ETV Bharat / bharat

చదివింది 8th క్లాస్- ఆలూ చిప్స్ బిజినెస్‌లో 'చింతామణి' అదుర్స్- వార్షిక టర్నోవర్ రూ.5కోట్ల పైమాటే!

చిప్స్ వ్యాపారంలో రాణిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ - ఒకప్పుడు కూలీ పనులు చేస్తూ జీవనం- ఇప్పుడు ఓ కంపెనీకే డైరెక్టర్, ఛైర్మన్

Woman Potato Chips Business
Woman Potato Chips Business (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 1:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Madhya Pradesh Woman Potato Chips Business: ఆమె చదివింది ఎనిమిదో తరగతి. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టికొచ్చేది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో సతమయ్యేది. అయితే కొన్నాళ్ల క్రితం ఆలూ చిప్స్ వ్యాపారంలోకి దిగింది. ఒకప్పుడు కూలీగా పనిచేసిన ఆమె ఇప్పుడొక కంపెనీకి ఛైర్మన్, డైరెక్టర్. అలాగే ఆమె ఏర్పాటు చేసిన బిజినెస్ టర్నోవర్ రూ.5.05 కోట్లు. అంతలా ఆర్థిక స్వావలంబన సాధించింది. ఈ క్రమంలో ఆలూ చిప్స్ వ్యాపారంలో రాణించిన మహిళ ఎవరు? బిజినెస్‌లో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

రూ.10వేలతో వ్యాపారం ప్రారంభం
మధ్యప్రదేశ్‌ దేవాస్ జిల్లా దత్తోతర్ గ్రామానికి చెందిన చింతామణి పాటిదార్ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 2021లో ఆమె రూ.10,000 పెట్టుబడితో 'దీదీ చిప్స్' పేరిట ఆలూ చిప్స్ బిజినెస్‌ను ప్రారంభించింది. కృషి, పట్టుదల, నాయకత్వ నైపుణ్యాల ద్వారా కేవలం ఐదేళ్ల వ్యవధిలో దీదీ చిప్స్‌ను ఉత్తమ బ్రాండ్‌గా నిలిపింది. చదివిందే ఎనిమిదో తరగతే అయినా వ్యాపార టిప్స్‌ను పాటిస్తూ చిప్స్ బిజినెస్‌లో రాణించింది. ఈ క్రమంలో తాను కోట్లాది రూపాయలు సంపాదించడమే కాకుండా మరి కొందరికి ఉపాధిని సైతం కల్పిస్తోంది.

కూలీ పనులకు గుడ్‌బై చెప్పి బిజినెస్‌లోకి
తాను 2017 జులైలో కృష్ణ స్వయం సహాయక బృందంలో చేరిన తర్వాత తన జీవితం కొత్త మలుపు తిరిగిందని చింతామణ పాటిదార్ తెలిపింది. అప్పుడే కూలీ పనులు మానేసి వ్యాపారంలోకి ప్రవేశించానని పేర్కొంది. 2021లో భారత ప్రభుత్వ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పథకం కింద విజయగంజ్ మండి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించానని వెల్లడించి. ఆ కంపెనీ మొదటి డైరక్టర్‌గా పనిచేశానని, ఆ తర్వాత ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని స్పష్టం చేసింది.

దేవాస్ జిల్లాలోని దత్తోతర్ ప్రాంతంలో బంగాళ దుంపలను ఎక్కువగా సాగు చేస్తారు. రైతులు ఈ దుంపలను కిలో రూ.10 లెక్కను అమ్మేవారు. దీంతో అధికారుల సూచనతో ఆలూ చిప్స్ వ్యాపారంలోకి దిగాలని చింతామణి యోచించింది. తక్కువ ధరకే లభించే బంగాళ దుంపలతో చిప్స్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని గ్రహించింది. ఆ తర్వాత యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ మద్దతుతో బంగాళా దుంప చిప్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

వేరే రాష్ట్రాలకు వ్యాపారం విస్తరణ
దీదీ చిప్స్ వ్యాపారం కేవలం మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ కంపెనీ తమ వ్యాపారాన్ని కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలకు కూడా విస్తరిస్తోంది. ఆ కంపెనీ టర్నోవర్ రూ.5.05 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ కంపెనీకి 608 మంది షేర్‌హోల్డర్స్ ఉన్నారు. "ఈ బ్రాండ్ వెనుక ఉన్న కష్టమంతా మహిళలదే. అందుకే నా వ్యాపారానికి దీదీ చిప్స్ అనే పేరును పెట్టాను. నేడు ఈ ప్లాంట్ నేరుగా 20-25 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఈ ప్లాంట్ వల్ల 125 మంది రైతులకు ఉచిత భూసార పరీక్షలను అందిస్తున్నాం." అని చింతామణి తెలిపింది.

మరికొందరు మహిళలకు ఉపాధి
కార్మికుడిగా పనిచేసిన చింతామణి పాటిదార్ ఓ కంపెనీకి యజమాని స్థాయికి చేరుకుంది. తాను మంచి ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా శక్తివంతం చేస్తోంది.

"మా గ్రామం నుంచి సిటీలోని స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. స్కూల్‌కు వెళ్లాలంటే ప్రతి రోజూ రెండు వైపులా 6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. అలాగే సామాజిక రుగ్మతలు, కట్టుబాట్ల కారణంగా మహిళలకు చదువుకు అనువైన వాతావరణం ఉండేది కాదు. నేను ఎదిగేందుకు సాయపడిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. " అని చింతామణి పాటిదార్ తెలిపింది.