ETV Bharat / bharat

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం- కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

కర్ణాటకలో నయా సర్కార్- ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం- ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పరమేశ్వర!

DK Oath Taking
DK Oath Taking (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 4:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

DK Shivakumar Oath Taking : కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్ ​చంద్ గహ్లోత్ డీకే శివకుమార్​తో ప్రమాణం చేయించారు. అలాగే సీనియర్ నేత జి.పరమేశ్వర్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితోపాటు మరో 12 మంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజారుద్దీన్‌ హాజరయ్యారు.

చేతిలో రాజ్యాంగం
ప్రమాణ స్వీకారానికి ముందు డీకే వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డీకే సత్కరించారు. అనంతరం తన తాతయ్య గంగాధరయ్య చిత్రపటానికి నివాళులర్పించి ఆయన్ను స్మరించుకుంటూ కర్ణాటక రాష్ట్రానికి 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో డీకే చేతిలో రాజ్యంగం బుక్ అందర్నీ ఆకర్షించింది. చేతిలో రాజ్యాంగం బుక్​ను పట్టుకుని అయన ప్రమాణం చేశారు.

మంత్రులుగా సిద్ధరామయ్య, ఖర్గే కుమారులు
కాగా, డీకే కేబినెట్​లో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీళ్లతోపాటుగా కె.హెచ్‌.మునియప్ప, కె.జె.జార్జ్‌, ఎం.బి.పాటిల్‌, రామలింగారెడ్డి, సతీశ్‌ జర్కిహోళి, కృష్ణబైరిగౌడ, యు.టి.ఖాదిర్‌, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్ ప్రకాశ్‌ పాటిల్​తో గవర్నర్ థావర్​చంద్ ప్రమాణం చేయించారు. దీంతో కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో నయా సర్కార్ కొలువుదీరింది.

మోదీ అభినందనలు!
ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీకే శివకుమార్​కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఎక్స్​లో ట్వీట్ చేశారు. 'కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డీకే శివకుమార్​కు అభినందనలు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది' అని మోదీ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కార్యదర్శి జోక్యం
ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా, ఎం.బి. పాటిల్ బసవన్న సిద్ధేశ్వర మహాస్వామి పేర్ల మీద ప్రమాణం చేశారు. దీంతో కార్యదర్శి శాలిని రజనీశ్ జోక్యం చేసుకుని, పత్రంలో ఉన్న పదాలను మాత్రమే చదవాలని సూచించారు. ప్రమాణ పత్రంలో ఉన్నవి తప్ప మరే ఇతర విషయాలను చదవకూడదని గవర్నర్ ఆదేశించారు.

సొంత నియోజకవర్గంలో కార్యకర్తల సంబరాలు!
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గం రామనగరలో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని ఐజూరు సర్కిల్, చన్నపట్న వద్ద బస్ స్టాండ్ వద్ద వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.

ఎట్టకేలకు సాధించిన డీకే
కాగా, 2023 మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకేకే సీఎం పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్ నేత సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత తనను సీఎం చేస్తామని హైకమండ్ డీకేకు మాట ఇచ్చినట్లు అప్పట్నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఈ క్రమంలో గతేడాది డిసెంబర్​కు రెండున్నరేళ్లు ముగియగానే ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. అలా గత ఆరునెలలుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో రీసెంట్​గా అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గతనెల 29న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ సీటులోకి డీకే వచ్చారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం

విమానయాన రంగానికి ప్యాకేజీ- రహదారులకు భారీగా నిధులు- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు