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని ఏర్పడింది. ఈ పర్యటన ద్వారా యూరోపియన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న సంకేతాలను భారత్ ఇచ్చింది.
అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతలు - భారత చమురు దిగుమతులపై ప్రభావమెంత?
ఇకపై రూపాయిల్లోనే భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం : ఎస్బీఐ

