దేశంలోనే మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ 'గ్రీన్ కళాగ్రామ్'- ఎక్కడో తెలుసా?
నిర్మితమవుతోన్న పర్యావరణ అనుకూల 'గ్రీన్ కళాకేంద్రం'- అధునాతన సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం- చిన్నారుల కోసం ప్లే జోన్ ఏర్పాటు

Published : June 9, 2026 at 11:20 AM IST
Eco Friendly Green Kalagram In Bhopal : దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల 'గ్రీన్ కళాకేంద్రం' (కళాగ్రామ్) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్మితమవుతోంది. ప్రపంచ ప్రఖ్యాత 'భారత్ భవన్' కాంప్లెక్స్ సమీపంలో ఎకో ఫ్రెండ్లీ కళాకేంద్రం రూపొందుతోంది. సుమారు రూ.15.78 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న ఈ ప్రాజెక్ట్ కళలు, ప్రకృతి మధ్య అద్భుతమైన సమతుల్యతను నెలకొల్పనుంది. ఈ ప్రాంగణాన్ని పూర్తిగా పర్యావరణ అనుకూల, సుస్థిర సాంకేతికతతో నిర్మించనున్నారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలు ఉండనున్నాయి.
'నిర్మాణ సమయంలో చెట్లకు ఎటువంటి హాని చేయలేదు'
ఈ 'గ్రీన్ కళాకేంద్రం' నిర్మాణం గురించి మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఇళయరాజా వివరించారు. భోపాల్‌లో నిర్మితమవుతున్న ఈ గ్రీన్ కళాకేంద్రం ప్రధాన ఫీచర్ ఏంటంటే పర్యావరణంపై సంపూర్ణ నిబద్ధతను చాటుకోవడమేనన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న సహజ వృక్ష సంపదకు, పాత చెట్లకు ఎటువంటి హాని కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. 'నో-ఫుట్‌ప్రింట్ ఆర్కిటెక్చర్' (పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ముద్ర వేయని నిర్మాణ శైలి) వంటి ఆధునిక పర్యావరణ పరిరక్షణ పద్ధతులను ఉపయోగించి దీనిని రూపొందిస్తున్నామని వెల్లడించారు. గ్రీన్ కళాకేంద్రం వల్ల సమీపంలోని సహజ జల వనరులు దెబ్బతినవని స్పష్టం చేశారు.

500 మంది కూర్చొనేలా ఆంఫిథియేటర్
భోపాల్‌లో నిర్మితమవుతున్న ఈ కళాకేంద్రం కేవలం పర్యావరణ అనుకూల భవనంగానే కాకుండా, ప్రపంచ స్థాయి కళా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 500 మంది ప్రేక్షకులు కూర్చునేలా ఒక భారీ, ఆధునిక బహిరంగ ఆంఫిథియేటర్ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రకృతి ఒడిలో కళా ప్రదర్శనలను ఆస్వాదించేలా ఈ ఆంఫిథియేటర్ రూపకల్పన జరిగిందన్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే కళాకారుల కోసం ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ లైబ్రరీ వంటి పూర్తి స్థాయి సదుపాయాలు కలిగిన ఆర్ట్ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి కళాభిమానులకు తమ సృజనను మెరుగుపరుచుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు.
సౌకర్యాలు ఏంటంటే?
యువ తరానికి కళలు, ప్రకృతితో అనుబంధాన్ని పెంచేందుకు కళాకేంద్రం పరిధిలో ప్రత్యేకంగా 'కిడ్స్ జోన్' (పిల్లల కోసం ప్రత్యేక ప్రాంతం) కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పిల్లలు ఆటల ద్వారా పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ కళల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా ఈ మొత్తం సముదాయాన్ని వాకింగ్ ట్రాక్స్, సహజ రాళ్లతో చేసిన సీటింగ్, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి సీసీటీవీ నిఘా, ఆధునిక అగ్నిమాపక వ్యవస్థలు, దివ్యాంగులు సులభంగా కళాకేంద్రంలోకి వచ్చేందుకు ర్యాంపులు వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి నిర్మాణం పూర్తి
గ్రీన్ కళాగ్రామ్ ప్రాజెక్ట్ లేఅవుట్, డిజైన్‌ను దేశ రాజధాని దిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ హరీశ్ త్రిపాఠి రూపొందించారు. ఆయన రూపొందించిన ఈ సుస్థిర మాస్టర్ ప్లాన్‌లో కాంక్రీటు బదులుగా వెదురు వినియోగం, పునర్వినియోగ కలపను వాడడం, స్థానిక రాళ్లను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. ఈ గ్రీన్ కళాకేంద్రం నిర్మాణం 2026 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని పర్యాటక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యావరణ ప్రేమికులు సైతం హర్షం
ఈ గ్రీన్ కళాకేంద్రం నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే భోపాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోనుంది. ఎందుకంటే భారత్‌లో మొట్టమొదటి ఎకో ఫ్లైండ్లీ గ్రీన్ కళాకేంద్రం ఇదే. అలాగే ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్ లేఅవుట్, డిజైన్‌పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. చెట్లు, మొక్కలను నరకకుండా నిర్మాణం చేపట్టడంపై పర్యావరణ ప్రేమికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నారు.
పారేసిన కొబ్బరి పీచుతో మొక్కల కుండీలు- వివిధ రకాల ఆకారాల్లో అందుబాటులో- వైద్యురాలి వినూత్న ఆలోచన

