తమిళనాట 'ఇండియా' కూటమిలో మాటల మంటలు- అధికారంలో వాటా కోసం కాంగ్రెస్ ఆరాటం!
17 మంది ఎమ్మెల్యేలున్నా మంత్రి పదవికి నోచుకోని కాంగ్రెస్- 3 మంత్రి పదవులు ఆఫర్ చేసిన హీరో విజయ్ ?- 'అధికార భాగస్వామ్యం'పై ఇరుపార్టీల ముఖ్యనేతల వాగ్యుద్ధం

Published : January 6, 2026 at 5:49 PM IST
DMK Vs Congress on Power Sharing : ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నతమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యేకించి రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే - కాంగ్రెస్ అధికార కూటమిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత హీరో విజయ్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడిగా పేరొందిన ప్రవీణ్ చక్రవర్తి భేటీ అయ్యాక పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తాను అనేలా హీరో విజయ్ ఆఫర్ ఇచ్చారనే చర్చ మొదలైంది. ఓ వైపు అసెంబ్లీ సీట్ల పంపకాలపై డీఎంకే అధినేత స్టాలిన్‌తో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు విజయ్ ఆఫర్ తెరపైకి రావడం రాజకీయ రగడను రాజేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా డీఎంకే, కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వాగ్యుద్దం జరిగింది. ఈ పరిణామాలపై డీఎంకే, కాంగ్రెస్ శ్రేణుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది ? టీవీకేతో హస్తం పార్టీ చేతులు కలుపుతుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాటా ఎందుకు కోరుతోంది? ఈ కథనంలో చూద్దాం.
"ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుంది. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే, ఎన్జీఓగా మారిపోవాల్సి ఉంటుంది"
జనవరి 3న కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జి గిరీశ్ ఛోడంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో మంటలు రేపుతున్నాయి. గిరీశ్ ఛోడంకర్ మాట్లాడిన తర్వాత వరుసగా కాంగ్రెస్ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావించడం, దానిపై డీఎంకే స్పందించడంతో ఇండియా కూటమిలో వాగ్యుద్ధం మొదలైంది.
కాంగ్రెస్‌కు విజయ్ బిగ్ ఆఫర్ ?
గిరీశ్ ఛోడంకర్ చేసిన తాజా వ్యాఖ్యను బట్టి తమిళనాడు కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. మిత్రపక్షం డీఎంకే నుంచి తాము ఏమేం ఆశిస్తున్నామనే విషయాన్ని గిరీశ్ సూటిగా చెప్పేశారు. అధికారంలో వాటా అంటే మంత్రి పదవులు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే - కాంగ్రెస్ సంకీర్ణ సర్కారే అధికారంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో 173 స్థానాల్లో డీఎంకే, 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. 133 సీట్లను డీఎంకే, 17 సీట్ల కాంగ్రెస్ గెల్చుకున్నాయి. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ ఉన్నా, ఒక్క మంత్రి పదవిని కూడా హస్తం పార్టీకి కేటాయించలేదు. ఈ అంశాన్ని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ గుర్తించారు.2025 డిసెంబరు 5న తనతో భేటీ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తికి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు సిద్ధమైతే కాంగ్రెస్‌కు 38 అసెంబ్లీ సీట్లు, 3 మంత్రి పదవులు ఇస్తానని ప్రవీణ్‌కు విజయ్ చెప్పారంటూ తమిళనాడు మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి.
కాంగ్రెస్‌కు అధికారంలో వాటాపై హాట్ డిబేట్
హీరో విజయ్ ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించి టీవీకేతో చేతులు కలపడం బెటర్ అనే అభిప్రాయం పలువురు కాంగ్రెస్ క్యాడర్‌లో వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యాన్ని బలంగా కోరుకుంటున్నారు అని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఇంఛార్జి క్రిష్ సోదంకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ఈ తరుణం అధికార భాగస్వామ్యం గురించి చర్చించాల్సిన టైం కాదా అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదన్నారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌పై ఎక్స్ వేదికగా అధికార డీఎంకే పార్టీ మాజీ ఎంపీ ఎంఎం అబ్దుల్లా స్పందించారు. డీఎంకే సర్కారుకు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందా? లేదా? అనే టాపిక్‌పై గత ఏడాది కాలంగా పలు సోషల్ మీడియా పేజీల్లో ఆర్ఎస్ఎస్ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కథనాలు ఎక్కడ పుట్టాయి? ఎవరి ద్వారా పుట్టాయి ? అనేది తెలుసుకోకుండా మాణిక్కం ఠాగూర్ స్పందిస్తున్నారని ఎంఎం అబ్దుల్లా వ్యాఖ్యానించారు. డీఎంకే - కాంగ్రెస్ కూటమి కార్యకర్తలలో గందరగోళం సృష్టించడానికి, ఐక్యతను దెబ్బతీసేందుకు ఆర్‌ఎస్ఎస్ సృష్టించిన ఈ కాలం చెల్లిన కథనంలోని అంశాలతో మాణిక్కం ఠాగూర్ మాట్లాడటం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని అబ్దుల్లా ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వంలోని విదుథలై చిరుథైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు థోల్ కప్పియన్ తిరుమావలవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ కూడా ఈ అంశంపై స్పందించారు. తమిళనాడును రక్షించడానికి ఐక్యంగా నిలబడి ఆర్ఎస్ఎస్ శక్తులను తరిమికొడతామని వారు ప్రకటించారు.
