భారీ ఉగ్రకుట్ర భగ్నం- దావూద్ నెట్‌వర్క్, ISI ముఠాకు చెందిన 9 మంది అరెస్ట్
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన దిల్లీ పోలీసులు- ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 9 మందిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు- వీరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు

Published : May 30, 2026 at 4:03 PM IST
Dawood ISI Nexus Exposed : దిల్లీ పోలీసులు శనివారం భారీ ఉగ్రకుట్నను భగ్నం చేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీరం నెట్‌వర్క్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధమున్న 9 మందిని అరెస్టు చేశారు. ఆ ముష్కరుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ స్థావరాలతో సహా ప్రముఖ మతపరమైన ప్రదేశాలపై ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు.
దేశరాజధానిలో ఉగ్రదాడులకు ప్లాన్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దేశ రాజధాని దిల్లీలో ఉగ్రదాడులు చేయాలనే లక్ష్యంలో ఐఎస్ఐ ఇదంతా చేసింది. ఈ ఉగ్రవాదుల ముఠా (మాడ్యూల్)ను చాలా కాలంగా అత్యంత పకడ్బందీగా పెంచి పోషించింది. కాగా ఈ నెట్‌వర్క్‌లో భాగమైన ముష్కరుల్లో నేపాల్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో అరెస్టు అయిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతున్న హ్యాండర్లతో, అలాగే ముంబయి అండర్‌వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దిల్లీలోని అత్యంత కీలకమైన భద్రతా స్థావరాలు, రక్షణ సిబ్బంది, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని వీరికి నిర్దేశించినట్లు తెలిసింది. అయితే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదుల మాడ్యూల్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. దేశ రాజధానికి ఉన్న తక్షణ ముప్పును విజయవంతంగా నివారించగలిగింది.
ఉగ్రవాదులకు నిధులు ఎలా వస్తున్నాయ్?
దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్- ఈ ఉగ్రముఠాకు నిధులు (ఫండింగ్ ఛానల్స్) ఎలా వస్తున్నాయ్? వాళ్ల రిక్రూట్మెంట్ పద్ధతులు, వాళ్లకు అందిన రవాణా-సహాయక నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించింది. అంతేకాదు ఈ ఉగ్రకుట్రలో పాల్గొన్న హ్యాండ్లర్లు ఎవరు? స్థానికుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
దావుద్ అనుచరుడి అరెస్టు
ఇదిలా ఉండగా, సరిగ్గా నెల రోజుల క్రితం పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహ్మద్ సలీం డోలాను తుర్కియే నుంచి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ విధంగా డి-కంపెనీ నెట్‌వర్క్‌పై ఒక పెద్ద విజయాన్ని సాధించింది.
2020 నుంచి పరారీలో ఉన్న డోలాను, ఇస్తాంబుల్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన నార్కోటిక్స్ క్రైమ్స్ డివిజన్, ఇస్తాంబుల్‌లోని బెయిలిక్దుజు జిల్లాలో అదుపులోకి తీసుకుంది. తర్వాత అతనిని భారత్‌కు అప్పగించి దేశ బహిష్కరణ ప్రక్రియను పూర్తిచేసింది. కాగా ఎన్సీబీ డోలాను భారత్‌కు తీసుకువచ్చి, దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీనితో న్యాయస్థానం ఎన్డీపీఎస్ చట్టం కింద, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఉన్న డోలాను ముంబయికి తరలించేందుకు ఎన్సీబీకి రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసింది.
ఇంతకు ముందు, ముంబయిలోని కుర్లా ప్రాంతంలో పట్టుబడిన దావూద్ అనుచరులు, తాము డోలా నుంచి ఆదేశాలు తీసుకున్నట్లు అంగీకరించారు. దీనితో ఈ హైప్రొఫైల్ అరెస్టు జరిగింది. ఆ సమయంలో వారి నుంచి 126 కిలోల కంటే ఎక్కువగా మెఫెడ్రోన్ డ్రగ్స్, రూ.25,22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
దావూద్ అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని శాసించే కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న డోలానును కస్టడీలోకి తీసుకుంది. అతనిని విచారణ చేస్తే, డీ-కంపెనీ పశ్చిమాసియా, ఐరోపా మీదుగా సరిహద్దులు దాటించి నిషేధిత పదార్థాలను ఎలా రవాణా చేస్తుంది? డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులు తిరిగి వ్యవస్థీకృత నేరాల వైపు ఎలా మళ్లిస్తున్నారు? అందుకు వాడే హవాలా మార్గాలు ఏమిటి? అనేది తెలిసే వీలుంది. అంతేకాదు ముంబయి తదితర రాష్ట్రాల్లో పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం ముఠాల కోసం పనిచేసే యాక్టివ్ స్లీపర్ సెల్స్, డిస్ట్రిబ్యూటర్ల వివరాలు కూడా తెలిసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
భూమి, గాలి, సముద్రంలోనూ భవిష్యత్తులో యుద్ధాలు- ఆపరేషన్ సింధూర్ 2.0కి రెడీ: భారత ఆర్మీ చీఫ్
"విశ్వగురువు అని ప్రగల్భాలు పలకడమే- ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేరు"- మోదీపై రాహుల్ విమర్శలు

