ETV Bharat / bharat

తండ్రి ప్రాణాల్ని కాపాడిన 9ఏళ్ల కొడుకు- బాలుడి తెలివికి బ్రేవరీ అవార్డుకు సిఫార్సు!

చేపలు పడుతుండగా మూర్ఛతో నదిలో కొట్టుకుపోయిన చంద్రు- భయపడకుండా తెలివితేటలతో తండ్రిని కాపాడుకున్న నందన్

Boy Saves Father in River
Boy Saves Father in River (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 8:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Boy Saves Father in River : ఆపద సమయంలో పెద్దవాళ్లే భయంతో దిక్కుతోచక నిల్చుంటారు. కానీ కర్ణాటక శివమొగ్గ జిల్లాకు చెందిన ఒక 9 ఏళ్ల బాలుడు మాత్రం కంగారు పడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి నదిలో కొట్టుకుపోతున్న తన తండ్రి ప్రాణాల్ని కాపాడుకున్నాడు. అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శరవతి నదిలో చేపలు పడుతుండగా తండ్రి అకస్మాత్తుగా మూర్ఛ వ్యాధి (ఫిట్స్) రావడం, ఆయన నీటిలో పడి కొట్టుకుపోవడంతో ఆ చిన్నారి తెలివి తేటల్ని ప్రదర్శించి తండ్రి ప్రాణాలు నిలిపాడు. ఈ ఘటన హోసనగర తాలుకా పరిధిలోని వరగోడు గ్రామంలో చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చేపలు పట్టేందుకు వెళ్లి మూర్ఛ రావడంతో!
వరగోడు గ్రామానికి చెందిన చంద్రు, తన కుమారుడు నందన్ గోరగోడు సమీపంలోని శరవతి నదికి చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే నది వద్ద ఉండగా చంద్రుకు అకస్మాత్తుగా మూర్ఛ రావడం, నిమిషాల వ్యవధిలోనే నియంత్రణ కోల్పోయి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయాడు. నీటి ప్రవాహానికి ఆయన దాదాపు 2 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాడు. కళ్ల ముందే తండ్రి నీటిలో కొట్టుకుపోతున్నా కేవలం నాలుగో తరగతే చదువుతున్న 9 ఏళ్ల నందన్ ఏ మాత్రం భయపడలేదు. వేరే ఏ చిన్న పిల్లాడైనా భయంతో ఏడవడం లేదా పారిపోవడం చేసేవారేమో. కానీ నందన్ అలా కాదు. ధైర్యం వీడలేదు. నది ఒడ్డు వెంట పరిగెత్తుతూ తండ్రి కోసం వెతికాడు. ఒంటరిగా తండ్రిని కాపాడటం సాధ్యం కాదని గ్రహించిన బాలుడు వెంటనే సమీపంలోని ఇళ్లకు పరిగెత్తి 'మా నాన్న నదిలో కొట్టుకుపోతున్నాడు. దయచేసి వచ్చి కాపాడండి' అని గ్రామస్థుల్ని సహాయం కోసం వేడుకున్నాడు.

జాకెట్ గుర్తించి తండ్రిని కాపాడుకున్నాడు!
బాలుడి అభ్యర్థనతో గ్రామస్థులు వెంటనే నది వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ప్రవాహంలో తేలుతున్న తన తండ్రి జాకెట్‌ను నందన్ చురుగ్గా గమనించి, గ్రామస్థులకు చూపించాడు. బాలుడు చూపించిన ప్రదేశంలో గాలించగా చంద్రు కనిపించాడు. వెంటనే ఆయనను నీటి నుంచి బయటకు తీసి, ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. చంద్రు- గాయత్రి దంపతుల కుమారుడైన నందన్ గోరగోడు ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. వీరు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవారని స్థానికులు చెబుతున్నారు. ఆపద సమయంలో నందన్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి పట్ల స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నందన్ ఆ సమయంలో ధైర్యంగా లేకపోయి ఉంటే చంద్రు ప్రాణాలు కష్టమయ్యేదని అంటున్నారు.

బాలుడిని అభినందించిన తహసీల్దార్- సాహస పురస్కారానికి సిపార్సు!
ఇక నందన్ కుటుంబం మంగళవారం రోజు హోసనగర తహసీల్దార్ భరత్ రాజ్‌ను కలిసింది. దీనికి సంబంధించి ఈటీవీ భారత్‌తో మాట్లాడిన తహసీల్దార్ ఆ బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. అతడి ధైర్యసాహసాల్ని మెచ్చుకున్నారు. 'నందన్, తన కుటుంబం ఈ రోజు నా కార్యాలయానికి వచ్చారు. ఘటన గురించి తెలిసి ముందు చాలా బాధపడ్డాను. కానీ బాలుడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్నాక అంతే సంతోషం కూడా కలిగింది. తన తండ్రి ప్రమాదంలో ఉన్నప్పుడు బాలుడు ప్రదర్శించిన సమయస్ఫూర్తి నిజంగా ప్రశంసనీయం. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.' అని అన్నారు. బాలుడి ఈ సాహస గాథను జిల్లా యంత్రాంగానికి పంపుతున్నామని, అధికారికంగా సాహస పురస్కారానికి (బ్రేవరీ అవార్డ్) సిఫార్సు చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే నందన్ చూపించిన ధైర్యం వల్ల ఒక కుటుంబం పెద్ద విషాదం నుంచి బయటపడింది. క్షణాల్లో తీసుకున్న సరైన నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

తాత టైమ్‌లో భూవివాదంపై పోరాటం- మనవడి హయాంలో దక్కిన న్యాయం- 59 ఏళ్ల తర్వాత కేసు విజయం!

మందులు మర్చిపోయే బాధ తప్పింది!- విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ- స్మార్ట్ బాటిల్ 'PillSip' ప్రత్యేకతలివే