జంతర్ మంతర్‌లో నిరసనకు CJP పట్టు- పోలీసులకు 24 గంటల డెడ్‌లైన్!
CJP Jantar Mantar Protests : దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి శాంతియుత నిరసనను చేపడతామని సీజేపీ వెల్లడించింది. ఇందుకు అనుమతించాలని పోలీసులకు 24 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది.

Published : October 12, 2026 at 9:46 AM IST
CJP on Jantar Mantar Protests : దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి శాంతియుత నిరసన చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సిద్ధమైంది. ఈ మేరకు అనుమతి కోరేందుకు పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, రత్నా సింగ్ తదితరులు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిరసనకు తేదీ, వేదికను 24 గంటల్లోగా ఖరారు చేయాలని దిల్లీ పోలీసులను కోరారు. అనుమతి ఇవ్వకపోతే తామే మరో నిరసనకు పిలుపునిస్తామని తేల్చిచెప్పారు.
జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన నిర్వహించేందుకు అనుమతి కోరనున్నట్లు సీజేపీ నేత ఆశుతోష్ రాంకా ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాను, సౌరవ్ దాస్, ఇతర పార్టీ నేతలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తేదీని 24 గంటల్లో కేటాయించాలని దిల్లీ పోలీసులను కోరనున్నట్లు పేర్కొన్నారు. ఆ గడువులోగా తేదీ ఖరారు చేయకపోతే తామే మరో ఆందోళనకు పిలుపునిస్తామని రంకా తన పోస్టులో స్పష్టం చేశారు.
'నన్ను, నా కుటుంబాన్ని మానసికంగా వేధించారు'
మరోవైపు దిల్లీ పోలీసులు తనతో పాటు తన కుటుంబాన్ని మానసికంగా వేధించారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇటీవల తనను నిర్బంధించిన సమయంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ పోలీలసులపై త . ఇటీవల తనను నిర్బంధించిన సమయంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అర్ధరాత్రి వేళ పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారని, తనను ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు కూడా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో తనను నిర్బంధించారని తెలిపారు.
"మా నానమ్మ మరణించినట్లు చెప్పి అరెస్టు పత్రాలపై సంతకం చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు నా వద్దకు పోలీసులు వచ్చి మా నానమ్మ మరణించారని, నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెబుతూ అరెస్టు పత్రాలపై సంతకం చేయాలని కోరారు. అయితే, నేను సంతకం చేసేందుకు నిరాకరించా. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారు. అసలు రాత్రి 3.30 గంటలకు తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేయాలని ప్రశ్నించినా పోలీసులు పట్టించుకోలేదు. రోజంతా నన్ను నిర్బంధంలో పెట్టి, ఎక్కడ ఉంచారో చెప్పలేదు. నేను ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నానో, దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నానో కూడా తెలియని పరిస్థితి కల్పించారు. నా ఆచూకీ గురించి తల్లిదండ్రులకు, న్యాయవాదులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అర్ధరాత్రి వేళ ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులకు ఫోన్ చేయించి వారిని ఆందోళనకు గురిచేయాలనుకున్నారు. నాకు జైలు శిక్ష పడబోతోందనే భయాన్ని కుటుంబ సభ్యుల్లో కలిగించేందుకు ప్రయత్నించారు. నన్ను నా కుటుంబాన్ని కూడా దిల్లీ పోలీసులు మానసికంగా వేధించారు. నేను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని కుటుంబానికి ఎందుకు తెలియజేయలేదు. పోలీసులకు మానవత్వం లేదా"
-- అభిజీత్ దీప్కే, సీజేపీ వ్వవస్థాపకుడు
'న్యాయవాది వచ్చే వరకు సంతకం చేయను'
ప్రజా శాంతికి భంగం కలిగించారనే ఆరోపణలతో కూడిన పత్రాలపై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని దీప్కే తెలిపారు. నిరసనల ద్వారా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆ పత్రాల్లో పేర్కొన్నట్లు చెప్పారని వెల్లడించారు. అయితే, నిరసనకు పోలీసులు ఎప్పుడు అనుమతి ఇచ్చారని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. విమానం నుంచి దిగిన వెంటనే తనను అదుపులోకి తీసుకున్నారని, అలాంటప్పుడు నిరసనకు అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలపై సంతకం చేయబోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తనను చట్టపరంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన దీప్కే, న్యాయవాది వచ్చే వరకు ఏ పత్రంపైనా సంతకం చేయబోనని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తాను విద్యావంతుడినని, పత్రాలపై సంతకం చేసే ముందు న్యాయ సలహా తీసుకునే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలను కొందరు అధికారులను రక్షించేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతున్నా పోలీసులు పదేపదే అనుమతి లేదని చెబుతున్నారని పేర్కొన్నారు.
సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తాం- కానీ సుప్రీంకోర్టుకు మార్చ్ చేస్తాం: కేసీ వేణుగోపాల్
'నిరసనలు ఆపేది లేదు- మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడతాం- నియంతృత్వ పతనానికి ఇదే ఆరంభం': అభిజీత్ దీప్కే

