రూ.180 కోట్ల సైబర్ మోసాల నెట్‌వర్క్- ఛేదించిన దిల్లీ పోలీసులు
రూ. 180 కోట్ల సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించిన దిల్లీ పోలీసులు - ముఠాతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Published : January 5, 2026 at 1:33 PM IST
Delhi Cyber Crime Operation : సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతూ దిల్లీ పోలీసులు శనివారం ఒక భారీ సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. 'ఆపరేషన్ సై-హాక్' (Operation Cy-Hawk) పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, నకిలీ కంపెనీలు, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా అక్రమ సొమ్మును చలామణి చేస్తున్న ఇద్దరు కీలక నిందితులను దిల్లీ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠాకు సుమారు రూ.180 కోట్ల విలువైన 176 సైబర్ మోసాలతో సంబంధం ఉన్నట్లు తేలింది.
ఆపరేషన్ సై-హాక్ వ్యూహం
వ్యవస్థీకృత సైబర్ నేరాలను వేళ్లతో సహా పెకిలించడమే లక్ష్యంగా 'ఆపరేషన్ సై-హాక్'ను ప్రారంభించినట్లు దిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును సేకరించడం, బదిలీ చేయడం, దాచిపెట్టడం లాంటి కార్యకలాపాలను అరికట్టడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను ఛేదించారిలా!
ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు దిల్లీలోనే పలు అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలు పోలీసుల దృష్టికి వచ్చాయి. దీనిపై లోతుగా విచారణ జరపగా, ఒక ప్రైవేట్ బ్యాంకు ఖాతాలోకి సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్ము క్రమం తప్పకుండా జమ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ప్రైవేట్ కంపెనీ పేరిట తెరిచిన ఈ ఖాతాను 'మ్యూల్ అకౌంట్' (నిధుల మళ్లింపు ఖాతా)గా వాడుతున్నట్లు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు మనీ లాండరింగ్ కోసం ఏకంగా 20 నకిలీ కంపెనీలను సృష్టించి, ఎలాంటి అనుమానం రాకుండా పలు దశల్లో నిధులను మళ్లించినట్లు గుర్తించారు.
దేశవ్యాప్తంగా 176 కేసులు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన సైబర్ మోసాల సొమ్మును ఈ షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసేవారు. తద్వారా అసలు మూలాలను, ఖాతాదారులు (బెనిఫీషియరీ) వివరాలను గుర్తించడం కష్టతరం చేసేవారని పోలీసులు తెలిపారు. ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) డేటా విశ్లేషణ ప్రకారం, ఈ ఖాతాలకు 176 సైబర్ మోసాల కేసులతో సంబంధం ఉందని, వీటి విలువ సుమారు రూ.180 కోట్లు ఉంటుందని చతెలిపారు.
దర్యాప్తు ముమ్మరం
ఈ సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌లో ఒక వ్యక్తిని ముందుంచి నకిలీ కంపెనీల పేరిట ఖాతాలు తెరిపించి, తెర వెనుక నుంచి అసలు సూత్రధారులు కార్యకలాపాలు సాగించేవారని డీసీపీ వెల్లడించారు. దర్యాప్తునకు సహకరించకపోవడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన సుశీల్ చావ్లా, రాజేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను, బ్యాంక్ ఖాతా వివరాలను దేశవ్యాప్తంగా నమోదైన ఇతర కేసులతో సరిపోల్చడానికి 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C)కి పంపామన్నారు. ఈ ముఠాలోని ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.

