ETV Bharat / bharat

దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు- కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట- దిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసిన సీబీఐ కోర్టు

Kejriwal ED Case
Kejriwal ED Case (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 11:13 AM IST

4 Min Read
Choose ETV Bharat

Kejriwal ED Case : దేశ రాజధానిలో ఆప్‌ పతనానికి కారణమైన మద్యం విధాన రూపకల్పనలో అవినీతి హై-ప్రొఫైల్ కేసును దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించారని సీబీఐపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత సహా 23 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో CBI విఫలమైందని పేర్కొంది. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. ఏ సాక్షి, వాంగ్మూలంతో చార్జ్‌షీట్‌లోని అభియోగాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. దిల్లీ మద్యం విధాన రూపకల్పన కేసులో "సౌత్ గ్రూప్" అనే పదాన్ని ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని తెలిపింది.

కన్నీరుపెట్టుకున్న కేజ్రీవాల్
కోర్టు తీర్పు అనంతరం ఆవరణలో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు కేజ్రీవాల్‌. "ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్‌ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేం. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరు. నిరుద్యోగం, దిల్లీలో పొల్యూషన్ గురించి మోదీ మాట్లాడరు. విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోదీ ఆలోచిస్తారు" అని ఆరోపించారు. తాను, మనీశ్ సిసోదియా ఇద్దరూ నిజాయితీపరులు అని కోర్టు చెప్పిందని ఆయన అన్నారు.

"నేను అవినీతిపరుడిని కాదు. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా నిజాయితీపరులని కోర్టు చెప్పింది. నేడు ఈ కేసులోని నిందితులందరినీ కోర్టు విడుదల చేసింది. నిజం గెలుస్తుందని మేం ఎప్పుడూ చెబుతుంటాం. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అమిత్ షా, మోదీ కలిసి ఆప్‌ను అంతం చేయడానికి అతిపెద్ద రాజకీయ కుట్రను పన్నారు. మా పార్టీకి చెందిన ఐదుగురు పెద్ద నాయకులను జైలులో పెట్టారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నా జీవితంలో నేను నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నాను. నేడు కేజ్రీవాల్, మనీశ్ ఆప్ నిజాయితీపరులని కోర్టు పేర్కొంది" అని అన్నారు.

ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ!
"సత్యమేవ జయతే. ఈరోజు మరోసారి బాబా సాహెబ్ అంబేడ్కర్ దార్శనిక ఆలోచన, ఆయన రూపొందించిన రాజ్యాంగం పట్ల నేను గర్వపడుతున్నాను. మోదీ జీ మొత్తం పార్టీ, వారి అన్ని సంస్థలు మమ్మల్ని నిజాయితీ లేనివారని నిరూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, నేడు అరవింద్ కేజ్రీవాల్ - మనీశ్ సిసోదియా చాలా నిజాయితీపరులని నిరూపితమైంది" అని ఆయన అన్నారు.

"సాక్ష్యాధారాలు, వాగ్మూలాలు అన్ని పరిశీలించిన తర్వాత సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నిందితులపై ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని మార్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే, ఈ పాలసీ వాటాదారులు, సంబంధిత సంస్థల ఆమోదంతోనే తయారు చేసినట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ విధానాన్ని లెఫ్టినెంట్‌ గౌవర్నర్‌ కూడా ఆమోందించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను నిందితునిగా చేర్చకుండా మిగిలినవారిని ఏలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించింది. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు, వాస్తవాలు కనుగొనలేదు. ఇదంతా సమగ్ర విచారణ తర్వాత జరిగింది. న్యాయం చేయడానికి ప్రాసిక్యూషన్ ఒక సాధనం మాత్రమే కానీ, ప్రజలచే ఎన్నుకోబడిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను అక్రమంగా ఇరికించడానికి కాదని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ కేసు కొట్టివేసిన తర్వాత, దానికి అనుబంధంగా ఉన్న ఈడీ కేసు కూడా రద్దవుతుంది."

వివేక్‌ జైన్‌, న్యాయవాది

రౌజ్​ అవెన్యూ కోర్టు తీర్పుపై దిల్లీ హైకోర్టులో సవాల్‌
మరోవైపు దిల్లీ మద్యం కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పును దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విడుదల చేయడాన్ని దిల్లీ హైకోర్టులో వెంటనే సవాలు చేస్తామని పేర్కొన్నాయి. దర్యాప్తులోని అనేక అంశాలను ట్రయల్ కోర్టు పరిగణించలేదని, అందుకే అప్పీల్ అవసరమని భావిస్తున్నట్లు తెలిపాయి.

కేసు ఏమిటంటే?
దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబరు చివరికి దానిని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని.. ఆప్‌ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్‌ పాలసీని సవరించేటప్పుడు వీరు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ కుంభకోణంలో భాగంగా దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఇతర ఆప్‌ నేతలు, మాజీ తెలంగాణ ఎంపీ కవితను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

సీబీఐ 2022లో తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆ తర్వాత పలు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. రద్దైన ఎక్సైజ్ పాలసీని తనకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి రూ. 100 కోట్లు చెల్లించారని ఏజెన్సీ ఆరోపించింది. మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్లు దాఖలవ్వగా, వారిలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధల్, అర్జున్ పాండే, రాకేశ్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, చాన్‌ప్రీత్ సింగ్ రాయత్, అరవింద్ కుమార్ సింగ్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పి శరత్ చంద్ర రెడ్డి సహా పలువురు ఉన్నారు.