జెమిని గణేశన్ మనవరాలు ఘనత- 52 ఏళ్ల వయసులో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ
52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన దివంగత నటుడు జెమిని గణేశన్ మనవరాలు- ఈ యాత్ర సమయంలో పలు సవాళ్లు ఎదుర్కొన్న ప్రియా సెల్వరాజ్

Published : June 10, 2026 at 10:15 PM IST
Gemini Ganesan Granddaughter Priya Climbs Mount Everest : ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సాహస యాత్రల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఒకటని అందరూ చెబుతుంటారు. పూర్తిగా మంచుతో కప్పుకుపోయిన మార్గాలు, ప్రాణాలకు ప్రమాదంగా మారే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ శిఖరాన్ని చేరుకోవడం అంత అషామాషీ కాదు. అయితే తమిళ దివంగత నటుడు జెమిని గణేశన్ మనవరాలైన డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ( 8,849 మీటర్లు) అధిరోహించారు. ప్రియా 2026 మే 27న ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఈ క్రమంలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
వైద్యురాలు కమ్ మౌంటేనియర్
డాక్టర్ ప్రియా సెల్వరాజ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రి డైరెక్టర్, నియర్ సంతాన సాఫల్య నిపుణురాలు. అయితే ఆమె ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే కఠినమైన లక్ష్యాన్ని పెట్టుకుని విజయం సాధించారు. ఆ ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు, సవాళ్లు ఎదురైనా తట్టుకుని ఆఖరికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.
ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు : ప్రియా సెల్వరాజ్
మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడం కష్టమైన లక్ష్యమే అయినప్పటికీ, తాను ఈ ప్రయాణాన్ని దృఢ సంకల్పంతో, ఆధ్యాత్మిక నిబద్ధతతో చేపట్టానని డాక్టర్ ప్రియా సెల్వరాజ్ తెలిపారు. ఈ ప్రయాణం సవాళ్లతో నిండి ఉందని పేర్కొన్నారు. కఠోర శిక్షణ, కుటుంబసభ్యుల మద్దతు వల్లే ఈ జర్నీ సాధ్యమైందన్నారు. తనకు 2021లోనే ఎవరెస్ట్ పర్వతారోహణ చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు. అయితే తమ ఎవరెస్ట్ పర్వతారోహణ ప్రయాణం అంత సులువుగా సాగలేదని చెప్పారు. తాను ప్రతిరోజూ 12- 13 గంటల పాటు పర్వతాన్ని ఎక్కేందుకు నడిచానని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది రోజుల్లో పర్వతాన్ని అధిరోహించి ఒక రికార్డు సృష్టించానని అన్నారు. ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో సహా మొత్తం 12 మంది ఈ యాత్రను ప్రారంభించామని స్పష్టం చేశారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆక్సిజన్ కొరతతో సహా పలు సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు.
"ఆరోగ్య సంరక్షణ నిపుణురాలిగా ఉన్న నాకు శిక్షణ అంత మంచి పరిస్థితుల్లో జరగలేదు. బాధ్యతలు, పని గంటలు, మానసిక అలసట మధ్య పర్వతారోహణ ట్రైనింగ్ తీసుకున్నాను. అందుకోసం నేను పూర్తిగా నా కోచ్‌పై ఆధారపడ్డాను. నా మనసు, శరీరంపై ఆధారపడ్డాను. పర్వతారోహణ చేయాలనే ఆలోచన నాకు మొదట 2021లో వచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు శిక్షణ పొందాను. నా శిక్షణ అంతా కేవలం ఇంట్లో, ఆస్పత్రిలోనే జరిగింది. నేను నిజమైన పర్వతాలను ఎక్కుతూ శిక్షణ తీసుకోలేదు. దానికి బదులుగా ఇల్లు, ఆస్పత్రి, ఫ్లైఓవర్ల మెట్లు ఎక్కడం ద్వారా శిక్షణ పొందాను. 45 రోజుల్లో ఇంత పెద్ద పర్వతాన్ని అధిరోహించడానికి శిక్షణ పొందడంలో ఇది నాకు సహాయపడింది. "
--డాక్టర్ ప్రియా సెల్వరాజ్, వైద్యురాలు
'ఓర్పు, శారీరక బలానికి పరీక్షగా ఈ యాత్ర'
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ఓర్పుకు, శారీరక దృఢత్వానికి ఒక పరీక్షగా నిలిచిందన్నారు ప్రియ సెల్వరాజ్. నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకి తిరిగి వచ్చే మార్గంలో తన శరీరంలో మార్పులను గమనించానని వెల్లడించారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయన్నారు. అయితే అదృష్టవశాత్తూ తన నిరంతర శిక్షణ కారణంగా ఎటువంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలు కలగలేదని స్పష్టం చేశారు.
"ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో నేను పొందిన శిక్షణ, నా జీవనశైలి ఎంతో సహాయపడ్డాయి. ఎవరెస్ట్ యాత్ర పూర్తైన తర్వాత కూడా రాత్రిపూట నాకు పర్వతారోహణకు సంబంధించిన కలలు వస్తున్నాయి. నేను ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుని తిరిగి వస్తున్నప్పుడు కింద పడిపోయాను. నా శిక్షకులు వెంటనే నన్ను రక్షించారు. గైడ్ సూచనలతో సేఫ్టీ రోప్ (తాడు) కట్టుకోవడంతో బతికాను. లేదంటే చనిపోయేదాన్ని. నాకు పునర్జన్మ లభించినట్లు అనిపిస్తోంది. ప్రస్తుత తరం యువత ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ మొబైల్ ఫోన్లలో మునిగిపోతుంటారు. దానికి బదులుగా వారు శారీరక వ్యాయామం చేయాలి. శరీరం, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి." అని ప్రియా సెల్వరాజ్ సూచించారు.
ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా స్థాపించిన 'ఎలైట్ ఎక్స్‌పెడ్' సంస్థతో కలిసి డాక్టర్ సెల్వరాజ్ ఈ యాత్రను చేపట్టారు. సీనియర్ గైడ్ అనూప్ గురుంగ్ ఆమెకు మార్గనిర్దేశం చేశారు. డెంటిస్ట్, జాతీయ అథ్లెట్, ఫిట్‌నెస్ కోచ్ డాక్టర్ సుగప్రదీప్ ప్రియా సెల్వరాజ్‌కు అండగా నిలిచారు. గతంలో కిలిమంజారో (5,895 మీటర్లు), ఎవరెస్ట్ బేస్ క్యాంప్, లోబుచే ఈస్ట్ (6,119 మీ), మానస్లు (8,163 మీ) వంటి యాత్రల కోసం ప్రియకు శిక్షణ ఇచ్చిన ఆయన, ఎవరెస్ట్ పర్వతారోహణకు అవసరమైన ఓర్పు, బలం, ఎత్తుకు అలవాటుపడటం, మానసిక స్థైర్యంపై దృష్టిసారించేలా ప్రణాళికను రూపొందించారు.
50కి.మీ మౌంటైన్ అల్ట్రా రేస్- అనుకున్న టైమ్ కన్నా ముందే కంప్లీట్ చేసిన రాహుల్- నెక్స్ట్ టార్గెట్ అదే!
'ఆటోలో మినీ లైబ్రరీ'- బుక్ రీడింగ్‌పై ఆసక్తి పెంచేందుకు సుషాన్ వినూత్న ఆలోచన

