ETV Bharat / bharat

రూ.22వేల కోట్ల బకాయిలకు రూ.6.5కోట్ల చెల్లింపు- ఇది హెయిర్​ కట్​ కాదు, పూర్తి గుండు: కాంగ్రెస్

దాదాపు 99.97 శాతం 'హెయిర్‌కట్‌'పై కాంగ్రెస్ విమర్శలు- భిన్న తీర్పుల అనంతరం మూడో సభ్యుడిగా నిలేశ్ శర్మ కీలక నిర్ణయం

Congress On NCLT Clearing
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 2:04 PM IST

4 Min Read
Choose ETV Bharat

Congress On NCLT Clearing : వ్యాపారవేత్త, మీడియా రంగ ప్రముఖుడు సుభాశ్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ.22,006.57 కోట్ల మేర రుణదాతల క్లెయిమ్‌లకు కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్​సీఎల్​టీ) ఆమోదం తెలిపింది. దీంతో రుణదాతలకు దాదాపు 99.97 శాతం హెయిర్ కట్‌ తప్పనిసరి కానుండగా, ఆ నిర్ణయంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. సాధారణంగా రుణంలో కొంత మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లించినప్పుడు మిగిలిన మొత్తాన్ని హెయిర్‌కట్‌గా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. అయితే సుభాశ్ చంద్ర కేసులో జరిగినది హెయిర్‌కట్‌ కాదని, పూర్తిగా శిరోముండనం (గుండు) అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

"రూ.22 వేల కోట్లకు పైగా క్లెయిమ్‌లు ఉన్నప్పటికీ కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపునకు ఎన్​సీఎల్​టీ ఆమోదం తెలిపింది. ఇది కేవలం జుట్టు కత్తిరించడం కాదు. ఇది నిజానికి పూర్తిగా గుండు చేయడం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, 2016ను పూర్తిగా అపహాస్యం చేసే చర్య" అని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు. అయితే ఈ విమర్శలపై సుభాశ్ చంద్ర లేదా ఆయన తరఫు నుంచి తక్షణ స్పందన వెలువడలేదు.

రూ.22 వేల కోట్లకు రూ.6.5 కోట్లు
ఎన్​సీఎల్​టీ మంగళవారం సుభాశ్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదించింది. ఈ ప్రణాళిక ప్రకారం అంగీకరించిన రుణదాతల క్లెయిమ్‌లు సుమారు రూ.22,006.57 కోట్లుగా ఉండగా, వారికి చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.6.5 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు ప్రక్రియకు సంబంధించిన ఖర్చుల కోసం కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో రుణగ్రహీత చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి చెల్లించినప్పుడు మిగిలిన మొత్తాన్ని శాతంగా 'హెయిర్‌కట్‌'గా పిలుస్తారు. ఈ కేసులో చెల్లింపు మొత్తం చాలా తక్కువగా ఉండటంతో దాదాపు 99.97 శాతం హెయిర్‌కట్‌ పడినట్లుగా లెక్కిస్తున్నారు.

ఇద్దరు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ కేసులో ఎన్​సీఎల్​టీకి చెందిన ఇద్దరు సభ్యులు తొలుత భిన్నమైన తీర్పులు ఇచ్చారు. దీంతో అభిప్రాయ భేదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ అధ్యక్షుడు నిలేశ్ శర్మను మూడో సభ్యుడిగా నియమించారు. ఆయన మంగళవారం తీర్పు వెలువరించి రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. ఈ ప్రణాళికపై కొంతమంది రుణదాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని రుణదాతలు ప్రతిపాదిత చెల్లింపు ఆచరణ సాధ్యం కానిదని, చట్టపరంగా కూడా సమస్యలు ఉన్నాయని వాదించారు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అభ్యంతరం
ఎన్​సీఎల్​టీ ఉత్తర్వుల ప్రకారం, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు అంగీకరించిన క్లెయిమ్ మొత్తం సుమారు రూ.1,322.39 కోట్లు. అయితే దానికి ప్రతిపాదించిన చెల్లింపు కేవలం రూ.38,09,294 మాత్రమే. అంటే అంగీకరించిన బకాయిలో సుమారు 0.028 శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తున్నట్లు అవుతుందని సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ మొత్తాన్ని రుణదాతలు అంగీకరించాల్సి రావడం సరికాదని పేర్కొంది. అంతేకాకుండా రూ.6.5 కోట్ల చెల్లింపు కూడా ప్రణాళికలో నిశ్చయాత్మకంగా కాకుండా సూచనాత్మకంగా మాత్రమే పేర్కొన్నారని రుణదాతలు వాదించారు. అందువల్ల ఈ ప్రణాళిక తాత్కాలికమైనదని, నిశ్చయాత్మకత లేనందున ఆమోదించకూడదని కోరారు.

80.81 శాతం ఓట్లతో ఆమోదం
అభ్యంతరాలు ఉన్నప్పటికీ రీపేమెంట్ ప్లాన్‌కు అవసరమైన ఓటింగ్ మద్దతు లభించిందని ఎన్​సీఎల్​టీ పేర్కొంది. అభ్యంతరం తెలిపిన రుణదాతలందరి ఓటింగ్ వాటా కలిపి 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. మరోవైపు, ప్రణాళికకు 80.81 శాతం ఓటింగ్ వాటాతో ఆమోదం లభించినట్లు స్పష్టం చేసింది. రుణదాతల కమిటీ తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని కేవలం తమ అభిప్రాయంతో మార్చడం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్ పేర్కొంది.

ఆస్తుల విలువపై కీలక వ్యాఖ్యలు
ఎన్​సీఎల్​టీ సభ్యుడు నిలేశ్ శర్మ 144 పేజీల ఉత్తర్వులో సుభాశ్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేసిన మదింపు ప్రకారం, చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ రీపేమెంట్ ప్లాన్ కింద ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే కూడా తక్కువగా ఉందని తెలిపారు. ప్రణాళికను తిరస్కరిస్తే రుణదాతలు మరింత ఎక్కువ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందనే హామీ లేదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. బదులుగా చంద్ర దివాలా పరిస్థితిలోకి వెళ్తే రికవరీ అవకాశాలు మరింత తగ్గవచ్చని పేర్కొంది.

'రుణదాతల వాణిజ్య నిర్ణయంలో జోక్యం చేసుకోం'
రుణదాతల వాణిజ్య విజ్ఞత స్థానంలో ట్రిబ్యునల్ తన సొంత నిర్ణయాన్ని ప్రవేశపెట్టడం సరైంది కాదని ఎన్​సీఎల్​టీ స్పష్టం చేసింది. పరిష్కార ప్రణాళికలో ప్రతిపాదించిన మొత్తం సరిపోతుందా లేదా అనే విషయాన్ని రుణదాతల నిర్ణయానికి బదులుగా నిర్ణయించలేమని తెలిపింది. ప్రణాళిక ఆమోదమై సుభాశ్ చంద్ర దివాలా ప్రక్రియ నుంచి బయటపడి తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటే, అభ్యంతరం తెలిపిన రుణదాతలు తమ బకాయిలను ప్రధాన రుణదాతల నుంచి రాబట్టుకునే అవకాశాలు మెరుగుపడవచ్చని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.

భారత అథ్లెట్ల నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందా- 2036 ఒలింపిక్స్​కు సిద్ధమవ్వాలి: మోదీ

నేపాల్‌ వరదలతో బయటపడిన చైనా డ్యామ్‌ 'ముప్పు'- భారత్‌కు ప్రమాదమెంత? కేంద్రం వ్యూహమేంటి?