ETV Bharat / bharat

ప్రజలను ప్రేమించే నేను కావాలా? ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపే స్టాలిన్ కావాలా?- టీవీకే చీఫ్ విజయ్

అధికార డీఎంకే, సీఎం స్టాలిన్‌పై విరుచుకుపడ్డ విజయ్- ఇప్పటికే తన అభిమానులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారని వ్యాఖ్యలు

TVK Leader Vijay
TVK Leader Vijay (TVK LIVE)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 5:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vijay Comments On Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ప్రేమించే విజయ్ కావాలా? లేదా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపే స్టాలిన్ సర్ కావాలా? అని ప్రజలను కోరారు. సీఎం స్టాలిన్ తనను సైలెంట్‌గా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉన్న విజయ్‌లను (అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి) నిశబ్దంగా ఉంచలేరని ఎద్దేవా చేశారు. తంజావూరులో జరిగిన బహిరంగ సభలో విజయ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"తాను నటించిన జననాయగన్ చిత్రానికి మద్దతు ప్రకటించినందుకు సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు. తమిళనాడు త్వరలో టీవీకే సర్కార్ అధికారంలోకి వస్తుంది. మత్స్యకారులారా ఆశాజనకంగా ఉండండి. మీ రక్షణ పూర్తి హామీ ఇస్తాం. స్టాలిన్ నన్ను మౌనంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్న విజయ్‌లను మీరు మౌనంగా ఉంచలేరు. వారు ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు" అని విజయ్ పేర్కొన్నారు.

తదుపరి ఎన్నికల్లో టీవీకేదే విక్టరీ : విజయ్
అలాగే త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను టీమ్ దిల్లీ వర్సెస్ టీమ్ తమిళనాడుగా డీఎంకే అభివర్ణించడంపై విజయ్ మండిపడ్డారు. క్రికెట్‌లో కూడా దిల్లీ జట్టు తమిళనాడుతో సరిపోలదని విమర్శించారు. తమిళనాడు అంటే టీవీకే, టీవీకే అంటే తమిళనాడు అని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో రాణించి తదుపరి ఎన్నికల్లో టీవీకే జట్టే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీట్, ప్రాథమిక సౌకర్యాలు వంటి అంశాలపై డీఎంకే ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయలేదని విషయం తెలిసినప్పటికీ, నీట్‌ను రద్దు చేస్తామని డీఎంకే సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

'సీఎం స్టాలిన్ లేఖలు రాసి నిద్రపోతారు'
"వచ్చే జన్మలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాలని తనకు కోరిక ఉంది. మత్స్యకారుల సమస్యలపై డీఎంకే సర్కార్ పట్టించుకోలేదు. మత్స్యకారుల సమస్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి అప్పుడప్పుడు లేఖలు రాసి ఆపై నిద్రపోతారు. కేంద్ర ప్రభుత్వంపై నిజమైన, భావోద్వేగ ఒత్తిడి తీసుకురావాలి. శ్రీలంక నావికాదళం మన మత్స్యకారులపై చేయి కూడా చేయకూడదు. వారు మన మత్స్యకారులను తాకడానికి మనం అనుమతించకూడదు. వారి భద్రతకు హామీ ఇవ్వాలి. అదే మా పార్టీ ఏకైక ఎజెండా. టీవీకే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు పూర్తి భద్రత కల్పిస్తుంది. మేము ప్రకటించిన అన్ని ప్రాజెక్టులను ఐదేళ్లలోపు పూర్తి చేయడానికి కృషి చేస్తాం."
--విజయ్, టీవీకే అధ్యక్షుడు

వరుసగా రెండోసారి డీఎంకే అధికారంలోకి రాదు : విజయ్
తమిళనాడులో మళ్లీ తామే అధికారంలోకి వస్తారని సీఎం స్టాలిన్ చెబుతున్నారని, అది ఎప్పటికీ జరగదని అన్నారు విజయ్. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర డీఎంకేకు లేదని పేర్కొన్నారు. డీఎంకే దుష్టపాలన అంతమై, టీవీకే స్వచ్ఛమైన పాలన రాబోతోందని తెలిపారు. "త్వరలో తమిళనాడులో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకు కారణం భూగర్భ జలాలను రక్షించకపోవడమే. నేల, ఇసుకను దోచుకుంటే ఇంకేం జరుగుతుంది? పర్వతాలను తవ్వేస్తే ఏం జరుగుతుంది? ఖనిజ వనరులను దోచుకుంటే ఇంకేం జరుగుతుంది? ఇసుక దోపిడీలో పాల్గొన్న వారిపై డీఎంకే సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని మద్రాస్ హైకోర్టు చెప్పింది" అని డీఎంకే సర్కార్‌పై విజయ్ మండిపడ్డారు.

రోడ్డు ప్రమాదం- ఒకరికి గాయాలు
మరోవైపు, టీవీకే చీఫ్ విజయ్ వాహనం వెంట అభిమానుల బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తంజావూరు ఎస్పీ తిరు ఆర్ రాజారాం తెలిపారు.

అసోం అసెంబ్లీ ఎన్నికలు- కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

'లంచం, అవినీతే సీఎం అసలైన స్నేహితులు'- స్టాలిన్​పై విజయ్ ఫైర్