రైతులను నాశనం చేస్తున్న భారత్, అమెరికా ఒప్పందం: రాహుల్ గాంధీ
వ్యవసాయ రంగంపై భిన్నాభిప్రాయాల కారణంగా నాలుగు నెలలు నిలిచిన ఒప్పందం- 15 నిమిషాల్లో ఎలా పూర్తయింది- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్న

Published : February 28, 2026 at 4:09 PM IST
Rahul On India US Deal : భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ రైతులను నాశనం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏటా భారత్ రూ. 9 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గాంధీ అన్నారు. ఈ మేరకు పంజాబ్‌లో బర్నాలాలో జరిగిన మజ్దూర్ కిసాన్ మహా ర్యాలీలో పాల్గొన్న రాహుల్, పలు వ్యాఖ్యలు చేశారు.
అకస్మాత్తుగా ఎలా కుదిరింది?: రాహుల్
వ్యవసాయ రంగంపై భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. "పెద్ద ప్రశ్న తలెత్తుతుంది, ప్రధానమంత్రి నాలుగు నెలలుగా చేయని పని, ఆయన 15 నిమిషాల్లో ఎందుకు చేశారు?" అని ఆయన అన్నారు. వాణిజ్య ఒప్పందం అకస్మాత్తుగా ఎలా కుదిరిందని పశ్నించారు. ప్రతి సంవత్సరం భారత్ రూ. 9 లక్షల కోట్ల విలువైన యూఎస్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని మోదీ ట్రంప్‌నకు హామీ ఇచ్చారని ఆరోపించారు.
ఆ పుస్తకం కోసం మాట్లాడాలని అనుకున్నా!
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే పుస్తకంపై మాట్లాడాలని అనుకున్నానని, కానీ ఇటీవల లోక్‌సభలో మాట్లాడటానికి తనకు అనుమతి ఇవ్వలేదని రాహుల్ గాంధీ తెలిపారు. సరిహద్దు సమీపంలో చైనా దళాల కదలికల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని ఆ పుస్తకం వివరించిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, భారత్- అమెరికా ఒప్పందంపై మాట్లాడారు. ఇటీవల అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీర్ఘకాలంలో భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి మరొక దేశాన్ని అనుమతిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఆధారపడేలా చేయదా?
డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్‌ను దిగుమతి చేసుకోవడం అంటే జన్యుమార్పిడి చేసిన అమెరికా మొక్కజొన్నను పాడి ఉత్పత్తిదారులకు అందించడమేనని రాహుల్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇది దేశ పాల ఉత్పత్తులను అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా అని ప్రశ్నించారు. సోయా నూనె దిగుమతికి అనుమతిస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సోయా రైతులపై ప్రభావం ఉండదా అని నిలదీశారు.
అదనపు ఉత్పత్తులు అంటే పప్పుధాన్యాలు సహా ఇతర పంటలను దిగుమతులకు భారత మార్కెట్‌ను తెరవాలనే ఒత్తిడిని సూచిస్తోందని రాహుల్ తెలిపారు. వాణిజ్యయేతర అడ్డంకులను తొలగిస్తామంటే భవిష్యత్తులో జన్యుమార్పిడి పంటలపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా!
ఆ తర్వాత అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటేనే, భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్ అన్నారు.
ఒకవేళ మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఉంటే పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారుల శ్రేయస్సును రక్షించే విధంగా చర్చలు జరిపి ఉండేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ, ఆయన ప్రభుత్వం కలిసి రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా పత్తి, వస్త్ర పరిశ్రమ రంగాలపై ఆధారపడి ఉన్న కోట్లాది మంది భారతీయుల కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అనే గొయ్యిలోకి నెట్టివేశారని రాహుల్ గాంధీ విమర్శించారు.

