ETV Bharat / bharat

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం- వైద్య చరిత్రలోనే అరుదైన వ్యాధి- ప్రపంచంలో ఇలాంటివి 10కేసులే!

ప్రమాదకరమైన వ్యాధి బారిన పడిన వ్యక్తి- క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు- ప్రపంచంలోనే ఇలాంటివి 10 కేసులు మాత్రమే నమోదు

Doctors Team Of Scar Operation In Chhattisgarh
Doctors Team Of Scar Operation In Chhattisgarh (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 10:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chhattisgarh First SCAR Case : ఓ వ్యక్తి పళ్లు తోముకోవడం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి పళ్లు తోముకుంటుండగా అకస్మాత్తుగా అతని మెడలోని ప్రధాన రక్తనాళం చిట్లిపోయి, గొంతులో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు మెడ భాగం బాగా ఉబ్బిపోయింది. దీంతో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అతడు స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అత్యంత అరుదైన ప్రమాదంగా భావించే 'స్పాంటనీయస్ కార్టిడ్​ ఆర్టరీ రప్చర్'(SCAR) సంభవించిందని తెలిపారు. ఈ అసాధారణమైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.

కరోటిడ్ ఆర్టరీ అంటే?
ప్రమాద బారిన పడిన బాధితుడిని వైద్యులు వెంటనే అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స ప్రారంభించారు. సీటీ యాంజియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అందులో రోగి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కుడి ధమని 'కరోటిడ్ ఆర్టరీ' చిట్లిపోయి బెలూన్​ ఉబ్బిపోయిందని వైద్యులు గుర్తించారు. దీన్నే 'కరోటిడ్ ఆర్టరీ సూడో అన్యూరిజం' అని పిలుస్తారని డాక్టర్లు తెలిపారు. కరోటిడ్ ధమని అనేది మెడకు రెండు వైపులా ఉన్న ఒక ప్రధాన ధమని, ఇది గుండె నుంచి మెదడుకు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. కరోటిడ్ నాళం చీలిపోవడం లేదా దెబ్బతినడం ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.

రాష్ట్రంలోనే ఇది మొదటి కేసు
సాధారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. కానీ, ఏ ఇతర అనారోగ్యం లేని వ్యక్తికి ఇలా ఉన్నట్లుండి నరం చిట్లడం వైద్య చరిత్రలోనే అత్యంత అరుదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి కేవలం 10 కేసులు కాగా, ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోనే ఇది మొదటి కేసుగా వైద్యులు వెల్లడించారు.

ఈ శస్త్ర చికిత్స ఒక సవాలు!
ఈ అరుదైన ప్రమాదాన్ని గుర్తించిన వైద్యులు వెంటనే బాధితుణ్ని హార్ట్, చెస్ట్, వాస్కులర్ సర్జరీ విభాగానికి తరలించి శస్త్ర చికిత్స చేయడం ప్రారంభించారు. కానీ, ఇది చాలా సవాలుతో కూడుకున్న సున్నితమైన ఆపరేషన్​గా వైద్యులు తెలిపారు. మెడ నరాలు ఉబ్బిపోవడంతో గుండెకు సరఫరా చేసే రక్త నాళాన్ని గర్తించడం కష్టంతో కూడుకున్నదని వివరించారు. అంతేకాకుండా శస్త్ర చికిత్స చేసే సమయంలో పేషెంట్​ మెడ భాగంలోని గడ్డ కట్టిన రక్తం మెదడుకు చేరితే పక్షవాతం లేదా ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశముందని డాక్టర్లు వివరించారు. డాక్టర్ కృష్ణకాంత్ సాహు నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టి, ఎంతో నైపుణ్యంతో 'బోవిన్ పెరికార్డియం ప్యాచ్' ఉపయోగించి, చిట్లిపోయిన రక్తనాళాన్ని సరిచేసి, ఆపరేషన్​ను విజయవంతం చేశారు.

ఆరోగ్య శాఖ మంత్రి అభినందనలు
ఈ అరుదైన ఆపరేషన్​ సక్సెస్ చేసినందుకు వైద్య బృందాన్ని ఛత్తీస్​గఢ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి అభినందించారు. "ఈ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసినందుకు మేకహారా డీన్ డాక్టర్ వివేక్ చౌదరి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ సోంకర్, గుండె, ఛాతీ, వాస్కులర్ సర్జరీ బృందానికి నా అభినందనలు. ఇది మేకారాకు ఒక ముఖ్యమైన విజయం. ఇలాంటి క్లిష్టమైన సర్జరీ జరగడం రాష్ట్ర వైద్య రంగంలోనే ఒక మైలురాయి" అని ఆరోగ్య శాఖ మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ కొనియాడారు.

కోలుకుంటున్న బాధితుడు!
శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కోలుకుంటున్నాడు. ఎటువంటి పక్షవాత లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు. కరోటిడ్ ధమని చీలికలు సాధారణంగా అథెరోస్క్లెరోసిస్, గాయం, బంధన కణజాల రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు లేదా కణితులు ఉన్న రోగుల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఈ రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆకస్మిక కరోటిడ్ ధమని చీలిక అనేదే వైద్య రంగంలో ఓ అరుదైన సంఘటన.

మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్​- తిరిగి తీసే క్రమంలో బాధితురాలు మృతి!

యాంటీబయాటిక్స్​పై మోదీ హెచ్చరికలు- డాక్టర్ల సలహా తప్పనిసరంటున్న నిపుణులు