24ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జననం- డీజే డ్యాన్స్‌లు, బాణసంచాతో సెలబ్రేషన్స్
తమ కుటుంబంలో 24 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని సంబరాలు- స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్స్- డీజే పాటలకు స్టెప్పులు వేసిన కుటుంబసభ్యులు, స్థానికులు

Published : April 8, 2026 at 10:46 PM IST
Celebrating Daughter Birth In Chhattisgarh : కాలం ఎంతగా మారినా, నేటికీ ఆడపిల్ల పుడితే అమ్మో అనుకునే వారున్నారు. కొందరు మాత్రం ఆడపిల్ల జన్మిస్తే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోతారు. ఈ క్రమంలో వేడుకలు చేసుకుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం. తమ ఫ్యామిలీలో 24 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని డీజేలు పెట్టి నగర వీధుల్లో డ్యాన్స్‌లు చేశారు. అలాగే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాగా, ధమ్తారిలోని మాకేశ్వర్ వార్డులో గత 24 ఏళ్లుగా ఆడపిల్ల జన్మించలేదు. అందుకే ఇన్నాళ్ల తర్వాత బాలిక పుట్టడంతో వార్డులోని ప్రజలూ సంబరాల్లో మునిగిపోయారు.
పసికందు ఇంటికి రాకతో సంబరాలు స్టార్ట్
మాకేశ్వర్ వార్డుకు చెందిన రూపేశ్ కోసరియా, కిరణ్ కోసరియా దంపతులకు ఏప్రిల్ 1న బతేనా ఆస్పత్రిలో ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆ పసికందును ఇంటికి తీసుకువచ్చాక అసలైన సంబరాలు మొదలయ్యాయి. చిన్నారి కుటుంబ సభ్యులు తమ వార్డులోని ప్రజలకు స్వీట్లను పంచిపెట్టారు. వార్డు నివాసితులు డప్పులు, డీజే, డ్యాన్స్, బాణాసంచాతో ఆ ప్రాంతమంతా 'బేటీ ఆయీ హై' (ఆడపిల్ల పుట్టింది) అంటూ ఊరేగింపును నిర్వహించారు. ఈ వేడుక ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి ఒక శక్తిమంతమైన సామాజిక సందేశాన్ని సమాజానికి అందించింది. రెండు దశాబ్దాల తర్వాత ఆ ప్రాంతమంతటా ఆడపిల్లకు స్వాగతం పలుకుతూ జరుపుకున్న ఈ వేడుక చూపరులను ఆకట్టుకుంది.

సామూహిక కార్యక్రమంగా వేడుక
వార్డులోని ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని ఒక సామూహిక కార్యక్రమంగా దీన్ని మార్చేశారు. డీజే పాటలను హుషారుగా డ్యాన్స్ చేశారు. బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆడపిల్ల పుట్టినందుకు ఇంత ఘనంగా వేడుకలు జరుపుకోవాలనే రూపేశ్ కోసరియా కుటుంబం నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.

'బాలికను బాధ్యతతో పెంచుతాం'
24 ఏళ్ల తర్వాత తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని చిన్నారి పెదనాన్న దీపక్ తెలిపాడు. ఆడపిల్ల పుట్టాలని తాము ఎంతో ఆశపడ్డామని పేర్కొన్నాడు. తాము ఈ బాలికను చాలా బాధ్యతతో పెంచుతామని వెల్లడించాడు. చిన్నారికి మంచి చదువును చెప్పిస్తామని స్పష్టం చేశాడు. తమ కుటుంబంలో ఆడపిల్ల ఉండటం తమకు గర్వకారణం, దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చాడు. "నా సోదరి తర్వాత మా ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మించడం ఇదే మొదటిసారి. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఆడపిల్ల అనేది భారం కాదు. ఆమెకు మంచి విద్యను, ఉజ్వల భవిష్యత్తును అందించడం మా కుటుంబం బాధ్యత. ఇంట్లో ఆడపిల్ల ఉండటం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం" అని దీపక్ అన్నాడు.

ఇంతటి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని చిన్నారి మేనత్త సోనియా టాండన్ సంతోషం వ్యక్తం చేశారు. అందుకే కుటుంబమంతా చిన్నారి పుట్టుకను వేడుకలా జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. మరోవైపు, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని, వారే తల్లిదండ్రులకు అండగా నిలుస్తారని మరో ఫ్యామిలీ మెంబర్ కంచన్ మిన్‌పాల్ అభిప్రాయపడింది. ఆడపిల్లలే ఇంటికి సంతోషాన్ని తీసుకువస్తారని పేర్కొంది.

నగరవాసులు హర్షం
నగరవాసులు సైతం కోసరియా కుటుంబం ఈ గొప్ప ప్రయత్నాన్ని ఎంతగానో అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో 'బేటీ బచావో, బేటీ పఢావో' (ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి) అనే సందేశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. ఈ కుటుంబం ధమ్తారి నగరానికే ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆ శిశువు భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించారు.

ఆడపిల్ల పుట్టుక పురస్కరించుకుని నిర్వహించిన జరిపిన ఈ సంబరాలు కేవలం ఆ కుటుంబ ఆనందానికి ప్రతీకగానే కాకుండా, బాలికల గౌరవం, సమానత్వం గురించి సమాజానికి ఒక సానుకూల సందేశాన్ని కూడా అందించాయి. ధమ్తారి నగరంలో జరిగిన ఈ అపూర్వమైన వేడుక ఇప్పుడు అందరీ దృష్టిని ఆకర్షించింది.
ప్రభుత్వ పాఠశాలలో మద్యం- చక్కగా తాగి ఇంటికి వెళ్లిన విద్యార్థి!

