ETV Bharat / bharat

రసవత్తరంగా తమిళ రాజకీయాలు- డీఎంకేలో చేరిన జయ నమ్మినబంటు పన్నీర్‌సెల్వం

డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో కండువా కప్పుకున్న పన్నీర్ సెల్వం- రాజకీయ మనుగడ కోసం అధికార పార్టీ తీర్థం

Former Tamil Nadu Chief Minister O Panneerselvam
Former Tamil Nadu Chief Minister O Panneerselvam ((Photo/ANI))
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 9:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

Panneerselvam DMK : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత సీఎం జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరారు. అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)లో ఆయన శుక్రవారం అధికారికంగా చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఓపీఎస్‌కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

అన్నాడీఎంకేలో కీలక పదవులు నిర్వహించిన పన్నీర్‌సెల్వం, 2022లో పార్టీ అంతర్గత అధికార పోరాటం తర్వాత బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన మాతృపార్టీలోకి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో చివరకు రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని డీఎంకేలో చేరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తన కుమారుడు పి. రవీంద్రనాథ్ కుమార్, అనుచరులు కూడా డీఎంకేలో చేరడం విశేషం.

స్టాలిన్ ఆదేశాల మేరకు పని చేస్తానని స్పష్టం
డీఎంకేలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఓపీఎస్, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "పార్టీకి భవిష్యత్‌లో ఎలాంటి విజయం దక్కకుండా చేసే పరిస్థితిని పళనిస్వామి సృష్టించారు. ఆయన నిరంకుశుడు, అహంకారి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు" అంటూ మండిపడ్డారు. గతంలో తనకు జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఇకపై సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు.

స్టాలిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన ఓపీఎస్, "ప్రజల అవసరాలు అర్థం చేసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు స్టాలిన్. అందరికీ సమానంగా పాలన అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ద్రవిడ సిద్ధాంతాల పరిరక్షణ కోసం డీఎంకే కట్టుబడి ఉంది" అని అన్నారు. ఇకపై తాను కూడా సాధారణ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక అసెంబ్లీలో కూడా ఈ రాజకీయ మార్పు ప్రభావం కనిపించింది.

ఓపీఎస్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే పి. అయ్యప్పన్, స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ ప్రసంగించారు. ముఖ్యంగా పాఠశాల పిల్లల కోసం అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రశంసిస్తూ, "తల్లిలా పిల్లలకు ఆహారం అందించే ప్రభుత్వం ఇది" అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేనే మళ్లీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌డీఏ మిత్రపక్షమైన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ ధినకరన్ స్పందిస్తూ, "ఓపీఎస్‌కు తనకు నచ్చిన కూటమిలో చేరే హక్కు ఉంది. కానీ జయలలితా వారసత్వాన్ని ఈ నిర్ణయానికి కారణంగా చూపడం సమంజసం కాదు" అన్నారు. ఆ వ్యాఖ్యలు జయలలిత అభిమానులకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.

రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓపీఎస్ నిర్ణయం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇప్పుడు ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో మరోసారి అధికారంలోకి రావాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే- బీజేపీ కూటమి కూడా గట్టి పోటీకి సిద్ధమవుతోంది. అదనంగా సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం రంగప్రవేశం చేయడంతో పోటీ త్రిముఖంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, జయలలిత నమ్మిన వ్యక్తిగా ఎదిగిన ఓపీఎస్ ఇప్పుడు ప్రత్యర్థి డీఎంకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే. ఈ నిర్ణయం రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.