తమిళనాడులో ప్రజాస్వామ్యానికి గొప్ప చరిత్ర- ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు!: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
ప్రాచీన కాలం నుంచే తమిళనాడులో కుడవోలై విధానం- అది ప్రపంచానికి ఆదర్శం- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Published : February 27, 2026 at 12:43 PM IST
EC CEC On TN Polls : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాష్ట్ర రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఆ సమావేశంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని ఎక్కువ పార్టీలు కోరినట్టు అధికారులు తెలిపారు. డబ్బు, బహుమతుల ప్రలోభాలకు కట్టడి విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా!
ఈ సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిషనర్‌లతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ, భద్రత, సిబ్బంది శిక్షణ, ఈవీఎంల నిర్వహణ, చట్టవ్యవస్థ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను సమీక్షించారు.
#WATCH | Chennai, Tamil Nadu | On the upcoming Tamil Nadu Assembly elections, Chief Election Commissioner (CEC) Gyanesh Kumar says, " ... recently, the commission had held an international conference with 72 countries participating from the world over, chief election… pic.twitter.com/Hmdu0yBRlT
— ANI (@ANI) February 27, 2026
కఠిన చర్యలు తప్పవు
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ఉచిత పథకాల పంపిణీ వంటి అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. అక్రమాల నివారణకు ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచాలని కూడా సూచించాయి. దీనిపై స్పందించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికలు ఎప్పటికీ చట్టబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రలోభాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా!
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాస్వామ్య సంప్రదాయాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తమిళనాడుకు ప్రజాస్వామ్యంలో గొప్ప చరిత్ర ఉందని, ప్రాచీన కాలంలోనే కుడవోలై విధానం అమల్లో ఉండేదని గుర్తుచేశారు. ఇది ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. ఇటీవల 72 దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సమావేశం నిర్వహించి, తమిళనాడులో శతాబ్దాల క్రితమే అమలులో ఉన్న ఎన్నికల విధానం గురించి వివరించామని తెలిపారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటర్ల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతోందని ఆయన తెలిపారు. అర్హులెవరూ తప్పిపోకూడదని, అనర్హులెవరూ జాబితాలో చేరకూడదనే లక్ష్యంతో చర్యలు చేపట్టామని చెప్పారు. తమిళనాడులో అమలు చేస్తున్న విధానం దేశానికి మోడల్‌గా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఓటర్ల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 వేల పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు అందరికీ సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మరింతగా!
ఎన్నికల పారదర్శకతను పెంచేందుకు కొత్త చర్యలు తీసుకున్నట్టు సీఈసీ వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ఈవీఎంల లెక్కింపుకు ముందే పూర్తి చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేశారు. లెక్కింపు అనంతరం అభ్యర్థులు ఫీజు చెల్లించి ఏడు రోజుల లోపు ఈవీఎంలను వీవీప్యాట్‌లతో సరిపోల్చుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని చెప్పారు.
పక్షపాతం లేకుండా విధులు
ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలు, వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారులు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, పక్షపాతం లేకుండా విధులు నిర్వర్తించాలని కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై జీరో టాలరెన్స్ విధానం పాటిస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, ఎన్నికల తేదీల నిర్ణయంలో పండుగల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరాయి. దీనిని పరిశీలిస్తామని సీఈసీ హామీ ఇచ్చారు. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
మిగిలిన రాష్ట్రాల్లో త్వరలోనే SIR అమలు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
'ఎన్నికల కమిషన్ హింసను సహించదు'- హత్య కేసులో JDU అభ్యర్థి అరెస్ట్ వేళ సీఈసీ వార్నింగ్

