ETV Bharat / bharat

NDA vs NDA: బిహార్​ ఎన్డీఏలో లుకలుకలు- LJP ఆశిస్తున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జేడీయూ, HAM

బిహార్ ఎన్‌డీఏ కూటమిలో కలకలం- ఎల్‌జేపీ స్థానాలపై ఆర్‌ఎల్ఎం పార్టీ కన్ను- కేంద్ర మంత్రి చిరాగ్‌కు పెనుసవాల్- జేడీయూకు తలనొప్పిగా రెబల్స్

NDA vs NDA
NDA vs NDA (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : October 15, 2025 at 8:59 PM IST

6 Min Read
Choose ETV Bharat

NDA vs NDA : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. అధికార ఎన్‌డీఏ కూటమిలో, విపక్ష మహాఘట్బంధన్​లో సీట్ల సర్దుబాటు వ్యవహారం చిచ్చుపెడుతోంది. తాజాగా బుధవారం 57 మంది అభ్యర్థులతో జేడీయూ విడుదల చేసిన జాబితాపైనా వాడివేడి చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఆశిస్తున్న నాలుగు సీట్లలోనూ తన అభ్యర్థులను జేడీయూ ప్రకటించింది. జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ ఎందుకిలా చేశారు? ఈ సంక్షోభం పరిష్కారానికి బీజేపీ అగ్రనేతలు ఏం చేయబోతున్నారు? మహాఘట్బంధన్​లో సీట్ల సర్దుబాటుపై సకాలంలో సయోధ్య కుదురుతుందా? రాష్ట్రంలో మూడో కూటమి అవతరిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.

ఎల్‌జేపీ సీట్లపై జేడీయూ, హెచ్​ఏఎం గురి
బిహార్‌లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు విషయంలో మహాఘట్బంధన్ కంటే ఎన్‌డీఏ కూటమే ముందంజలో ఉంది. దీనిపై అక్టోబరు 12నే ఎన్‌డీఏ కూటమి సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, చెరో 101 స్థానాలను బీజేపీ, జేడీయూలకు కేటాయించారు. ఎల్‌జేపీకి 29 సీట్లను, హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్​ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్ఎం)లకు చెరో 6 సీట్లను ఇచ్చారు. ఆ వెంటనే బీజేపీ 71 స్థానాలకు, హిందుస్థానీ అవామ్ మోర్చా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కానీ తాజాగా బుధవారం రోజు 57 మంది అభ్యర్థులతో జేడీయూ విడుదల చేసిన జాబితా ఎన్‌డీఏ కూటమిలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీకి కేటాయించిన సోన్‌బర్సా, మోర్వా, ఎక్మా, రాజ్‌గిర్ సీట్లలోనూ తమ అభ్యర్థులను జేడీయూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హిందుస్థానీ అవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ కూడా సీట్ల కేటాయింపుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన సైతం ఎల్‌జేపీకి కేటాయించిన 2 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించారు.

అదే పనిలో ఆర్‌ఎల్ఎం పార్టీ
ఎన్‌డీఏ కూటమిలోని రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ తమకు మరిన్ని సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఎల్‌జేపీకి కేటాయించిన కొన్ని సీట్లను తాము ఆశిస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా అంటున్నారు. ముఖ్యంగా వైశాలి జిల్లాలోని మహువా సీటుపై ఉపేంద్ర కుష్వాహా బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ సీటులో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా బుధవారం కేంద్రమంత్రి అమిత్​ షాను కలిసి చర్చలు జరిపారు. మహువా స్థానాన్ని వదలుకుంటే పార్టీ మరో ఎమ్మెల్యే సీటుతో పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపేంద్ర కుష్వాహా కూడా చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, తాము పోటీ చేసే స్థానాలను కూటమిలోని మిత్రపక్షాలు ఆశిస్తుండటాన్ని చిరాగ్ తప్పుపడుతున్నారు. ఈ సంక్షోభానికి సత్వర పరిష్కారాన్ని కనుగొనేందుకు, కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతను సాధించేందుకు ప్రస్తుతం జేడీయూ అగ్రనేతలతో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నష్ట నియంత్రణ చర్యల కోసం త్వరలోనే బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తారని అంచనా వేస్తున్నారు.

