కాంగ్రెస్ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతోంది- ముస్లిం లీగ్‌లా ద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ
రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ- హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం- కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు

Published : February 28, 2026 at 1:16 PM IST
Modi Slams Congress In Ajmer : ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చొక్కాలు విప్పి చేపట్టిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. కాంగ్రెస్ ఇప్పుడు 'ముస్లిం లీగ్-మావోయిస్ట్ కాంగ్రెస్'గా మారిందని, దేశప్రతిష్ఠను దిగజార్చేందుకు ఎక్కడ వీలైతే అక్కడ చొరబడేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.రాజస్థాన్‌లోని అజ్మీర్ కాయద్ విశ్రామ్ స్థల్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
#WATCH | Ajmer, Rajasthan: Prime Minister Narendra Modi says, " recently, the world's largest ai summit took place in delhi. prime ministers and presidents from many countries around the world attended the event. leaders of the world's biggest companies also gathered under one… pic.twitter.com/CFzJ0CAnFp
— ANI (@ANI) February 28, 2026
"భారతదేశంపై ముస్లిం లీగ్‌కు ఉన్న విద్వేషమే దేశ విభజనకు కారణమైంది. నేడు కాంగ్రెస్ కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఏఐ సమ్మిట్‌లో నిరసనలు వ్యక్తం చేశారు. వాస్తవానికి వాళ్లు విదేశీ ప్రతినిధుల ముందు భారతదేశాన్ని అవమానించడానికి నాటకాలు ఆడారు. ఏఐ సమ్మిట్‌ను చూసి దేశ ప్రజలు గర్వపడుతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం విదేశీ అతిథుల ముందు దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికల్లో ఓడిపోతోంది. ఆ కోపంతోనే దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఐఎన్‌సీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)గా ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఐఎన్‌సీ లేదు. అది ఎంఎంసీ (ముస్లింలీగ్- మావోయిస్టు కాంగ్రెస్)గా మారింది."
- ప్రధాని మోదీ
మరోవైపు 'మావోయిస్టులు కూడా భారతదేశ శ్రేయస్సును, మన రాజ్యాంగాన్ని, మన విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని చూసి అసూయ పడతారు. వారు మనపై దాడులు చేస్తారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా దేశాన్ని కించపరిచేందుకు, అప్రతిష్ఠపాలు చేసేందుకు ఎక్కడికైనా చొరబడుతుంది' అని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన తప్పులను దేశం ఎన్నటికీ క్షమించదని, దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడం, సాయుధ దళాలను బలహీనపరచడం ప్రతిపక్ష పార్టీకి పాత అలవాటేనని ప్రధాని అన్నారు. 'మన సాయుధ దళాలు తమ పరాక్రమంతో ప్రపంచ గుర్తింపు పొందాయి. కానీ కాంగ్రెస్ నేతలు, మన ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలనే పదేపదే వినిపించారు. దేశానికి ఏది మంచిదో, దేశానికి, పౌరులకు ఏది ప్రయోజనకరమో కాంగ్రెస్ వాటన్నింటినీ వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ రోజు దేశం కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతోంది' అని మోదీ పేర్కొన్నారు.
లీకేజీలకు చెక్
రాజస్థాన్‌లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్ లీకేలు యువత భవిష్యత్తును అంధకారం చేశాయని, ప్రస్తుత బీజేపీ సర్కార్ వాటికి అడ్డుకట్ట వేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 21వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఆయన, "గతంలో పేపర్ లీకేజీ వార్తలు వినేవాళ్లం. ఇప్పుడు నియామక పత్రాల పంపిణీ చూస్తున్నాం" అన్నారు.
ఆడబిడ్డల కోసం
ఇక మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, దేశవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అజ్మీర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. 14 ఏళ్ల వయస్సున్న బాలికలకు ఈ టీకాలను ఉచితంగా అందించే కార్యక్రమం 1.15 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లో రూ.16,680 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, నేడు ఆ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధితో దూసుకుపోతోందని అన్నారు. కాగా, మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్‌ను, ప్రభుత్వం నేడు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, (ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), సబ్-డిస్ట్రిక్ట్, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు) అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల్లో ఈ టీకా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి 'ఇన్ఫార్మ్డ్ కన్సెంట్' తీసుకున్న తర్వాతే ఈ వ్యాక్సినేషన్ టీకా ఇవ్వనున్నారు.
'విశ్వగురువుపై అమెరికా అంచనాకు వచ్చేసింది'- పాక్‌కు ట్రంప్ మద్దతుపై కాంగ్రెస్ విమర్శలు
స్కూల్‌కు డుమ్మా కొడితే మ్యూజిక్కే మ్యూజిక్- విద్యార్థుల ఇళ్లకు మేళతాళాలతో టీచర్

