Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

ఆసియాలోనే అతిపెద్ద రామ, రావణుల దారు విగ్రహాలు!- బ్రిటీష్​వారిపై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు- 'డేరా బేషా' గురించి మీకు తెలుసా?

1200 ఏళ్ల క్రితం నాటి సంప్రదాయం- కలపతో రామాయణ పాత్రధారుల విగ్రహాలు తయారీ

Dera Besha Tradition Of Badakodanda In Ganjam
Dera Besha Tradition Of Badakodanda In Ganjam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 8:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dera Besha Tradition In Ganjam : భారతీయులకు రామాయణంతో ఎనలేని అనుబంధం ఉంది. హిందువులు తమ పవిత్ర గ్రంథాల్లో ఒకటిగా రామాయణాన్ని భావిస్తారు. అలాగే ఆదర్శమూర్తిగా శ్రీరాముడి కొలుస్తారు. అయితే ఒడిశాలోని గంజాం జిల్లాలో రామాయణంలోని ముఖ్య పాత్రల రూపాలను చెక్కలతో తీర్చిదిద్దారు. ప్రతీ ఏటా కార్తిక పౌర్ణమి నాడు ఈ చెక్క విగ్రహాలను రోడ్డుకు ఇరువైపులా ప్రదర్శిస్తున్నారు. ఈ సంప్రదాయం గత 1200 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో డేరా బేషా సంప్రదాయం అంటే ఏమిటి? చెక్కతో రామాయణంలోని పాత్రలను తీర్చిదిద్దడానికి గల కారణాలు? తదితర విషయాలు తెలుసుకుందాం.

గంజాం జిల్లాలోని బడకోదండ గ్రామంలో డేరా బేషా (డేరా అంటే కట్టడం, బేషా అంటే వస్త్రధారణ అని అర్థం) సంప్రదాయం ఉంది. ఇది రామాయణాన్ని జానపద కళా రూపంలో ప్రత్యేకంగా చూపిస్తుంది. డేరా బేషా అనేది చెక్కతో తయారు చేసిన పెద్ద బొమ్మలకు సంబంధించిన కళ, సంస్కృతి. ఈ డేరా బేషాలో ప్రదర్శించేవి ఆసియాలోనే చెక్కతో తయారుచేసిన అతిపెద్ద విగ్రహాలని ప్రజలు నమ్ముతారు.

కిలోమీటర్ వరకు విగ్రహాలు
డేరా బేషా సందర్భంగా ఏటా కార్తిక పౌర్ణమి నాడు బడకోదండ గ్రామ ప్రధాన రహదారికి ఒకవైపున చెక్కతో తయారుచేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, మరోవైపున రావణుడు, ఇంద్రజిత్, మేఘనాథుడి విగ్రహాలు ఉంటాయి. అలాగే రహదారికి ఇరువైపులా ఒక కిలోమీటరు పొడవునా ముఖానికి పసిడి పూత పూసిన పెద్ద ఏనుగులు, సింహాలు, పులులు, గుర్రాలు, బసవన్నలు వంటి జంతువుల విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలు ఒక పౌరాణిక నాటకాన్ని గుర్తుచేస్తాయి. రామాయణ కాలంలో యుద్ధభూమిని తలపిస్తాయి. ఈ క్రమంలో చెక్కతో తయారుచేసిన రామాయణంలో పాత్రధారుల విగ్రహాలను చూసేందుకు బడకోదండ గ్రామానికి భక్తులు పోటెత్తారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న విగ్రహాలను సందర్శించారు.

Dera Besha Tradition In Ganjam
గంజాంలో 'డేరా బేషా' సంప్రదాయం (ETV Bharat)

"డేరా బేషా కేవలం జానపద కళా ప్రదర్శన కాదు. ఇది కళాత్మక, సాంస్కృతిక మూలాలకు ప్రసిద్ధి చెందిన సజీవ సంప్రదాయం. నైపుణ్యం కలిగిన కళాకారులకు, శతాబ్దాల నాటి చేతిపనులను సజీవంగా ఉంచడం చాలా ముఖ్యం. తర్వాతి తరాలుగా ఈ సంప్రదాయాన్ని అందించాలి" అని గ్రామస్థులు తెలిపారు.

