ETV Bharat / bharat

కట్టెల పొయ్యిపై దేశీ స్టైల్లో పిజ్జా తయారీ- ఇటాలియన్ 'అమోర్ మియో'కు ఎంత డిమాండ్​ ఉందో తెలుసా?

ఇటలీకి చెందిన ఫాదర్ కాల్రో ప్రారంభించిన సాంప్రదాయ పిజ్జా తయారీ- మట్టి, ఇటుక, కలపను ఉపయోగించి ప్రత్యేకమైన ఓవెన్‌ నిర్మాణం- తాజా కూరగాయలు మాత్రమే ఉపయోగించి చేసే పిజ్జా

Desi Style Amore Mio Special Pizza
Desi Style Amore Mio Special Pizza (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 4, 2026 at 5:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Desi Style Amore Mio Special Pizza : పిజ్జా అనగానే సాధారణంగా పెద్ద నగరాల్లోని తళతళలాడే రెస్టారెంట్లు, ఆధునిక ఓవెన్లు, ప్యాక్ చేసిన చీజ్ వంటి దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాటా రోడ్ పరిధిలోని బయాంగ్‌డీహ్-జరియా అనే గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మీకు పిజ్జా అత్యంత సాంప్రదాయ రూపంలో దర్శనమిస్తుంది. కొనేళ్ల క్రితం ఇటాలియన్ గ్రామాల్లో ఏ సంప్రదాయ పద్ధతిలో పిజ్జాను తయారు చేసేవారో, ఇప్పటికీ అదే పద్ధతిలో పిజ్జాను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్థానిక మట్టి, కట్టెల పొయ్యిపై తయారుచేసే ఆ పిజ్జా రుచికి ప్రసిద్ధి చెందడమే కాకుండా, దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది? ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కూల్​ క్యాంటీన్ కోసం ప్రారంభం
దశాబ్దాల క్రితం ఇటలీకి చెందిన ఫాదర్ కాల్రో, మేడమ్ హయారీ అనే దంపతులు మత ప్రచారం కోసం ఆ ప్రాంతానికి వచ్చారు. గ్రామస్థులు ఆ ఫాదర్​ను "ఫాదర్ ఇటాలియన్" అని పిలిచేవారు. ఆయన తన మత ప్రచార కార్యక్రమాలతో పాటు ఒక పాఠశాలను కూడా నడిపేవారు. ఆ సమయంలో, పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం క్యాంటీన్ ఉండేది కాదు. ఆ అవసరాన్ని చూసిన ఫాదర్ కాల్రో పిల్లల ఆకలి తీర్చడం కోసం ఇటలీ పల్లెటూరి పద్ధతిలో పిజ్జాను తయారు చేయాలని అనుకున్నారు. ఆధునిక యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానిక వనరులైన మట్టి, ఇటుకలు, కలపను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ‘మట్టి భట్టీ’ (సాంప్రదాయ ఓవెన్)ను రూపొందించారు. అందులోనే పెద్ద సైజు పిజ్జాలను తయారు చేసి విద్యార్థులకు, స్థానికులకు అందించేవారు. రోజులు గడుస్తున్నా కొద్ది ఈ ప్రాంతం పిజ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

Desi Style Amore Mio Special Pizza
అమోర్ మియో పిజ్జాను తయారు చేస్తున్న మహిళ (Etv Bharat)

'నా ప్రేమ' అనే అర్థం వచ్చేలా పేరు
ఆ ప్రత్యేకమైన పిజ్జా కేంద్రాన్ని "అమోర్ మియో" అని పిలుస్తారు. ఇది "నా ప్రేమ" అని అర్థం వచ్చే ఒక ఇటాలియన్ పదం. అయితే కాలక్రమేణా ఆ ఓవెన్, పిజ్జా కేంద్రం దాదాపుగా మూతపడింది. కానీ స్థానిక యువత దాని సామర్థ్యాన్ని గ్రహించి 2014లో దానిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఓవెన్‌ను తిరిగి పునరుద్ధరించి, పిజ్జాల తయారీని ప్రారంభించారు. దాంతో ఇక్కడి యువతకు ఉపాధి కూడా లభిస్తోంది. ఇక్కడ రోజూ వందలాది పిజ్జాలు తయారవుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే రాంచీ నగర వ్యాప్తంగా ప్రజలు పిజ్జా కోసం ఇక్కడికి వస్తారు.

