ETV Bharat / bharat

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులు- వారి భద్రతపై ఆందోళనలు- తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు

గల్ఫ్ దేశాల్లో నిలిచిపోయిన విమాన సర్వీసులు- ఆ దేశాల్లో ఇరుక్కుపోయిన వేలాది భారతీయులు- వారిని స్వదేశానికి తీసుకొచ్చే దిశగా కేంద్రం కసరత్తు

Thousands of Indians face uncertainty after the airspace is shut down amid tensions.
Thousands of Indians face uncertainty after the airspace is shut down amid tensions. (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 3:31 PM IST

8 Min Read
Choose ETV Bharat

Indians Stranded Middle East : ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ నేపథ్యంలో చాలా పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు ఇరాక్, సిరియా, ఖతర్, బహ్రయిన్, కువైట్ ఉన్నాయి. ఇక పాక్షికంగా గగనతలాన్ని మూసివేసిన దేశాల లిస్టులో యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ ఉన్నాయి. ఇరాన్, ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఎయిర్ పోర్టులు, హోటళ్లపైనా డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా సహా గల్ఫ్ దేశాల్లోని చాలా ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 1,000కిపైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దీనివల్ల ప్రతిరోజు సగటున 90వేల మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు, టెక్ నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న తరుణంలో అక్కడున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కర్ణాటక ముందడుగు!
మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భారతీయుల భద్రత అంశాన్ని తొలుత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. దీనిపై భారత విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలిని రజనీశ్ వివరణాత్మక నివేదికను అందించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి భారతీయుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్న అంశాన్ని అందులో హైలైట్ చేశారు. కర్ణాటక రాష్ట్ర సర్కారు తన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను ఇప్పటికే యాక్టివేట్ చేసిందని కేంద్రానికి తెలిపారు. రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ద్వారా 24 గంటల హెల్ప్ లైన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ ప్రారంభించాలి!
"ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ దాడుల తరువాత మిడిల్ ఈస్ట్‌లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న పంజాబీలు, భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలామంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వాళ్లను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలి. ఈదిశగా చొరవ చూపాలని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. విమాన మార్గాలను తిరిగి తెరిచిన వెంటనే, భారతీయ పౌరులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ ప్రారంభించాలని కోరుతున్నాను" అని పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.

కేంద్రాన్ని సాయం కోరాం : కేరళ
"మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాల్లో ఎయిర్ పోర్టులను మూసివేశారు. దీంతో అజర్‌బైజాన్ నుంచి షార్జా మీదుగా కువైట్‌కు వెళ్లాల్సిన ఒక విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ విమానంలో కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఒక కుటుంబం సహా మొత్తం ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. దీనిపై మేం భారత విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపాం. ఆ విమానంలోని భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కోరాం. కొలంబో మార్గం ద్వారా వారిని కేరళకు చేర్చాలని విన్నవించాం" అని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమ విభాగం ఎన్‌ఓఆర్‌కేఏ రూట్స్ సంస్థ వెల్లడించింది.

భారత ప్రభుత్వం ఏం చేస్తోంది?
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భారత ప్రధాని మోదీ మాట్లాడారు. ఈవివరాలతో ఒక ప్రకటనను భారత ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయాల్లో యూఏఈకి భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణనష్టానికి మోదీ సంతాపం తెలిపారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి మద్దతు ఇస్తామని వెల్లడించారు.

భారతీయులను తీసుకురావడంపై చర్చలు
"ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి అస్థిరంగా, ఆందోళనకరంగా ఉంది. ఇలాంటప్పుడు విమాన సర్వీసుల రాకపోకలు ముప్పును కలిగిస్తాయి. అయితే, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై మేం దృష్టి సారించాం. దీనిపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రవాస భారతీయులకు ప్రభుత్వం మద్దుతను అందిస్తుంది" అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

భారతీయ పౌరులకు సహాయం చేయడానికి చర్యలు : భద్రతా కేబినెట్ కమిటీ
మిడిల్ ఈస్ట్‌లో సైనిక ఘర్షణ, భారతీయ పౌరుల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ఈ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల వల్ల ప్రభావితం అవుతున్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అవసరమైన, ఆచరణీయమైన చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాలన్నింటినీ ఆదేశాలు జారీచేసింది. గల్ఫ్ దేశాల మీదుగా రాకపోకలు సాగించే భారతీయ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రాంతీయ భద్రత, వాణిజ్య కార్యకలాపాలపై పడే ప్రభావాలపైనా ఈ సమావేశంలో చర్చించారు.

