ETV Bharat / bharat

దిల్లీ పేలుడు ఘటన- పార్లమెంట్ సెషన్​కు ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి: కాంగ్రెస్

దిల్లీ కారు పేలుడు ఘటన ఎఫెక్ట్- వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ డిమాండ్

Delhi Bomb Blast Red Fort :
Delhi Bomb Blast Red Fort : (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 13, 2025 at 6:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Delhi Bomb Blast Red Fort : దిల్లీ పేలుడు ఘటనపై చర్చించేందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందుగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్​ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భవిష్యత్తులో భారత్​పై జరిగే ఏదైనా ఉగ్రదాడిని యుద్ధ చర్యగా పరిగణించాలనే ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు అవుతుందా? అని ప్రశ్నించింది.

'పార్లమెంట్ సమావేశాలు ముందుగా నిర్వహించాలి'
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను షెడ్యూల్ కన్నా ముందుగా నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తద్వారా దిల్లీ పేలుడు ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపొచ్చని తెలిపింది. యూపీఏ హయాంలో ముంబయి ఉగ్రదాడి తర్వాత ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారని గుర్తుచేసింది. ప్రస్తుతం దిల్లీ పేలుడు ఘటనకు ఎవరు జవాబుదారీగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా బాధ్యత వహించాలని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా అన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దిల్లీ పేలుడు జరిగిన 48 గంటల తర్వాత అది ఉగ్రదాడి అని కేంద్ర కేబినెట్ ప్రకటించిందని పవన్ ఖేడా విమర్శించారు. కేంద్ర నిఘా సంస్థలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ దిల్లీలోనే ఉండి నిశితంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ 2,900 కిలోల పేలుడు పదార్థాలు ఫరీదాబాద్‌కు ఎలా చేరుకున్నాయని ఆయన ప్రశ్నించారు. దిల్లీ పేలుడు ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తున్నారని, ప్రజలు జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

'ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా బాధ్యత'
ఉగ్రదాడి జరిగిన ప్రతిసారీ తాము ప్రభుత్వాన్ని అండగా నిలిచామని పవన్ ఖేడా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా అలాగే కేంద్ర సర్కార్​కు మద్దతుగా ఉంటామన్నారు. కానీ ఉగ్రదాడి ఎవరి వైఫల్యం వల్ల జరిగింది? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అనే ప్రశ్నలు లేవనెత్తడం తమ బాధ్యత అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి. దిల్లీ బ్లాస్ట్ చాలా తీవ్రమైన ఘటన. పార్లమెంటులో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాస్త ముందుగానే నిర్వహించాలి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఏదైనా ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పింది. అది ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా?" అని పవన్ ఖేడా ప్రశ్నించారు.

కేంద్ర కేబినెట్ సమావేశం
దిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం బుధవారం జరిగింది. ఈ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్‌ ఖండించింది. దీన్ని కిరాతక ఉగ్ర ఘాతుకంగా అభివర్ణించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

అలాగే దిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల మధ్య సమన్వయంపై కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ సందర్భంగా పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

13 మంది మృతి
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు విడిచారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిఘా సంస్థలు దేశంలోని పలు నగరాలను అప్రమత్తం చేశాయి. దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, ముంబయి వంటి నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.