డిజిటల్ అరెస్ట్- మహిళా టెకీ నుంచి రూ.32 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
సీబీఐ అధికారులమంటూ -బెంగళూరు మహిళ నుంచి రూ.32 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

Published : November 17, 2025 at 4:47 PM IST
Bengaluru Woman Digital Arrest : సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు, విద్యావంతులను, టెక్ నిపుణులను కూడా మోసం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ సీనియర్ మహిళా ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా రూ.32 కోట్లు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగిన సైబర్ మోసాల్లో ఇదే అతి పెద్దదని పోలీసులు చెబుతున్నారు.
ఇంతకీ ఎలా మోసం చేశారంటే?
"బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉమారాణి (57 ఏళ్లు) నివసిస్తున్నారు. ఆమె ఓ ఐటీ ఉద్యోగి. 2024 సెప్టెంబర్ 15న ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. తాను డీహెచ్ఎల్ కొరియర్ కంపెనీ ప్రతినిధి అని చెప్పి, మీ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్‌పోర్టులు, నిషేధిత ఎండీఎం డ్రగ్స్ ఉన్న ప్యాకేజీ- ముంబయిలోని అంధేరీ కొరియర్ సెంటర్‌కు వచ్చిందని అన్నాడు. దీనితో ఉమారాణి తాను బెంగళూరులో నివసిస్తున్నాని, ఆ ప్యాకేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దీనితో ఆ వ్యక్తి, మీ ఫోన్ నంబర్‌తో ఆ ప్యాకేజ్ లింక్ చేయబడి ఉందని, అది సైబర్ నేరం కావచ్చని పేర్కొన్నాడు. అంతేకాదు దానిపై సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయమని చెప్పాడు. దీనికి ఉమారాణి స్పందించేలోపు, అతనే ఓ వ్యక్తికి కాల్ చేసి అతను సీబీఐ అధికారి అని బాధితురాలికి తెలిపాడు.
ఆ సైబర్ నేరగాడు సీబీఐ అధికారిలాగా నటిస్తూ, ఉమారాణి నుంచి పలు వివరాలు సేకరించాడు. ఆమెపై సీబీఐ నిఘా ఉంచిందని బెదిరించాడు. అంతేకాదు దీని గురించి స్థానిక పోలీసులకు చెప్పవద్దని హెచ్చరించాడు. దీని గురించి ఎవరికైనా తెలియజేస్తే, ఆమె కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరించాడు. దీనితో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. పైగా తన కుమారుడి వివాహం దగ్గరలో ఉండడంతో, ఆ మోసగాళ్లు చెప్పినట్లే ఆమె చేసింది.
అక్కడికి కొన్ని రోజుల తర్వాత, సీబీఐ అధికారినంటూ చెప్పుకున్న ఆ మోసగాడు మళ్లీ ఫోన్ చేశాడు. ఈసారి అతను వీడియో కాల్ చేసి, ఉమారాణిని డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించాడు. ఆ తరువాత రాహుల్ యాదవ్ అనే మరో వ్యక్తిని వారం రోజుల పాటు ఆమెను పర్యవేక్షించడానికి నియమించాడు. వాస్తవానికి ఆ సమయంలో ఆమె వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అదే విషయాన్ని మోసగాళ్లుకు చెప్పారు. దీనితో సదరు మోసగాడు 2024 సెప్టెంబర్ 23న మళ్లీ ఫోన్ చేసి, అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే, మీకున్న అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలని ఆదేశించాడు. ఇదంతా నిజమే అని నమ్మిన బాధితురాలు, ఆ మోసగాడు చెప్పినట్లే చేసింది. బాధితురాలు పూర్తిగా వారి ట్రాప్‌లో పడిపోవడంతో, క్రమంగా ఆమె నుంచి డబ్బు గుంజారు. బాధితురాలు తన ఎఫ్డీ డబ్బులను మినహాయించి, మిగతా సేవింగ్స్ ద్వారా, ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయం అంతా కలిపి రూ.31.83 కోట్లను దాదాపు 187 లావాదేవీల ద్వారా మోసగాళ్లుకు బదిలీ చేసింది. ఇలా తమకు బదిలీ చేసిన డబ్బును 2025 ఫిబ్రవరి నాటికి ధ్రువీకరించి తిరిగి ఇస్తామని మోసగాళ్లు ఆమెను నమ్మించారు. చివరికి వారు సదరు మహిళకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే గడువు దాటిపోతున్నా కూడా తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి, 2025 నవంబర్ 14న బెంగళూరులోని తూర్పు డివిజన్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి వివాహం, ఇతర కారణాల వల్ల ఫిర్యాదు చేయడంలో చాలా ఆలస్యమైందని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీనితో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం" అని పోలీసులు తెలిపారు.
'డిజిటల్ అరెస్టు' పేరుతో కాల్స్ వస్తున్నాయా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు!
డిజిటల్ అరెస్ట్ లేనే లేదు - అయినా ఎందుకు స్కామర్లకు చిక్కుతున్నారు?