చిరాగ్ vs నీతీశ్
ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డీఏ కూటమిలో కొరకరాని కొయ్యగా మారారు. కొన్ని నెలల క్రితం సీఎం నీతీశ్ పాలనపై చిరాగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయన్నారు. అందుకే చిరాగ్‌ను తనకు పెద్ద సవాల్ రూపంలో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ ‌కుమార్ చూస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌కు చెందిన ఎల్‌జేపీ 135 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికార ఎన్‌డీఏ కూటమిలో ఉంది. చిరాగ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. మరోవైపు సీఎం నీతీశ్‌కు చెందిన జేడీయూ కూడా స్ట్రాంగ్ పొజిషన్‌లోనే ఉంది. కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుకు ప్రస్తుతం పార్లమెంటులో మెజారిటీ మార్క్ ఉందంటే అందుకు ప్రధాన కారణం జేడీయూయే. ఈ నేపథ్యంలో ఎల్‌జేపీ, జేడీయూలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం తప్ప, బీజేపీ ఎదుట మరో మార్గం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఎల్‌జేపీకి కేటాయించిన నాలుగు అసెంబ్లీ సీట్లను అభ్యర్థులను నీతీశ్ కుమార్ ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ఎల్‌జేపీకి ఇచ్చిన సీట్లలో కొన్నింటిని తమకు ఇవ్వాలని హెచ్​ఏఎం, ఆర్‌ఎల్‌ఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై బీజేపీ పెద్దలు ఏం చేస్తారు? కేటాయించిన సీట్లలో కొన్నింటిని ఎల్‌జేపీ వదులుకుంటుందా? నామినేషన్ల దాఖలు నాటికి ఏం జరుగుతుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

జేడీయూకు తలనొప్పిగా రెబల్స్
సీఎం నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ ఈసారి తీవ్రస్థాయిలో రెబల్స్ బెడదను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పలు అసెంబ్లీ స్థానాల్లో ఆకస్మికంగా మారిపోయిన రాజకీయ సమీకరణాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులో జేడీయూలో చేరారు. అయితే అసెంబ్లీ సీటుపై ఆయనకు నీతీశ్ కచ్చితమైన హామీని ఇవ్వలేకపోయారు. దీంతో అశోక్ కుమార్ జేడీయూకు రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని జేడీయూ నేతలు మంజిత్ సింగ్, శ్యామ్ బహదూర్ వెల్లడించారు. అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై తనకు గ్యారంటీ ఇవ్వాలంటూ గోపాల్ మండల్ అనే జేడీయూ నేత సీఎం నీతీశ్ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. లేదంటే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. ఇటీవలే చాలా మంది జేడీయూ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు లాలూప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ పార్టీలో చేరారు. జేడీయూ నేత, మాజీ మంత్రి జై కుమార్ సింగ్ దినారా అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ ఆ సీటును ఉపేంద్ర కుశ్వాహాకు సీఎం నీతీశ్ కేటాయించారు. దీంతో విస్మయానికి గురై జై కుమార్ సింగ్ జేడీయూకు రాజీనామా చేశారు. పలువురు ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరినప్పటికీ, వారికి టికెట్ల కేటాయింపుపై ప్రస్తుతం రభస జరుగుతోంది.

కూటమిలో చీలిక?

ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు తలెత్తిన వివాదం సద్దుమణుగుతుందా? లేక అలాగే కొనసాగుతుందా? అనే విశ్లేషణలు వెలడుతున్నాయి. కూటమిలో ఏ పార్టీకి ఆశించిన సీట్లు కేటాయించకపోతే రెబల్స్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇది అవసరమైతే మూడు కూటమికి కూాడా దారితీయొచ్చని అభిప్రాయపడుతున్నారు.


"ప్రస్తుతం జేడీయూ బలహీనంగా ఉంది. సీఎం నీతీశ్ కుమార్ సైతం పార్టీ సమావేశాలకు పెద్దగా హాజరుకావడం లేదు. దీనిపై జేడీయూ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. బిహార్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడల్లా లాలూ ప్రసాద్ యాదవ్‌ పక్షాన నీతీశ్ నిలిచారు. ఈసారి మాత్రం అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని పార్టీల్లో సీట్లు దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగొచ్చు. ఈ బెడద జేడీయూకు ఎక్కువగా ఉంది. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చాలా వైరుధ్యాలు ఉన్నాయి. దానిలో చీలిక వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు" - సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ బాగి

మూడో కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు
"రాజకీయాల్లో అకస్మాత్తుగా ఏదైనా జరగొచ్చు. రెండు గంటల్లోనే లెక్కలన్నీ మారిపోవచ్చు. కొత్త కూటములూ ఏర్పడొచ్చు. ఓ వైపు ఎన్‌డీఏ కూటమి, మరోవైపు మహాఘట్బంధన్​ రెండింటిలోనూ సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం నెలకొంది. పార్టీలన్నీ సీట్ల కోసం పోటీపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బిహార్‌లో మూడో రాజకీయ కూటమి ఏర్పాటయ్యే అవకాశాలను మనం తీసిపారేయలేం. వాస్తవానికి అందుకోసం ఇంకా తగినంత సమయం మిగిలి లేదు" అని రాజకీయ విశ్లేషకుడు సునీల్ పాండే తెలిపారు.

బిహార్‌లో జంగిల్‌ రాజ్‌ పాలనను ఇప్పటి యువత చూడలేదు: విపక్షాలపై మోదీ ఫైర్

తేజస్వీ యాదవ్ నామినేషన్​​- డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కూడా!