ETV Bharat / bharat

బంగాల్‌లో హింసకు బీజేపీ కుట్ర- ప్రశ్నించినందుకే ఆ దాడి: సీజేపీ

బంగాల్ పర్యటనకు ముందు 15కిపైగా వార్నింగ్​ కాల్స్‌ వచ్చాయని ఆశుతోష్‌ రంకా వెల్లడి- ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నించిన సీజేపీ కార్యకర్త కుటుంబంపై దాడి జరిగిందని ఆరోపణ

CJP On BJP
కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్‌ ఆశుతోష్‌ రంకా (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 17, 2026 at 8:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

CJP On BJP : బంగాల్​లో​ పర్యటించనున్న తమ బృందంపై బీజేపీ హింసకు పాల్పడే అవకాశం ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కో-కన్వీనర్‌ ఆశుతోష్‌ రంకా ఆరోపించారు. సోమవారం బంగాల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తనకు 15కిపైగా ఫోన్‌కాల్స్‌ వచ్చాయని ఆయన తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రభుత్వ వర్గాల్లోని కొందరు వ్యక్తులు తనను అప్రమత్తం చేశారని చెప్పారు. బీజేపీ తమ పర్యటన సందర్భంగా హింసకు పాల్పడేందుకు ప్రణాళిక రచిస్తోందని వారు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రంకా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

'ఈ ప్రకటన చేసినప్పటి నుంచి నాకు 15కిపైగా కాల్స్‌ వచ్చాయి. నా పర్యటన సందర్భంగా బీజేపీ హింసకు పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని పలువురు హెచ్చరించారు' అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేస్తుందో చేయనివ్వాలని, ప్రపంచం మొత్తం దాన్ని గమనిస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలోని యువత మెరుగైన విద్య, మంచి పాఠశాలు కోసం పోరాడుతుంటే బీజేపీ మాత్రం హింసతో స్పందిస్తోందని ఆశుతోష్‌ రంకా ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని కోరుతున్న తమ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని అన్నారు.

బంగాల్​లోని బంకురా జిల్లాలో సీజేపీ కార్యకర్త అబ్దుల్‌ కుటుంబానికి జరిగిన అన్యాయంపై న్యాయం కోరేందుకు తమ బృందం బంగాల్​కు వెళ్తున్నట్లు ఆశుతోష్ రంకా తెలిపారు. 'స్కూల్‌ ఠీక్‌ కరో' పేరుతో సీజేపీ నిర్వహిస్తున్న దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా అబ్దుల్‌ తన గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లినట్లు చెప్పారు. బంకురా జిల్లాలోని ఇండస్‌ బ్లాక్‌లో ఉన్న ఆ పాఠశాలను అబ్దుల్‌ సందర్శించినట్లు తెలిపారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనపై కొందరు దాడి చేశారని ఆరోపించారు. అబ్దుల్‌పై దాడి చేసిన వారు బీజేపీకి చెందిన వారేనని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అబ్దుల్‌ తండ్రిపైనా దాడి జరిగిందని రంకా పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని ఆదివారం ఉదయం మృతి చెందినట్లు వెల్లడించారు. 'అబ్దుల్‌ జంతర్‌ మంతర్‌లో కూడా మా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడిపై దాడి జరిగింది. కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని తండ్రిపైనా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన ఈ ఉదయం మృతి చెందారు' అని ఆశుతోష్ రంకా తెలిపారు. ఈ ఘటనపై న్యాయం జరిగే వరకు తమ బృందం వెనక్కి తగ్గబోదని చెప్పారు. అబ్దుల్‌, అతని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

'దోషులను అరెస్టు చేయాలి'
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కూడా ఆ ఘటనపై స్పందించారు. అబ్దుల్‌ తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారని తెలిపారు. పాఠశాలల అధ్వాన్న పరిస్థితులపై ప్రశ్నించినందుకే అతని కుటుంబంపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ దాడికి బీజేపీకి చెందిన వ్యక్తులు కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరినందుకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. అబ్దుల్‌ కుటుంబానికి సీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. అబ్దుల్‌ తండ్రి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. హింస, బెదిరింపులతో తమ గొంతును అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు. తమ సభ్యులపై దాడులు చేసినా, బెదిరించినా మరింత బలంగా పోరాడతామని అన్నారు. మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 'స్కూల్‌ ఠీక్‌ కరో' కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగుపర్చాలనే లక్ష్యంతో సీజేపీ దేశవ్యాప్తంగా 'స్కూల్‌ ఠీక్‌ కరో' కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడం, అక్కడి మౌలిక వసతులను పరిశీలించడం, సమస్యలను గుర్తించి వాటిపై ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీ నేతలు ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగానే బంకురా జిల్లాలో అబ్దుల్‌ పాఠశాలను సందర్శించినట్లు సీజేపీ పేర్కొంది.

'పార్లమెంట్‌ను అణచివేసి రబ్బర్ స్టాంప్‌గా మార్చలేరు'- ఆ ప్రశ్నలను తిరస్కరించడంపై సీజేపీ ఫైర్​

కేంద్రం ఆదేశాలతో పోలీసులు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు : సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్