మేం దుబాయ్‌లో ఇరుక్కుపోయాం
"మేం హాలిడే ట్రిప్ కోసం కుటుంబాలతో కలిసి దుబాయ్‌కు వచ్చాం. మార్చి 1న మేం రాజస్థాన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో దుబాయ్‌లోని హోటల్‌లో ఉంటున్నాం. ఇక్కడ హోటల్ ఛార్జీలు, అదనపు ట్యాక్సులు భారీగా ఉన్నాయి. ఆహార ఏర్పాట్లకూ బాగానే ఖర్చు వస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో అత్యవసర సేవలు మాత్రమే నడుస్తున్నాయి. దాడుల భయంతో మేం హోటల్ బయటికి వెళ్లడం లేదు. మాలాగ విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయ టూరిస్టులకు భారత ప్రభుత్వం మద్దతును అందించాలి" అని రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన వ్యాపారులు నరేంద్ర ఖండేల్వాల్, నావల్ కిశోర్ గార్గ్ ఇంటర్నెట్ కాల్ ద్వారా చెప్పారు.

వాళ్లు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం
"మా కుటుంబం దుబాయ్‌లో సురక్షితంగానే ఉంది. కానీ విమానాల రాకపోకలకు సంబంధించిన పరిస్థితి అస్పష్టంగా ఉండటంతో ఆందోళన కలుగుతోంది. ఇక్కడి బంధువులు, శ్రేయోభిలాషులు నిరంతరం వాళ్లతో మాట్లాడుతున్నారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు" అని రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన నావల్ కిశోర్ గార్గ్ సోదరుడు పవన్ కుమార్ తెలిపారు.

దుబాయ్‌లో చిక్కుకున్న 23 మహారాష్ట్ర పౌరులు
"మహారాష్ట్రలోని ఠాణె నుంచి 23 మంది కలిసి దుబాయ్‌ టూర్‌కు వచ్చాం. ఈ టూర్‌కు వచ్చిన వారిలో 12 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. మార్చి 1నే మేం మహారాష్ట్రకు తిరిగి చేరాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా దుబాయ్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారతదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లడానికి మాకు సహాయాన్ని అందించాలని భారత విదేశాంగ శాఖను కోరాం. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మాకు ఆర్థిక, రవాణా సహాయాన్ని చేయాలి" అని దుబాయ్‌లో చిక్కుకున్న రమేష్ ధల్పే తెలిపారు.

80 మందికిపైగా విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోయారు
"మేం మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించే ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌కు చెందిన 80 మందికిపైగా ఎంబీఏ విద్యార్థులు, నలుగురు ఫ్యాకల్టీ సభ్యులు దుబాయ్ టూరుకు వెళ్లారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వాళ్లంతా దుబాయ్‌లోని హోటల్‌లో ఉంటున్నారు. ఈ సమాచారాన్ని మేం భారత విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖలకు అందించాం. వారిని భారత్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని కోరాం" అని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ ఛైర్‌పర్సన్ తరితా శంకర్, డీన్ జనార్ధన్ పవార్ తెలిపారు.

చేతిలో దిర్హంలు లేక అవస్థలు పడుతున్నాం
"నేను పంజాబ్‌లోని బటిండాలో ఉన్న ఒక విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌ను. మేం దుబాయ్ టూరుకు వచ్చి ఇరుక్కుపోయాం. అకస్మాత్తుగా విమాన సర్వీసును రద్దు చేశాం. ఇలా జరుగుతుందని మాకు తెలియదు కదా. దుబాయ్ టూర్ ఇక ముగుస్తుందని, మేం దిర్హం కరెన్సీ మొత్తం ఖర్చు చేశాం. ఇప్పుడు మా చేతిలో దిర్హం కరెన్సీ లేదు. దీంతో ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోంది. కనీసం మెడిసిన్స్ కొనలేకపోతున్నాం. చాలామంది ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నారు. మాకు సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని నీరు గార్గ్ తెలిపారు.

