ETV Bharat / bharat

నిషేధంపై టెలిగ్రామ్ పిటిషన్- తీర్పు రిజర్వ్ చేసిన దిల్లీ హైకోర్టు- విచారణ వేళ కీలక వ్యాఖ్యలు

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్రం విధించిన ఆంక్షలు- 15 కోట్ల మంది వినియోగదారుల హక్కులను ఎలా పరిమితం చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు- టెలిగ్రామ్ కొత్త డార్క్‌వెబ్‌గా మారిందని కేంద్రం వాదన

Delhi HC On Telegram Petition
Delhi HC On Telegram Petition (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 18, 2026 at 7:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Delhi HC On Telegram Petition : నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు ముందు టెలిగ్రామ్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధానికి సంబంధించిన కీలక కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా వాదనలు విన్న జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్, ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం టెలిగ్రామ్ "కొత్త డార్క్‌వెబ్"గా మారిందని, నేరస్థులు, ఉగ్రవాద సంస్థలు, సైబర్ మోసగాళ్లు ఈ వేదికను విస్తృతంగా వినియోగిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ పాత్రపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, టెలిగ్రామ్‌లో ఉన్న ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ నేరాలకు అనుకూలంగా మారిందన్నారు.

ఒక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఏకంగా 40 బాట్లను సృష్టించే అవకాశం ఉందని, ఆ బాట్లు మరిన్ని బాట్లను తయారు చేసి పెద్ద ఎత్తున సమాచారాన్ని వ్యాప్తి చేయగలవని వివరించారు. ఇతర సోషల్ మీడియా వేదికలతో పోలిస్తే టెలిగ్రామ్ నిర్మాణం భిన్నంగా ఉండటంతో నేరస్థులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోందని పేర్కొన్నారు. టెలిగ్రామ్ క్లౌడ్ ఆధారిత వ్యవస్థపై పనిచేస్తుందని, ఒక అకౌంట్‌ను బ్లాక్ చేసినా మరో పేరుతో కొత్త ఖాతాలు సృష్టించడం సులభమని కేంద్రం తెలిపింది. ఈ కారణంగానే పరీక్షా పత్రాల లీక్‌లు, ఉగ్రవాద భావజాల ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి కార్యకలాపాలకు ఇది ప్రధాన వేదికగా మారిందని ఆరోపించింది.

అంతేకాకుండా చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్, డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్ కార్యకలాపాలు, మ్యూల్ బ్యాంక్ ఖాతాల కొనుగోలు-అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. మాల్‌వేర్ సేవలు, గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను దాటివేసే టూల్స్, ఆర్థిక యాప్‌ల ముసుగులో హానికర సాఫ్ట్‌వేర్ పంపిణీ కూడా జరుగుతోందని వివరించింది. సినిమాలు, ఇతర కాపీరైట్ కంటెంట్‌ను అక్రమంగా పంపిణీ చేయడానికి టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని, దీని వల్ల కంటెంట్ సృష్టికర్తలకు భారీ నష్టం కలుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు టెలిగ్రామ్‌కు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయని కూడా పేర్కొంది. అయితే ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది.

"కేవలం కొందరు విద్యార్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో 15 కోట్ల మంది టెలిగ్రామ్ వినియోగదారుల హక్కులను ఎలా పరిమితం చేయగలరు?" అని బెంచ్ ప్రశ్నించింది. ఒక వర్గం హక్కులను కాపాడేందుకు మరో వర్గం హక్కులను పూర్తిగా నిరోధించవచ్చా అనే అంశాన్ని కోర్టు లేవనెత్తింది. పేపర్ లీక్ జరిగిన తర్వాత అది వైరల్ అయితే వెంటనే దానిని ఎలా నియంత్రించగలమని, అప్పటికే నష్టం జరిగిపోదా అని కోర్టు టెలిగ్రామ్‌ను ప్రశ్నించింది. రియల్ టైమ్‌లో పర్యవేక్షణకు సంస్థ వద్ద ఎలాంటి వ్యవస్థ ఉందని కూడా అడిగింది.

దీనికి టెలిగ్రామ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా స్పందిస్తూ, సంస్థ ఇప్పటికే భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. తమపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనురాధ భాసిన్ తీర్పును ప్రస్తావిస్తూ, ఇలాంటి ఆంక్షలు విధించేటప్పుడు అనుపాతికత సూత్రాన్ని పాటించాలని వాదించారు. టెలిగ్రామ్ తన పిటిషన్‌లో కేంద్రం ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద జారీ చేసిన ఆదేశాలను సవాలు చేసింది. అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలను సరైన విధంగా అనుసరించలేదని ఆరోపించింది. సంబంధిత అధికారులు టెలిగ్రామ్ ఛానళ్లను బ్లాక్ చేయాలని ఎలాంటి సిఫారసు చేయలేదని, అయినప్పటికీ కేంద్రం నేరుగా ఆంక్షలు విధించిందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్య అవసరమని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించిందని, మరో ఆదేశంలో జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను నిలిపివేయాలని సూచించిందని వెల్లడించింది. కాగా, టెలిగ్రామ్‌కు దేశంలో సుమారు 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని సంస్థ తెలిపింది. ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారులు, వ్యాపార సంస్థలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వాదించింది. ఇరు పక్షాల వాదనలు పూర్తవడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాతపూర్వక వాదనలను అదే రోజు సాయంత్రం వరకు సమర్పించాలని న్యాయవాదులను ఆదేశించింది.

'దొంగను పట్టుకునే బదులు బాధితుడి ఇంటికి తాళం వేస్తున్నారు'- టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్ గాంధీ

VPNతో పనిచేస్తున్న టెలిగ్రామ్‌ యాప్​- అధికారికంగా బంద్​ చేసినా నో యూజ్​!