ETV Bharat / bharat

'సోనియా, రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి'- వందేమాతరం వివాదం వేళ ఫిర్యాదు

కాంగ్రెస్ నేతల ప్రవర్తనపై నిష్పాక్షికమైన, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని డిమాండ్- 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు, 2026' చట్టపరమైన నిబంధనలను పరిశీలించాలని సూచన

Sonia Gandhi Vande Mataram Controversy
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 17, 2026 at 10:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

Sonia Gandhi Vande Mataram Controversy : కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలపై తీవ్ర దుమారం రేగుతోంది. జాతీయ గేయం "వందేమాతరం" ఆలపనను అడ్డుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై FIR నమోదు చేయాలని కోరుతూ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆగస్టు 15న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు, 2026' చట్టపరమైన నిబంధనలను పరిశీలించి, కాంగ్రెస్ నేతల ప్రవర్తనపై నిష్పాక్షికమైన, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు కునాల్ వినాయక్, శుభ్ శర్మ ఆగస్టు 16న సంబంధిత దిల్లీ పోలీస్ స్టేషన్ SHOకు ఈ ఫిర్యాదు చేశారు.

ఇందిరా భవన్‌లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ, 'వందేమాతరం' గీతాలాపన కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా సంజ్ఞలు చేశారని, అక్కడున్న వారితో మాట్లాడారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా బహిరంగంగా ప్రచారంలో ఉన్న వీడియో ఫుటేజ్, మీడియా నివేదికలను పిటిషన్​లో జతచేశారు. జాతీయ గీతాలాపన సమయంలో రాహుల్ గాంధీ, "మేము వందేమాతరం పాడటం లేదు" అని అన్నట్లుగా ఉన్న వీడియో ఫుటేజ్‌ను కూడా ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపిత సంజ్ఞలు, ప్రవర్తన వెనుక ఉన్న కచ్చితమైన ఉద్దేశం, ప్రయోజనంపై అధికార యంత్రాంగం విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. జాతీయ గీతానికి అందుబాటులో ఉన్న శిక్షా రక్షణను జాతీయ గేయానికి కూడా విస్తరించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు, 2026' ను ప్రస్తావించారు. ప్రతిపాదిత సవరించిన సెక్షన్ 3 ప్రకారం, జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే లేదా అటువంటి గానంలో నిమగ్నమైన సభకు ఆటంకం కలిగించే వ్యక్తికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.

అదే సమయంలో ఘటన జరిగిన తేదీ, ఫిర్యాదు నమోదు చేసిన తేదీ నాటికి ప్రతిపాదిత సవరణ చట్టపరమైన స్థితిని, అది ఎప్పుడు ప్రారంభమైందో ముందుగా నిర్ధరించుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఆరోపణలను పరిశీలించాలని పోలీసులను కోరారు. జాతీయ గీతం ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అటువంటి గానంలో నిమగ్నమైన సభకు ఆటంకం కలిగించడం వంటి వాటికి సంబంధించిన చట్టపరమైన నిబంధనను ప్రస్తావిస్తూ, శ్యామ్ నారాయణ్ చౌక్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును కూడా ఈ ఫిర్యాదు ఉదహరించారు.

అయితే, చట్టపరమైన స్థితిని ధ్రువీకరించిన తర్వాత వర్తించే చట్ట నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఆ తర్వాతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆరోపిత ప్రవర్తనపై నిష్పాక్షికమైన, నిష్పక్షపాతమైన, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, చట్ట ప్రకారం బాధ్యులుగా తేలిన వ్యక్తులందరిపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ వ్యవహారానికి సంబంధించిన అదనపు ఆడియో-విజువల్ ఆధారాలను, సాక్షుల వివరాలను తదుపరి దర్యాప్తు సమయంలో సమర్పిస్తామని ఫిర్యాదుదారులు స్పష్టం చేశారు.

సోనియా గాంధీపై బీజేపీ నేతల ఫిర్యాదు
అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం కర్ణాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ప్రవర్తన జాతీయ గేయాన్ని అగౌరవపరచడమేనని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల తీవ్రమైన అగౌరవాన్ని కలిగి ఉందని ఆరోపించారు.

'మోదీ హింసాత్మక పాలనకు ఎదురు నిలిచిన యువత'- విద్యార్థినుల ధైర్యాన్ని ప్రశంసించిన రాహుల్

'వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్‌ అవమానించింది- వారికి క్షమాపణలు చెప్పాలి'- అమిత్ షా డిమాండ్‌