ETV Bharat / bharat

తరగతి గదిలో నిద్రపోయిన విద్యార్థి- స్కూల్‌కు తాళం వేసి వెళ్లిన సిబ్బంది- తొమ్మిది మంది సస్పెన్షన్‌

వేసవి సెలవులకు ముందు చివరి రోజు ప్రభుత్వ పాఠశాలలో ఘటన- తరగతి గదిలో నిద్రపోయిన విద్యార్థిని గుర్తించకుండా తాళం వేసి వెళ్లిన సిబ్బంది- నాలుగు గంటల తర్వాత బాలుడిని రక్షించిన స్థానికుడు

Student Locked In School
Student Locked In School (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 11:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

Student Locked In School : జమ్మూకశ్మీర్​ రాంబన్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తరగతి గదిలో నిద్రపోయాడు. అతడిని గమనించని సిబ్బంది పాఠశాలలకు తాళం వేసి వెళ్లిపోయారు. అలా గంటల తరబడి బాలుడు పాఠశాల భవనంలోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యాశాఖ అధికారులు పాఠశాలలో పనిచేస్తున్న మొత్తం తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

వేసవి సెలవులకు ముందు చివరి రోజు
అధికారుల వివరాల ప్రకారం, బనిహాల్‌ జోన్‌లోని ప్రభుత్వ మిడిల్‌ స్కూల్‌ క్రావాలో 15 రోజుల వేసవి సెలవులు ప్రారంభం కావడానికి ముందు రోజు అనగా జులై 4న ఈ ఘటన జరిగింది. (జమ్ముకశ్మీర్​లో ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి వేసవి సెలవులు ఉంటాయి. కశ్మీర్​ డివిజన్​లో జులై 6- 19వరకు వేసవి సెలవులు ప్రకటించారు) శనివారం పాఠశాల ముగిసిన అనంతరం సిబ్బంది భవానానికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తరగతి గదిలో నిద్రిస్తున్న ఏడో తరగతి విద్యార్థిని ఎవరూ గుర్తించలేదు.

నాలుగు గంటలకుపైగా స్కూల్​లోనే
పాఠశాల మూసివేసిన కొద్ది సేపటి తర్వాత తర్వాత మేల్కొన్న విద్యార్థి బయటకు రావడానికి ప్రయత్నించాడు. పాఠశాలకు తాళం వేసి ఉండటంతో బయటకు రాలేక గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం అరిచాడు. దాదాపు నాలుగు గంటలకుపైగా స్కూల్‌లోనే చిక్కుకుపోయాడు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలుడి అరుపులు విని అక్కడికి చేరుకుని తాళం తీసి విద్యార్థిని బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా చిత్రీకరించారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.

Student Locked In School
సీఈఓ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు (ETV bharat)

తీవ్ర నిర్లక్ష్యంగా పేర్కొన్న అధికారులు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాంబన్‌ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (సీఈఓ) వెంటనే చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏమాత్రం సమర్థించలేమని పేర్కొంటూ ప్రభుత్వ మధ్య పాఠశాల క్రావాలో పనిచేస్తున్న మొత్తం తొమ్మిది మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు సహాయక సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సీఈఓ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ ఘటనను విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంగా పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, భద్రతను నిర్ధారించకుండా పాఠశాలను మూసివేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే జమ్ముకశ్మీర్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం సంబంధిత సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ అయిన సిబ్బంది అదే పాఠశాలకు అనుబంధంగా ఉంటారని విద్యాశాఖ స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ
సస్పెన్షన్‌తో పాటు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బనిహాల్‌ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ను కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. అలాగే బనిహాల్‌ జోనల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌, బ్యాంకూట్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఘటనకు దారితీసిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో గుర్తించాలని ఆదేశించారు. బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడిన నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని సూచించారు.

ఆడుకుంటూ వక్కను మింగిన చిన్నారి- శ్వాసనాళంలో ఇరుక్కుని వెంటిలేటర్​పైకి- అరుదైన చికిత్సతో తిరిగి ప్రాణం!

వధువులకు 'గిల్ట్' మంగళసూత్రాలు పంపిణీ- ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ బిగ్ స్కామ్