38 కిలోల బంగారం, 60 కిలోల వెండి చోరీ- సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు
దుకాణం మూసివేసి ఆభరణాలు ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఘటన

Published : November 18, 2025 at 8:49 AM IST
Gold Robbery : ఝార్ఖండ్‌లోని హజారీబాద్ జిల్లాలో జరిగిన భారీ దోపిడీ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. జిల్లాలో ఇదే అతిపెద్ద చోరీ కేసుగా పోలీసులు చెబుతున్నారు. జ్యువెల్లరీ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 35 కిలోల బంగారం, 60 కిలోల వెండి, 3 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, హజారీబాగ్ ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బర్హి చౌక్ వద్ద ఇద్దరు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు చేస్తూ జ్యువెల్లరీ దుకాణం సిబ్బందిపై దాడి చేశారు. ఆ తుపాకీ కాల్పుల ధ్వనితో చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. ఘటనా స్థలం వద్ద పోలీసులు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
పట్నా రోడ్‌లోని 'జయ మాతా దీ జువెలర్స్' దుకాణం దగ్గర చోటుచేసుకుంది. దుకాణం మూసివేసి ఆభరణాలు ఇంటికి తీసుకెళ్తున్న సమయంలోనే దుండగులు దాడి చేశారు. తరువాత బైక్‌లపై వేగంగా పట్నా రోడ్ వైపు పారిపోయారు. పారిపోతూ వెళ్లిన మార్గంలో కొన్ని జ్యువెలరీ బాక్స్‌లు కూడా పడి ఉండగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారిపై దాడి- బస్తాలు లాక్కెళ్లిన దుండగులు
దుకాణ యజమాని సురేంద్ర సోని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు చెబుతూ, "దుకాణం మూసివేసి నేను, నా తమ్ముడు రవీంద్ర కుమార్ కలిసి ఆభరణాలను కారులో ఇంటికి తీసుకెళ్తున్నాం. అప్పుడు నలుగురు యువకులు హెల్మెట్‌లు పెట్టుకొని బైక్‌పై వచ్చి, ముందుగా కారుపై ఆయుధాలు చూపించారు. తరువాత వెంటనే కారు గాజును పగలగొట్టి బ్యాగులు, బస్తాలను లాక్కెళ్లారు" అని చెప్పారు. రవీంద్ర కుమార్ దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించినా, వారు ఆయనపై దాడి చేసి తప్పించుకున్నారు. అన్ని జ్యువెలరీలకు ప్రత్యేక గుర్తు ఉందని, వాటిని గుర్తించగలమని వ్యాపారి తెలిపారు.
ఎస్ఐటీ దాడులు- కేసు ఛేదనకు ప్రయత్నాలు
బర్హి డీఎస్పీ అజిత్ కుమార్ బిమల్ మాట్లాడుతూ, "ఘటన జరిగిన వెంటనే హజారీబాగ్ ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐటీ ఏర్పాటు చేశారు. పట్టణాన్ని విడిచి వెళ్లే మార్గాలు, అనుమానితుల చేరుకునే ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగుతోంది" అని వెల్లడించారు. ఎస్ఐటీని పోలీస్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కుమార్, ఇతర సబ్‌ఇన్స్‌పెక్టర్లు సౌరభ్, సుమిత్, రాజబల్లభ్, సుశీల్, మృత్యుంజయ్, సూరజిత్, దీపక్ తదితరులు ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది: బర్హి ఎస్ఐ
బర్హి పోలీస్ ఇన్‌చార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, "వ్యాపారి నుంచి ఫిర్యాదు అందింది. అందులో ఇచ్చిన వివరాల ప్రకారం దర్యాప్తు సాగుతుంది. దొంగిలించిన ఆభరణాల కచ్చితమైన పరిమాణం పోలీసు దర్యాప్తు పూర్తయ్యాకే చెప్పగలం. త్వరలోనే కేసును ఛేదిస్తాం" అని తెలిపారు. ఈ ఘటనతో బర్హి ప్రాంత వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పెద్ద మొత్తంలో ఆభరణాలు దోపిడీ కావడం స్థానిక వ్యాపార సంఘాలను కుదిపేసింది. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వధువులుగా వచ్చారు- మత్తులోకి వెళ్లాక అంతా దోచుకెళ్లారు- అసలు ట్విస్ట్ ఇదే!
మామను హత్య చేసిన మేనకోడలు - అనుమానం రాకూడదని వెండి ఆభరణాల దోపిడీ

