ETV Bharat / bharat

టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు- కేంద్ర ఆంక్షలు సమర్థింపు

కేంద్రం ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్‌ వేసిన పిటిషన్‌ తిరస్కరణ- టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు

Delhi High Court on Telegram Ban
Delhi High Court on Telegram Ban (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 19, 2026 at 11:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

Delhi High Court on Telegram Ban : మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్​కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్​పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా ఈ మేరకు తీర్పు వెలువరించారు. నిషేధం విధించటం తీవ్రమైన చర్యేమీ కాదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అసమానతలు కన్పించలేదని, కేంద్రం తీసుకున్న చర్య చాలా చిన్నదన్నారు. టెలిగ్రామ్ సేవలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

"ప్రవేశ పరీక్ష విధానంలో సమగ్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమర్థనీయమే. ఇవి అత్యంత తక్కువ ఆంక్షలతో కూడుకున్నవే. టెలిగ్రామ్‌ యాక్సెస్‌ను నిరోధించే అధికారం కేంద్రానికి ఉంది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం వివరించిన కారణాలు సహేతుకంగానే ఉన్నందున తాత్కాలిక నిషేధం సమంజసమే అని భావిస్తున్నాం. అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అత్యవసర పరిస్థితి దృష్ట్యా, అందించిన కారణాలు సరిపోతాయని, ప్రభుత్వం సెక్షన్ 69ఎలోని విధానాన్ని అనుసరించిందని భావిస్తున్నాం." అని దిల్లీ హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కాగా, భారత సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం, 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఏదైనా ఆన్‌లైన్ సమాచారం, వెబ్‌సైట్లు లేదా అప్లికేషన్‌ల వినియోగాన్ని నిరోధించే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తుంది.

జూన్‌ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో
నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన నేపథ్యంలో దానిని రద్దు చేసి జూన్‌ 21న రీటెస్ట్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని గ్రూపులు టెలిగ్రామ్‌ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల దీనిపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు, మోసపూరిత నెట్‌వర్క్‌లను అరికట్టడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పింది. జూన్‌ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

అయితే, కేంద్రం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వివక్షాపూరితమైన ప్రవర్తన అని, ఆర్టికల్ 14 ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ టెలిగ్రామ్ కోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధమైన నీట్ కంటెంట్‌కు సంబంధించిన 900కు పైగా లింకులను తొలగించామని, ఉల్లంఘనలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్, మాన్యువల్ మోడరేషన్‌ను కూడా ఉపయోగించామని కోర్టుకు చెప్పింది. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టగా, ఈ యాప్‌పై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌ కొత్త డార్క్‌ వెబ్‌గా మారుతోందని, నేరగాళ్లకు సాధనంగా ఉందని తీవ్రంగా మండిపడింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఎక్కువగా వాడుతున్నారని కోర్టుకు చెప్పింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్య అవసరమని చెప్పింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించామని తెలిపింది. అనంతరం దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్‌ చేసి తాజాగా టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

నిషేధంపై టెలిగ్రామ్ పిటిషన్- తీర్పు రిజర్వ్ చేసిన దిల్లీ హైకోర్టు- విచారణ వేళ కీలక వ్యాఖ్యలు

నకిలీ లాయర్లకు చెక్ పెట్టేందుకు 'డిజిటల్ రిజిస్ట్రీ' ఏర్పాటు- కేంద్రం, బీసీఐలకు సుప్రీం నోటీసులు