ఈడీ vs మమత- సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన టీఎంసీ సర్కార్
ఈడీ, బంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం - ఐప్యాక్ కేసులో సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించవచ్చనే ఊహాగానాలు- ఈ నేపథ్యంలో ఈడీ కంటే ముందుగానే సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమత సర్కార్

Published : January 10, 2026 at 3:26 PM IST
Bengal Govt Files Caveat In Sc : బంగాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం శనివారం సుప్రీంకోర్టుకు చేరింది. ఐప్యాక్ కార్యాలయాలు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఈడీ దాడుల వ్యవహారం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది. ఈ అంశంపై తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ బంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చుననే ఊహాగానాల మధ్య మమతా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. సీఎం మమతా బెనర్జీ దాడులు జరుగుతున్న చోటుకు చేరుకుని, తమ ఆధీనంలో ఉన్న కీలకమైన భౌతిక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరింది.
ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. తాను అక్కడికి వెళ్లడాన్ని ఆమె సమర్థించుకున్నారు. ఈడీ అధికారులు దర్యాప్తు పేరుతో ఓటర్ల రహస్య సమాచారాన్ని, బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు, సామాన్య ప్రజల విన్నపాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉదయం 6 గంటలకే అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించారని, తాను కొన్ని గంటల తర్వాత అక్కడికి వెళ్లానని చెప్పారు.
అసలేంటీ ఈ వివాదం?
బంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ మైన్స్‌లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు 2020లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ (లాలా) ఇందులో ప్రధాన నిందితుడిగా గుర్తించింది. అయితే, ఇదే కేసులో తృణమూల్ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గతంలోనే ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంలో, దిల్లీలోని నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన 'ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఐప్యాక్, బంగాల్లో తృణముల్ పార్టీ ఐటీ, ప్రచార బాధ్యతలను చూస్తోంది.
మరోవైపు, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులను నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం భారీస్థాయిలో ఆందోళనను చేపట్టారు. ఆమె నాయకత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం బయట తృణమూల్ ఎంపీలు కూాడా నిరసన చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఈ వివాదంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. చట్టబద్ధమైన పాలనకు బంగాల్ అతీతమని మమతా బెనర్జీ చూపించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు ఆమె ఇలాంటి పనులే చేస్తున్నారని ఎద్దేవా చేసింది. తాము ఈ ర్యాలీని ముందే ఊహించామని పేర్కొంది.
ఐ ప్యాక్‌పై రైడ్స్: సీఎం మమత ఆధారాలను లాక్కెళ్లారన్న ఈడీ- హైకోర్టుకు చేరిన వ్యవహారం