దుబాయ్ ఎయిర్‌పోర్టు దగ్గరే పేలుడు జరిగింది : పీవీ సింధు
తాను ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తుండగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయానంటూ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కొన్ని గంటల క్రితం ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక పేలుడు జరిగిందని ఆమె తెలిపారు. తన కోచ్ నిలబడిన ప్రదేశానికి దగ్గరలోనే ఆ పేలుడు జరగడంతో ఆందోళనకు గురయ్యామన్నారు. పేలుడు జరిగిన ప్రదేశంలోని మంటలు, పొగలను చూశామని సింధు చెప్పారు. ప్రస్తుతం తాము ఎయిర్ పోర్టు లోపల ఉన్నామని ఆమె వెల్లడించారు. దుబాయ్‌లోని పరిస్థితులను చూస్తుంటే ఆందోళనగా ఉందని పేర్కొన్నారు.

మేమున్న హోటల్ సమీపంలోనే పేలుడు జరిగింది : సినీ నిర్మాత రాజ్ చక్రవర్తి
"నేను, నా భార్య శుభశ్రీ గంగూలీ, కుమారుడు కలిసి దుబాయ్ టూర్‌కు వచ్చాం. ప్రస్తుతం పామ్ జుమేరాలో ఉన్నాం. మా హోటల్‌కు సమీపంలోనే భారీ పేలుడు జరిగింది. అత్యవసరాలు ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని ఇక్కడి అధికార వర్గాలు మాకు సూచించాయి. పేలుళ్ల వల్ల ఆందోళన కలుగుతోంది. ఈ దాడులు ఆగి విమాన సర్వీసులు త్వరగా ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం" అని సినీ నిర్మాత రాజ్ చక్రవర్తి తెలిపారు.

నిజంగా ఇది భయంగొలిపే పరిస్థితి : నటి ఇషా గుప్తా
"నిజంగా ఇది భయంగొలిపే ఉద్రిక్త పరిస్థితి. మా భద్రత కోసం యూఏఈ అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని మేం విశ్వసిస్తున్నాం. దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరి కోసం మేం ప్రార్ధిస్తున్నాం. వీలైనంత త్వరగా ఇండియాకు చేరుకుంటామని భావిస్తున్నాం. మేం దుబాయ్‌లో సేఫ్‌గానే ఉన్నాం" అని నటి ఇషా గుప్తా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

మేం బయటికి వెళ్లి భోజనం చేసి వచ్చాం : కీత్ సెక్వీరా, రోచెల్ రావు
"ఇరాన్ దాడులు చేస్తున్నప్పటికీ, దుబాయ్‌లో సాధారణ జనజీవితానికి పెద్దగా అవాంతరాలు కలగడం లేదు. ఇక్కడ ఎలాంటి భయమూ లేదు. మేం నిర్భయంగా బయటికి వెళ్లి భోజనం చేసి వచ్చాం. యూఏఈ ప్రభుత్వం పరిస్థితిని సమర్ధంగా కంట్రోల్ చేస్తోంది. సాధారణ సమయాల కంటే ఇప్పుడే ఇక్కడి వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సైనిక ఉద్రిక్తతలు ఎలాంటి మలుపును తీసుకుంటాయి అనే దాని కోసం అందరూ వేచిచూస్తున్నారు" అని గతంలో బిగ్ బాస్ షోలో పోటీపడిన కీత్ సెక్వీరా, రోచెల్ రావు పేర్కొన్నారు.

గత రాత్రి నాకు నిద్ర పట్టలేదు : నటి నర్గిస్ ఫక్రీ
"నేను కూడా దుబాయ్‌లో ఇరుక్కుపోయాను. దీంతో మానసిక ఆందోళన కలుగుతోంది. తదుపరిగా ఏం జరుగుతుందో అనే కలవరం వెంటాడుతోంది. గత రాత్రి నేను ప్రశాంతంగా నిద్ర పోలేకపోయాను. దుబాయ్‌పై ఇరాన్ దాడులు జరుగుతుండటంతో, నా మైండ్ అలా హైఅలర్ట్‌లో ఉండిపోయింది" అని పేర్కొంటూ నటి నర్గిస్ ఫక్రీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

'దేశంలో అల్లర్లు జరిగే అవకాశం'- అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశాలు

నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ- పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం