ETV Bharat / bharat

మద్యం పాలసీ కేసు విచారణపై స్పందించిన ఈడీ- హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

తమ దర్యాప్తు కేవలం సీబీఐ కేసుపై ఆధారపడి లేదన్న ఈడీ- పక్కా సాక్ష్యాధారాలతో విచారిస్తున్నామన్న వెల్లడి

Enforcement Directorate
Enforcement Directorate (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 6:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

ED On Delhi Liquor Case : దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనిలాండరింగ్‌ కేసు స్వతంత్రత కలిగిందని ఈడీ అధికారులు తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా సహా నిందితులందరికీ దిల్లీ కోర్టు ఊరట కలిగించిన నేపథ్యంలో ఈడీ ఈ వ్యాఖ్యలు చేసింది. తమ దర్యాప్తు కేవలం సీబీఐ కేసుపై ఆధారపడి లేదని పక్కా సాక్ష్యాధారాలతో విచారిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు. దిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈడీ అధికారుల ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

విజయ్ మదన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన తీర్పు మేరకు ప్రధాన కేసు కొట్టివేస్తే దానికి అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్ కేసు కూడా రద్దవుతుంది. అయితే, ఈడీ మాత్రం ప్రధాన కేసు ఫలితంతో సంబంధం లేకుండా మనీ లాండరింగ్‌ను ఒక స్వతంత్ర నేరంగా పరిగణించాలని కోరుతోంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, తమ ఛార్జిషీట్లలో సమర్పించిన ఆధారాలు విశ్వసనీయమని ఈడీ పేర్కొంది.

సీబీఐ సమర్పించిన ఆధారాలకంటే తమ ఆధారాలు చాలా భిన్నమైనవని తెలిపింది. అక్రమంగా సంపాదించిన నిధులను ఎలా సేకరించారో, ఎలా వినియోగించారో వివరంగా ఛార్జిషీట్లలో వెల్లడించామని ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు, ట్రయల్ కోర్టు ఇంకా ఈడీ కేసు మేరిట్‌పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తమ వాదనలు కోర్టులో వినిపిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా, మనీ లాండరింగ్ కేసును ప్రిడికేట్​ నేరం నుంచి వేరుచేయాలా? లేదా విజయ్ మదన్‌లాల్ కేసులో నిర్వహించిన విధంగా కొనసాగించాలా? అనే అంశంపై కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు.

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె. కవిత సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ దీనిపై దిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దర్యాప్తులోని పలు కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను విస్మరించిందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులపై స్టే విధించాలని సీబీఐ కోరింది.

ఈ కేసులో మొత్తం 8 ఛార్జిషీట్లు దాఖలు
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం 40 సంస్థలను నిందితులుగా పేర్కొంది. కేజ్రీవాల్​, సిసోడియాలతో సహా 18 మందిని అరెస్ట్ చేసింది. ఈడీ తన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్‌ను ఎక్సైజ్ కుంభకోణంలో 'కింగ్‌పిన్' పేర్కొంది. నాటి ప్రభుత్వంలోని దిల్లీ మంత్రులు, ఆప్ నాయకులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన కేజ్రీవాల్, తనపై నమోదైన అవినీతి కేసు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద కేజ్రీవాల్​ను 2024 మార్చి 21న ఈడీ అరెస్ట్​ చేసింది. ఆయన్ను తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచారు. అనంతరం 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు దిల్లీ కోర్టు పేర్కొంది. అయితే, ఈడీ తనకు సమన్లు జారీ చేయడంపై సవాల్​ చేస్తూ కేజ్రీవాల్​ దిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అయితే, అందులోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కీలక సూత్రధారని ఈడీ గతంలో ఆరోపించింది. 'సౌత్ గ్రూప్' సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది.

దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు- కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

'దిల్లీలో ఇప్పుడు ఎన్నికలు పెడితే- బీజేపీకి 10 సీట్లు దాటితే రాజకీయాలు వదిలేస్తా'- మోదీకి కేజ్రీవాల్ సవాల్