రాముడికి పట్టాభిషేకం ఉండదు- పాముకు కిరీటం- 122ఏళ్లుగా వింత ఆచారం!
ఉత్తరకాశీలో అరుదైన రామ్‌లీలా - తెహ్రీ రాజు ఆజ్ఞతో మారిన చరిత్ర - నటులు 14 రోజులు ఇంటికి వెళ్లరు - గుడిలోనే నిద్ర, సంతానం కోసం జనకుడి వేషం

Published : January 6, 2026 at 6:52 AM IST
Unique 122 Year Old Ramlila : రామ్‌లీలా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రావణ సంహారం, ఆ తర్వాత సీతారాముల పట్టాభిషేకం. దేశంలో ఎక్కడ రామ్‌లీలా జరిగినా చివరగా శ్రీరాముడికి కిరీటం పెట్టి వేడుక చేస్తారు. కానీ, ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో మాత్రం రాముడికి పట్టాభిషేకం జరగదు. అక్కడ రాముడికి బదులుగా పాముకు కిరీటం పెడతారు. వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక 122 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి రాజు ఆగ్రహం వల్ల మారిన ఈ రామ్‌లీలా కథేంటో, అక్కడ రాముడి బదులు వాసుకి నాగుడికి ఎందుకు పట్టాభిషేకం చేస్తారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
పంట పనులు అయ్యాక
ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు జిల్లా ఉత్తరకాశీ. ఇక్కడ చలికాలం మొదలవ్వగానే సందడి మారుతుంది. రైతులు తమ వ్యవసాయ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత తీరిక దొరకగానే గ్రామీణ ప్రాంతాల్లో రామ్‌లీలా ప్రదర్శనలు మొదలవుతాయి. ప్రతి గ్రామంలోనూ రామ్‌లీలా జరుగుతుంది. కానీ కొన్ని ఊర్లలో మాత్రం కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. భట్వాడి బ్లాక్‌లోని గోర్షాలి గ్రామంలో జరిగే రామ్‌లీలాకు ఒక ప్రత్యేకత ఉంది.

122 ఏళ్ల చరిత్ర
గోర్షాలి గ్రామంలో ఈ రామ్‌లీలా ఈనాటిది కాదు. తెహ్రీ సంస్థానం కాలంలోనే ఇది మొదలైంది. దాదాపు 122 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 1903లో ఆలం సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఈ రామ్‌లీలాను ప్రారంభించారు. తన గురువు మోతీరామ్ నౌటియల్ మార్గదర్శకత్వంలో మొదట తన ఇంట్లోనే సాధన చేసేవారు. మూడేళ్ల పాటు ఇంట్లోనే ప్రాక్టీస్ చేశారు.
రాజుకి కోపం తెప్పించిన కిరీటాలు
అసలు కథ 1907లో మొదలైంది. గ్రామస్థుల సాయంతో వాసుకి నాగ దేవాలయంలో రామ్‌లీలా ప్రదర్శన బహిరంగంగా మొదలైంది. అయితే, ఈ విషయం తెహ్రీ రాజుకి తెలిసింది. రామ్‌లీలాలో నటులు రాజ కిరీటాలు ధరిస్తున్నారని రాజు గూఢచారులు సమాచారం ఇచ్చారు. సామాన్యులు రాజ కిరీటాలు ధరించడం రాజుకి నచ్చలేదు. అది తనకు జరిగిన అవమానంగా ఆయన భావించారు. వెంటనే ఆగ్రహంతో రామ్‌లీలాను నిషేధిస్తూ రాజ శాసనం జారీ చేశారు.
ఒప్పందం కుదిరిందిలా
రాజు నిషేధంతో గ్రామస్థులు ఆవేదన చెందారు. స్థానికులు మత్బర్ సింగ్, అభి సింగ్ రాణాలు అప్పటి అటవీ వ్యాపారులైన ఖండూరి సోదరులను కలిశారు. వారి ద్వారా రాజుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. చివరికి రాజు శాంతించారు. నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ ఒక షరతు పెట్టారు. "రామ్‌లీలా చివర్లో రాముడి పాత్రధారికి పట్టాభిషేకం చేయకూడదు. కేవలం వాసుకి నాగరాజుకు మాత్రమే పట్టాభిషేకం చేయాలి" అని ఆదేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆచారం కొనసాగుతోంది. రామ్‌లీలా ముగింపులో రాముడికి బదులుగా, పాము దేవుడికి ప్రతీకాత్మకంగా పట్టాభిషేకం చేస్తారు.

కఠిన నియమాలు
ఇక్కడ రామ్‌లీలా అంటే ఏదో వినోదం కాదు. ఇదొక దీక్ష. ఈ ఉత్సవాల్లో పాల్గొనే నటులు, కళాకారులు ఎవరూ ఇళ్లకు వెళ్లరు. మొత్తం 14 రోజుల పాటు గుడిలోనే నిద్రపోతారు. ఉదయాన్నే గ్రామంలో ప్రభాత భేరి నిర్వహిస్తారు. సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, రామచరిత మానస్ పారాయణం చేస్తారు. హనుమంతుడి గుడి ముందు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు కఠిన నియమాలను పాటిస్తూ, మనసా వాచా కర్మణా రాముడి సేవలో గడుపుతారు.
పిల్లలు పుట్టాలంటే ఆ వేషం వేయాల్సిందే
గోర్షాలి గ్రామానికి దగ్గర్లో సంగ్రాలి అనే మరో గ్రామం ఉంది. అక్కడ మరో నమ్మకం ఉంది. ఎవరికైతే పిల్లలు పుట్టరో, వారు రామ్‌లీలాలో జనకుడి పాత్ర వేయడానికి పోటీ పడతారు. సంతానం లేని వారు జనకుడి పాత్ర పోషిస్తే కచ్చితంగా పిల్లలు పుడతారని వారి నమ్మకం. ఇది ఆ గ్రామస్థుల ప్రగాఢ విశ్వాసం.

