ETV Bharat / bharat

"అవన్నీ ఊహాగానాలే- భారత్​ AI సమ్మిట్‌కు బిల్ గేట్స్ వస్తున్నారు"

ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్‌గేట్స్ రాక ఖరారు- స్వయంగా వెల్లడించిన ఆయన అధికార ప్రతినిధి

India AI Summit Bill Gates
Chair and Board Member of Gates Foundation, Bill Gates (X/ @IndiainSeattle)
author img

By ETV Bharat Telugu Team

Published : February 17, 2026 at 12:26 PM IST

4 Min Read
Choose ETV Bharat

India AI Summit Bill Gates : ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వివాదంలో ఇరుకున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్​ గేట్స్​ భారత్​లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్​కు రారనే ఊహాగానాలకు తెరపడింది. బిల్​ గేట్స్​ ఈ సమ్మిట్​కు హాజరవుతారని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం తన ప్రసంగాన్ని ఇస్తారని, ఆయన ప్రతినిధి మంగళవారం స్పష్టం చేశారు.

ఇంతకు ముందు ఈ భారీ ఈవెంట్​కు సంబంధించిన 'గ్లోబల్ విజనరీస్​' జాబితాలో బిల్​ గేట్స్ పేరు లేకపోవడం, ఆయన ఈ సమ్మిట్​కు రారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎప్​స్టీన్ ఫైల్స్​ వివాదం వేళ, అనివార్య కారణాల వల్ల గేట్స్ ఈ సమ్మిట్​లో భాగం కావడం లేదని ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. దిల్లీ వేదికగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న కీలక సెషన్లలో బిల్‌గేట్స్ పాల్గొనరని తెలిపాయి. కానీ, తాజాగా ఆయన ప్రతినిధి ఇచ్చిన వివరణతో ఈ ఊహాగానాలు పూర్తిగా తెరపడింది.

ఫిబ్రవరి 16వ తేదీనే 'ఇండియా - ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026' మొదలైంది. సదస్సు అధికారిక వెబ్‌సైట్‌లో కీలకోపన్యాసం ఇవ్వనున్న వక్తల జాబితాలో తొలుత బిల్‌గేట్స్ పేరును ప్రదర్శించారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 17) ఉదయం నుంచి ఏఐ సదస్సు వెబ్‌సైట్‌లో బిల్‌గేట్స్ పేరు కనిపించలేదు. దీనితో ఆయన రాకపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు : నెటిజన్లు ఫైర్
ఇటీవలే (ఫిబ్రవరి 16న) భారత పర్యటన అనంతరం నెటిజన్లు బిల్‌గేట్స్‌పై విమర్శలు గుప్పించారు. సంచలన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్‌తో ముడిపడిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు ఉండటంపై వారు ఫైర్ అయ్యారు. తన ప్రోడక్ట్స్‌కు ఇండియాను ఒక ల్యాబ్‌లా బిల్‌గేట్స్ వాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ కారణం వల్లే భారత్‌లో జరుగుతున్న ఏఐ సదస్సుకు హాజరుకావొద్దని బిల్‌గేట్స్ నిర్ణయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఐ సదస్సుకు హాజరయ్యే అంశానికి సంబంధించిన ప్రణాళికను బిల్‌గేట్స్ ఎందుకు మార్చుకున్నారనే అధికారిక కారణాలతో ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

బిల్‌గేట్స్‌కు డ్రగ్స్ ఇచ్చానన్న ఎప్‌స్టీన్
ప్రపంచ ప్రఖ్యాత గేట్స్ ఫౌండేషన్‌కు అధిపతిగా బిల్‌గేట్స్ వ్యవహరిస్తున్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. అమెరికాలో సంచలనం రేపిన సెక్స్ స్కాం సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. జెఫ్రీ నుంచి అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సేకరించిన ఆధారాలను విడతల వారీగా అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తోంది. ఇటీవలే మరిన్ని కీలక డాక్యుమెంట్లను విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోనూ బిల్‌గేట్స్ పేరు, ఫొటోలు ఉన్నట్లు వెల్లడైంది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్ పలుమార్లు కలిశారనే ప్రస్తావన ఆ ఆధారాల్లో ఉంది. రష్యన్ బాలికలతో సెక్స్ అనంతరం శారీరక బలహీనతలు తలెత్తకుండా బిల్‌గేట్స్‌కు డ్రగ్స్‌ను ఇచ్చానని ఒక డాక్యుమెంట్‌లో జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసిపెట్టాడు. అయితే ఈ అన్ని ఆరోపణలను గేట్స్ బలంగా ఖండించారు.

అవన్నీ అబద్ధాలు : ఆరోపణలను ఖండించిన బిల్‌గేట్స్
తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసంబద్ధమైనవని, అవాస్తవమైనవని ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. తాజాగా బిల్‌గేట్స్ అధికార ప్రతినిధి కూడా ఈ ఆరోపణలను ఖండించారు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో పెళ్లి సమయానికి తనకు లైంగిక సాంక్రమిక వ్యాధి సోకిందనే ప్రచారాన్ని కూడా బిల్‌గేట్స్ ఖండించారు. గతంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాజీ సతీమణి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఒక కీలక విషయాన్ని చెప్పారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌ లాంటి దుష్టుడిని కలిసినందు వల్లే, తన భర్త బిల్‌గేట్స్‌‌కు విడాకులు ఇచ్చి 27 ఏళ్ల దాంపత్య బంధాన్ని ముగించానని ఆమె తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవి నుంచి 2014లోనే బిల్‌గేట్స్ వైదొలిగారు. కానీ ఇప్పటికీ గేట్స్ ఫౌండేషన్‌కు ఆయనే సారథ్యం వహిస్తున్నారు.

ఫిబ్రవరి 16నే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన
బిల్‌గేట్స్ ఫిబ్రవరి 16న (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో పర్యటించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో ఆయన భేటీ అయ్యారు. టెక్ ఆధారిత సుపరిపాలన అనే అంశంపై వారితో బిల్‌గేట్స్ చర్చించారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047'పైనా వారు డిస్కస్ చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక సుపరిపాలన వంటి విభాగాల్లో గేట్స్ ఫౌండేషన్‌లతో ఆంధ్రప్రదేశ్ సర్కారు కలిసి పనిచేసే అంశంపైనా చర్చలు జరిగాయి. 'స్వర్ణాంధ్ర విజన్ 2047' కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఎన్‌విడియా సీఈఓ కూడా రావట్లేదు
ఇక ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరుకావడం లేదని తెలియజేసిన ఇతర ప్రముఖుల జాబితాలో ఎన్‌విడియా కంపెనీ సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఉన్నారు. కానీ జెన్సెన్ హువాంగ్ గైర్హాజరీకి గల నిర్దిష్ట కారణాలను ఎన్‌విడియా కంపెనీ తెలియజేయలేదు. ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ వస్తున్నందు వల్లే, జెన్సెన్ హువాంగ్ రావడం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.