అసెంబ్లీ సీట్లు, మంత్రి పదవులపైనే గురి
డీఎంకే పార్టీ మాజీ ఎంపీ ఎంఎం అబ్దుల్లా ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వెంటనే బదులిచ్చారు. తాను ఆర్ఎస్ఎస్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యతిరేకించే వ్యక్తినని, అధికార భాగస్వామ్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రకారమే మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన చర్చల కమిటీ ఛైర్మన్, పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జి గిరీశ్ ఛోడంకర్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే తాను చెప్పానని ఠాగూర్ పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరి అన్నారు. అయితే దీర్ఘకాలంగా నమ్మకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న డీఎంకే చేతిని హస్తం పార్టీ వదలదు అని జనవరి 3న గిరీశ్ ఛోడంకర్ తేల్చి చెప్పారు. కానీ అసెంబ్లీ సీట్లు, మంత్రి పదవుల కేటాయింపులో తమ పార్టీకి తప్పకుండా సముచిత ప్రాధాన్యత దక్కాలన్నారు. దీంతో స్వల్పకాలిక అత్యాశకు పోయి దీర్ఘకాలిక నేస్తం డీఎంకేకు కటీఫ్ చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని తేటతెల్లమైంది.
మాణిక్కం ఠాగూర్ మాట వినం- కాంగ్రెస్ కమిటీయే మాట్లాడాలి : డీఎంకే
కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జి గిరీశ్ ఛోడంకర్ కూడా అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడారని ఈటీవీ భారత్ ప్రతినిధి చెప్పగా డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ ఇలా స్పందించారు. కాంగ్రెస్ శ్రేణులను సంతృప్తిపర్చడానికే వాళ్లు ఇలా మాట్లాడుతుంటారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సీట్ల పంపకాలపై జరిగే చర్చలలోనే ఈ అన్ని అంశాలపై తగిన నిర్ణయాలను తీసుకుంటారని చెప్పారు. డీఎంకేతో పొత్తుపై చర్చించడానికి తమిళనాడు కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, అది మాత్రమే తమతో మాట్లాడాలని ఇలంగోవన్ సూచించారు. మాణిక్కం ఠాగూర్ ఎవరు అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేదా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిలో మాణిక్కం ఠాగూర్ లేరని పేర్కొన్నారు. ఏ పదవిలోనూ లేని మాణిక్కం ఠాగూర్ చెబుతున్న మాటలను తాము ఎందుకు అంగీకరించాలని ఇలంగోవన్ ప్రశ్నించారు. తమిళనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమే ఈవిషయాల్లో మాట్లాడాలని కోరారు.
కాంగ్రెస్ వైపు టీవీకే చూపు
ఇంతకీ హీరో విజయ్‌తో రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తి ఎందుకు భేటీ అయ్యారు ? అనే దానిపై ఇప్పటిదాకా అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. కచ్చితంగా ఆ సమావేశానికి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో ఏదో ఒక రకమైన లింక్ ఉండొచ్చు. ఎన్నికలకు ముందు వీలు కాకపోతే, ఎన్నికల తర్వాత డీఎంకే - కాంగ్రెస్ కూటమిలో చేరాలనే ఆహ్వానం టీవీకే అధినేత హీరో విజయ్‌కు అది ఉండొచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీవీకే పార్టీ సాధించే సీట్లను బట్టి డీఎంకే - కాంగ్రెస్ సర్కారులో సముచిత ప్రాధాన్యత ఇస్తామనే ప్రతిపాదన కూడా అందులో అంతర్లీనంగా దాగి ఉండొచ్చని అంటున్నారు. తాజాగా జనవరి 3న టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ కీలక ప్రకటన చేశారు. లౌకికవాద సూత్రాల ప్రకారం తమకు కాంగ్రెస్ పార్టీ సహజ భాగస్వామి అని ఆయన వెల్లడించారు. ఈవిధమైన ప్రకటనల ద్వారా కాంగ్రెస్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నామనే స్పష్టమైన సందేశాన్ని టీవీకే పంపుతోంది. తమిళనాడులోని దళిత, మైనారిటీవర్గాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. టీవీకేకు కూడా ఆ వర్గాలతో పాటు యువత, మహిళల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. తమతో కాంగ్రెస్ చేతులు కలిపితే సులభంగా పెద్దసంఖ్యలో సీట్లను గెలవొచ్చనే ఆశాభావంతో టీవీకే ఉంది.
ప్రవీణ్ చక్రవర్తి ట్వీట్‌పై రాజకీయ దుమారం
ఇక టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అయిన కొన్ని రోజుల తర్వాత (2025 డిసెంబరు 28న) కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ విభాగం సారథి ప్రవీణ్ చక్రవర్తి కీలకమైన ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడుకే ఎక్కువ అప్పు బకాయీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుకు భారీ అప్పులు ఉండటం ఆందోళనకర అంశమని, వాటిపై ప్రతినెలా భారీగా వడ్డీలను చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యధిక స్థాయిలో జీడీపీ, అప్పుల నిష్పత్తిని కలిగిన రాష్ట్రాల్లోనూ తమిళనాడు 3వ స్థానంలో ఉందని ప్రవీణ్ విశ్లేషించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ కంటే డీఎంకే పాలిత తమిళనాడుకే ఎక్కువ అప్పులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రవీణ్ ట్వీట్ చేసినందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ప్రకటించారు. మిత్రపక్షం డీఎంకేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తాము మౌనంగా ఉండలేమని ఆయన తేల్చి చెప్పారు. డీఎంకేతో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన అనుబంధానికి ఈ స్పందనే నిలువెత్తు నిదర్శనం. ఈ లెక్కన మళ్లీ కాంగ్రెస్ - డీఎంకే జోడీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకడం ఖాయం. తొలిసారి ఎన్నికల సంగ్రామంలో హీరో విజయ్ ఎలాంటి ఫలితాలను సాధిస్తారు ? ఎన్నికల తర్వాత ఏ కూటమి దిశగా అడుగులు వేస్తారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

