ETV Bharat / bharat

రోజూ మటన్ తినండి- కానీ ఓటు మాత్రం బీజేపీకే వేయండి- మాజీ సీఎం వింత సలహా

నాందేడ్–వాఘాళా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠ- మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్

Ashok Chavan Comments On Elections
Ashok Chavan Comments On Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 10:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ashok Chavan Comments On Elections : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అశోక్ చవాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 2026 నాందేడ్-వాఘాళా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్లకు ఇచ్చిన సలహా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాందేడ్‌లోని తరోడా ప్రాంతంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే‌తో కలిసి అశోక్ చవాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి చవాన్ మాట్లాడారు. ప్రతిరోజూ మటన్ తిని, ఓటు మాత్రం కమలం గుర్తుపై బటన్ నొక్కాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

"ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు ప్రత్యర్థి పార్టీల నాయకులు వస్తారు. మిమ్మల్ని రకరకాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. విందు భోజనాల ఆశ చూపిస్తారు. వారు ఇచ్చే పార్టీలను అస్సలు వదులుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే, రోజూ మటన్ తినండి, కానీ ఓటు వేసే సమయం వచ్చినప్పుడు మాత్రం కమలం గుర్తు (బీజేపీ) బటన్ మాత్రమే నొక్కండి" అని అశోక్ చవాన్ తెలిపారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత అశోక్ చవాన్‌కు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తనకు పట్టున్న నాందేడ్‌లో బీజేపీని గెలిపించుకోవడానికి ఆయన తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు ఇలా 'మటన్ తినండి - ఓటు వేయండి' అని వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాందేడ్–వాఘాళా మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 20 వార్డుల్లోని 81 స్థానాల కోసం 491 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 5 లక్షల 1,799 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో బీజేపీ, శివసేన, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం), ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం, వీబీఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

అశోక్ చవాన్‌పై రూ. 50 లక్షల ఆరోపణలు
ఇదిలా ఉండగా, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల వేళ అశోక్ చవాన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ సొంత పార్టీ నేతలే ఆయనపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరాఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్ నగరంలో అశోక్ చవాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ కార్పొరేటర్ భానుసింగ్ రావత్ సంచలన ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు అశోక్ చవాన్ రూ. 50 లక్షలు తీసుకున్నారని రావత్ ఆరోపించారు. డబ్బు తీసుకుని టికెట్లు అమ్మడం ద్వారా తనలాంటి నిజాయతీ గల కార్యకర్తలు బలయ్యాయరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రావత్ తన కుమారుడి కోసం వార్డు నంబర్ 16 నుంచి టికెట్ ఆశించగా, చివరి నిమిషంలో పార్టీ నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఈ ఆరోపణలపై అశోక్ చవాన్ కూడా స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన 50 ఏళ్ల సామాజిక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదన్నారు. ఎవరినీ రూపాయి కూడా అడగలేదన్నారు.

అలాగే, ఎన్నికల నేపథ్యంలో నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ అభ్యర్థిత్వాల ఉపసంహరణ చివరి రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 13వార్డులో బీజేపీ ఇద్దరు అభ్యర్థులు విజయ్ హోలే, కిసాన్ గవాండేలకు బీ ఫారమ్స్ ఇచ్చింది. అయితే, చివరి నిమిషంలో కిసాన్ గవాండేని పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో ఆగ్రహించిన గవాండే మద్దతుదారులు, ఆయన నామినేషన్ ఉపసంహరించుకోకుండా ఉండటానికి ఏకంగా ఆయన ఇంటికే బయట నుంచి తాళం వేశారు. ఆయనను ఇంట్లోనే బంధించి నినాదాలు చేశారు. చివరకు బీజేపీ ఎమ్మెల్సీ పరిణయ్, ఇతర నేతలు రంగంలోకి దిగి కార్యకర్తలకు నచ్చజెప్పడంతో, గవాండే తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

సరైన పరిహారం కోసం- అరటి ఆకులు చుట్టుకుని రైతుల వినూత్న నిరసన

మోదీ మెచ్చిన బిచ్చగాడు- అడుకున్న సొమ్ముతో అమ్మాయిలకు పెళ్లిళ్లు- పేదలకు దుప్పట్లు దానం!