ETV Bharat / bharat

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు పూర్తి బాధ్యత వహించడం తప్పనిసరి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఆన్‌లైన్ కంటెంట్, చిన్నారుల భద్రతపై ప్లాట్‌ఫామ్‌లే బాధ్యులు- డీప్‌ఫేక్‌, ఏఐ దుర్వినియోగంపై కఠిన నియంత్రణ అవసరం- నమ్మకాన్ని కాపాడే విధంగా డిజిటల్ రంగంలో సంస్కరణలు

Ashwini Vaishnaw
Ashwini Vaishnaw (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 3:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ashwini Vaishnaw On Digital Platforms : డిజిటల్ ప్రపంచంలో ప్లాట్‌ఫామ్‌లు ఇకపై బాధ్యత నుంచి తప్పించుకోలేవని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. తాము ప్రదర్శించే లేదా ప్రచురించే ప్రతి కంటెంట్‌కు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఆయన కఠిన హెచ్చరిక చేశారు. ఆన్‌లైన్‌లో చిన్నారులు, సాధారణ పౌరుల భద్రతను కాపాడటం వారి ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు.

ప్రతి వ్యవస్థ నమ్మకంపై ఆధారపడి ఉంది!
డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి, వేల ఏళ్లుగా మనుషుల సమాజం నిర్మించుకున్న విశ్వాస వ్యవస్థలను డిజిటల్ వేదికలు దెబ్బతీయకూడదని సూచించారు. కుటుంబం నుంచి న్యాయవ్యవస్థ, మీడియా, శాసనసభ వరకు ప్రతి వ్యవస్థ నమ్మకంపై ఆధారపడి పనిచేస్తుందని గుర్తుచేశారు. అదే నమ్మకాన్ని డిజిటల్ ప్రపంచం కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

చట్టబద్ధమా కాదా అన్నది పరిశీలించాల్సిందే!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటివరకు తాము కేవలం వేదిక మాత్రమేనని చెప్పే రోజులు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచానికి ఆతిథ్య వేదికలుగా మారిన ఈ ప్లాట్‌ఫామ్‌లు తమ వద్ద ప్రసారం అయ్యే సమాచారంపై బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. ఒక హోటల్ యజమాని తన హోటల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నట్లే, డిజిటల్ వేదికలు కూడా తమ వద్ద హోస్ట్ అయ్యే కంటెంట్ చట్టబద్ధమా కాదా అన్నది పరిశీలించాలన్నారు.

చట్టపరమైన చర్యలు తప్పవ్
అల్గారిథమ్‌ల ద్వారా వ్యాప్తి చెందే సమాచారం మోసపూరితమైందా? పౌరులకు హాని కలిగిస్తుందా? చిన్నారులపై ప్రభావం ఉంటుందా? నేరాలకు దోహదపడుతుందా? వంటి ప్రశ్నలకు ప్లాట్‌ఫామ్‌లే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. బాధ్యతను విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా!
ఏఐ ఆధారిత కంటెంట్‌పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేరొకరి ముఖం, గొంతు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్ సృష్టించడం అనైతికమని, దానికి నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. డీప్‌ఫేక్‌ల ద్వారా లేనిది ఉన్నట్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి సాంకేతికతలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు.

భవిష్యత్తులో డిజిటల్ రంగ అభివృద్ధికి కీలకం
మీడియా పాత్రను ఉదాహరణగా తీసుకుంటూ, సమాచారాన్ని ధ్రువీకరించి మాత్రమే ప్రచురించడం, పాక్షికత లేకుండా వ్యవహరించడం, బాధ్యత వహించడం వంటి విలువల వల్లే మీడియాకు విశ్వసనీయత వచ్చిందన్నారు. ఇదే ధోరణిని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా అనుసరించాలన్నారు. త్వరగా మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. సమాజం కోరుతున్న ఈ మార్పును ప్లాట్‌ఫామ్‌లు గౌరవించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడటమే భవిష్యత్తులో డిజిటల్ రంగ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

సమాజానికి మేలు చేసే దిశగా!
ఇక రైల్వే రంగంలో సాంకేతికతను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్రం రైల్టెక్ విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. స్టార్టప్‌లు, పరిశోధకులు సులభంగా రైల్వేలతో అనుసంధానం కావడానికి ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎండ్ టు ఎండ్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలో అమలు చేస్తామని వెల్లడించారు. కొత్త సాంకేతికతలను ప్రయోగాత్మకంగా అమలు చేసి రైల్వే సేవలను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. డిజిటల్ వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజానికి మేలు చేసే దిశగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. పిల్లలు, పౌరుల భద్రతను కాపాడుతూ విశ్వసనీయ సమాచారాన్ని అందించడమే వారి ప్రధాన బాధ్యత అని ఆయన తేల్చిచెప్పారు.

భారత్​లోకి భారీగా పెట్టుబడులు- 'AI డిక్లరేషన్'కు 88 దేశాల సంతకాలు: అశ్వినీ వైష్ణవ్

AI రంగంలో భారత్​దే హవా- రెండేళ్లలో రూ.18లక్షల కోట్ల పెట్టుబడులు: అశ్విని వైష్ణవ్