Desi Style Amore Mio Special Pizza
అమోర్ మియో పిజ్జా (Etv Bharat)

తాజా కూరగాయలతో పిజ్జా తయారీ
అమోర్ మియోకు ఉన్న అత్యంత విశిష్ట లక్షణం దాని సహజమైన తాజా పదార్థాలు. ఇక్కడ తయారుచేసే పిజ్జాల్లో ప్యాక్ చేసిన లేదా అధికంగా ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఉపయోగించరు. పిజ్జాల కోసం వాడే చీజ్‌ను స్థానికంగా సేకరిస్తారు. అయితే టమోటాలు, క్యాప్సికమ్ అనేక ఇతర కూరగాయలను సమీపంలోని పొలాల నుంచి తెస్తారు. అందుకే ఇక్కడి పిజ్జాలు మార్కెట్లో లభించే సాధారణ పిజ్జాల కంటే భిన్నంగా, మరింత సహజంగా రుచిగా ఉంటాయి. అలాగే కట్టెల పొయ్యి మీద వండటం వల్ల, పిజ్జాలకు ఒక ప్రత్యేకమైన పొగ వాసన వస్తుంది. ఇది వాటిని ప్రత్యేకంగా నిలుపుతుంది. మట్టి పొయ్యిలో నెమ్మదిగా కాల్చిన బేస్, కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది, ఇది ప్రజలను మళ్లీ మళ్లీ రావాలనిపించేలా చేస్తుంది.

Desi Style Amore Mio Special Pizza
అమోర్ మియో పిజ్జాను తయారు చేస్తున్న సిబ్బంది (Etv Bharat)

ఎటువంటి మార్కెటింగ్​ లేదు
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమోర్ మియో ప్రజాదరణ పొందడానికి ఏ పెద్ద ప్రచార కార్యక్రమం లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ కారణం కాదు. చాలా మంది కస్టమర్లు నోటి మాట ద్వారా ఇక్కడికి వస్తారు. చాలా మంది ఈ ప్రదేశం గురించి స్నేహితులు, బంధువుల ద్వారా విని, ఆ తర్వాత వారే ఇతరులకు చెబుతారు. అందుకే వారాంతాల్లో, సెలవుల్లో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. రుచి, నాణ్యత, ధర పరంగా ఇక్కడి పిజ్జా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని కస్టమర్లు చెబుతారు. పెద్ద బ్రాండ్‌ల కంటే తక్కువ ధరకే మంచి రుచిని అందిస్తుందని చాలామంది అంటారు.

గ్రామానికి ప్రధాన ఆకర్షణ
స్థానిక యువత కృషి వల్ల 'అమోర్ మియో' కేవలం పిజ్జా కేంద్రంగానే కాకుండా, ఒక గ్రామీణ పర్యాటక ఆకర్షణగా కూడా మారుతోంది. సందర్శకులు పిజ్జా రుచి చూడటానికే కాకుండా, సాంప్రదాయ పొయ్యిని చూడటానికి, దాని పనితీరును అర్థం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల చాలా మంది స్థానిక యువతకు ఉపాధి కలుగుతోంది. రైతులకు వారి ఉత్పత్తులకు అదనపు మార్కెట్ కూడా లభించింది. ఈ విధంగా, ఈ కేంద్రం స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా దోహదపడుతోంది.

ఆహారం లేక పశువుల మేత తింటున్న గ్రామస్థులు- ఆకలితో అల్లాడుతున్న ఆదర్శ గ్రామం!

శాకాహారుల గ్రామం: 500 ఏళ్లుగా ఊరి వాళ్లంతా శాకాహారులే- వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరు- ఎందుకో తెలుసా?