'ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం'- CJP నిరసనలపై నిషేధానికి సుప్రీం నిరాకరణ
సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నిరసనలపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ- ప్రతిఒక్కరూ శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడి

Published : August 31, 2026 at 3:47 PM IST
SC on CJP Protest : సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నిరసనలపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. అత్యవసరంగా జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిల్‌పై ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వం, పోలీసుల బాధ్యత అని పేర్కొంది. ఈ ప్రదర్శన ఏదైనా అవాంఛనీయ ఘటనకు దారితీస్తుందని భావించడానికి ఈ దశలో ఎటువంటి కారణం లేదని అభిప్రాయపడింది. నీట్ నిరసనల సమయంలో పోలీసుల హింస ఆరోపణలను పరిశీలించేందుకు తాము ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీకి తన పిటిషన్‌ను సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఇతర విషయాలతో పాటు ఈ పిటిషన్‌ను కూడా సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.
"ఇప్పటికైతే, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగుతుందని భావించడానికి బలమైన పరిస్థితులు ఏవీ లేవు. శాంతిభద్రతలను కాపాడటం వారి బాధ్యత. ఏది చట్టవిరుద్ధమో, ఏది అనుమతించేదో చెబుతూ శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత అమలు చేసే ఏజెన్సీకి ఉంది. వారు ఆ పరిధిలోనే వ్యవహరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇరుపక్షాలు దేశ చట్టాన్ని గౌరవిస్తాయి. దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయని, పాటిస్తాయని మేము ఆశిస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు దీనిని కూడా జాబితాలో చేర్చండి. సెప్టెంబర్ 10న విచారణ జరపాలి." అని ధర్మాసనం పేర్కొంది.
రిటైర్డ్ దిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఇండియా గేట్, సెంట్రల్ విస్టా, సమీప ప్రాంతాలతో సహా భద్రతాపరంగా సున్నితమైన ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణ, ర్యాలీ, ప్రదర్శన కోసం ఇచ్చే ఏ బహిరంగ పిలుపుపైనా, నిర్వాహకులు ముందుగా అవసరమైన అనుమతులు పొందే వరకు చర్యలు తీసుకోరాదని ఆదేశించాలని కోరారు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగిసే వరకు లూటియన్స్ దిల్లీలో ప్రతిపాదిత నిరసనలను నియంత్రించాలని, వాయిదా వేయాలని లేదా తగిన విధంగా మార్చాలంటూ కూడా ఈ పిటిషన్‌లో కోరారు. సదస్సు సమయంలో దిల్లీలో అంతర్జాతీయ ప్రముఖులు, మీడియా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా గాయపడిన పోలీసు సిబ్బందికి నష్టపరిహారం చెల్లించాలని, అలాగే బాధ్యుల నుంచి ప్రభుత్వ ఆస్తి నష్టాన్ని తిరిగి రాబట్టాలని కూడా ఈ పిటిషన్‌లో కోరారు.
"వారి డిమాండ్ ఏమిటి? అది అంత అత్యవసరమా? FIRలో పేర్లు ఉన్నవారిని అరెస్టు చేయడానికి పోలీసులు ఏమైనా దాడులు చేస్తున్నారా?. లేదు కదా!. కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీ కోరుతున్న విషయాలు వారికి ముఖ్యమైనవి కావచ్చు. కానీ BRICS సదస్సు ముగిసే వరకు మరో 10 రోజులు వేచి ఉండి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని సంప్రదించలేరా? ప్రభుత్వం అనుమతించకపోతే, వారు అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు కదా." అని పిటిషనర్ కోరారు.
పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై జూలైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ర్యాలీ నిర్వహిస్తున్నట్లు CJP ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో NEET రద్దు, తదనంతర రీ-టెస్ట్ పరిణామాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు, అలాగే జూలై నెలలో జరిగిన ఆందోళనల సమయంలో పోలీసుల దుశ్చర్యలకు గురైన వారు ఇందులో పాల్గొననున్నారు. సీజేపీ ర్యాలీ ప్రణాళికలను ప్రకటించినప్పటికీ, ఇండియా గేట్ నుంచి దిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఊరేగింపు కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని నగర పోలీసులు చెప్పారు.
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం చెప్పాల్సిందే అంటూ పిల్- విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