పాల్ధువా చెక్కలతో విగ్రహాలు తయారీ
పాల్ధువా కలపతో తయారుచేసిన ఈ భారీ విగ్రహాలను స్థానికంగా డేరా బేషా అని పిలుస్తారు. ఈ విగ్రహాలు కేవలం చెక్క శిల్ప కళనే కాదు, స్థానిక కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కార్తిక పౌర్ణమి నాడు ఈ విగ్రహాలను రోడ్డుకి ఇరువైపులా, గ్రామ వీధుల్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన గ్రామంలోని గోపీనాథ్ ఆలయం నుంచి జగన్నాథ్, రఘునాథ్, శివాలయం వరకు ఉంటుంది.

Dera Besha Tradition In Ganjam
గంజాంలో 'డేరా బేషా' సంప్రదాయం (ETV Bharat)

1200 ఏళ్ల క్రితం నాటి సంప్రదాయం
డేరా బేషా సంప్రదాయం సుమారు 1,200 క్రితం నాటిదని, ఇది భంజా రాజుల పాలనలో ఉద్భవించిందని సాంస్కృతిక పరిశోధకుడు సన్యాసి మహారాణా తెలిపారు. డేరా బేషా అంటే విగ్రహాలను కట్టడం లేదా ప్రతిష్టించడం అని అర్థమన్నారు. కొంతమంది చరిత్రకారులు ఈ ఆచారం బ్రిటిష్ సైన్యంపై స్థానిక రాజు ప్రతీకాత్మక విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక అని నమ్ముతారని పేర్కొన్నారు. భంజా పాలకుడిని రాముడిగా, బ్రిటిష్ సైన్యాన్ని రావణుడిగా చూస్తారని వెల్లడించారు. మరికొందరు డేరా బేషా సంప్రదాయానికి ఆధ్యాత్మికను జోడించడం వల్ల ఒడిశా జానపద కళ, చెక్కతో విగ్రహాలను చెక్కే హస్తకళాకారులను కాపాడే ప్రయత్నంగా భావిస్తారని స్పష్టం చేశారు. డేరా బేషా ఈ ప్రాంతంలో రామతత్వాన్ని వ్యాప్తి చేస్తోందని మరో సాంస్కృతిక పరిశోధకుడు డాక్టర్ బయమాన్ చుర్చి అభిప్రాయపడ్డారు. చెక్కలతో విగ్రహాలను తయారుచేసిన శిల్పులను అభినందించాలని కోరారు. వారు నేటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు.

Dera Besha Tradition In Ganjam
గంజాంలో 'డేరా బేషా' సంప్రదాయం (ETV Bharat)

గ్రామస్థులు ఏమంటున్నారంటే?
తమ గ్రామంలోని వివిధ ప్రదేశాలలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయని, ఇప్పుడు లవకుశుల విగ్రహాల నిర్మాణం జరుగుతోందన్నారు బడకోదండ వాసి గోపాల్‌చంద్ర బెహెరా. నిధుల కొరత కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైందని అన్నారు. చాలా పాత శిల్పాలు దెబ్బతిన్నాయన్నారు. తాము వాటిని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు, బడకోదండకు వారసత్వ గ్రామ హోదా లభించినప్పటికీ, డేరా బేషా సంప్రదాయం నిర్వహణకు ప్రభుత్వం నుంచి మద్దతు లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం గత వైభవాన్ని తిరిగి పొందేందుకు, ఒడిశాలో అత్యంత అసాధారణమైన జానపద కళా సంప్రదాయాలలో ఒకటిగా నిలిచేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.

Dera Besha Tradition In Ganjam
గంజాంలో 'డేరా బేషా' సంప్రదాయం (ETV Bharat)
Dera Besha Tradition In Ganjam
గంజాంలో 'డేరా బేషా' సంప్రదాయం (ETV Bharat)

భారతీయ మల్లయోధుడి డాక్యుమెంటరీ- అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ- ఇంతకీ ఎవరీ బాడీ బిల్డర్​?

ఆదర్శప్రాయంగా నిలుస్తున్న గ్రామీణ మహిళలు- కృత్రిమ పూలతో స్వయం ఉపాధి- లక్షల్లో సంపాదన!