ETV Bharat / bharat

భారతీయ మల్లయోధుడి డాక్యుమెంటరీ- అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ- ఇంతకీ ఎవరీ బాడీ బిల్డర్​?

చింతారామ్ తిక్రిహా జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ 'ఛత్తీస్‌ గఢ్ కే భీమ్ చింతారామ్'- దీనికి అమెరికాలో గొప్ప గౌరవం

Bheem Chintaram Documentary
Bheem Chintaram Documentary (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 1:16 PM IST

|

Updated : November 9, 2025 at 1:46 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bheem Chintaram Documentary : ఛత్తీస్​గఢ్​కు చెందిన మల్లయోధుడు, సామాజికవేత్త, విద్యావేత్త చింతారామ్ తిక్రిహా జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ 'ఛత్తీస్​గఢ్​ కే భీమ్ చింతారామ్'కి అమెరికాలో గొప్ప గౌరవం లభించింది. న్యూయార్క్​లో జరిగిన అమెరికన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ఈ డాక్యుమెంటరీ బలమైన ఉనికిని చాటుకుంది. నవంబర్ 2న న్యూయార్క్​లోని స్టేటెన్ ఐలాండ్​లోని సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ థియేటర్​లో ప్రదర్శితమైంది. ఆ సమయంలో ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ క్రమంలో చింతారామ్ తిక్రిహా ఎవరు? ఆయన ప్రజలకు చేసిన మేలు ఏంటి? తదితర విషయాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

ఛత్తీస్​గఢ్ భీమ్​గా ముద్దుపేరు
జాంజ్​గిర్ చంపా జిల్లాలోని బుడ్గహాన్​లో చింతారామ్ తిక్రిహా 1880లో జన్మించారు. ఆయన దాతృత్వంలో ముందుండేవారు. అలాగే చాలా కష్టపడి పనిచేసేవారు. అందుకే ఆయన్ను ఆ ప్రాంతవాసులు ఛత్తీస్​గఢ్ భీమ్ అని పిలుచుకునేవారు. చింతారామ్ దినచర్య బ్రహ్మముహూర్తంలో (తెల్లవారుజామున) ప్రారంభమయ్యేది. రైతులతో కలిసి పొలంలో రోజంతా కష్టపడి పనిచేసేవారు. రోజుకు ఆయన 35- 40 రోటీలు, ఒక కేజీ పప్పు, ఒక లీటరు పాలు తాగేవారు. ఈ క్రమంలో చింతారామ్ తిక్రిహా జీవిత కథ ఆధారంగా యువ దర్శకుడు ఎస్.అన్షు ధురంధర్ డాక్యుమెంటరీ తెరకెక్కించారు.

ఈ డాక్యుమెంటరీ న్యూయార్క్​లోని స్టేటెన్ ఐలాండ్​లోని సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ థియేటర్​లో ప్రదర్శితమైంది. 154 దేశాల నుంచి 2,974 చిత్రాలు పోటీగా వచ్చినా, ఎంపిక చేసిన కొన్నింటికి మాత్రమే అవకాశం లభించింది. భారత్ నుంచి మొత్తం ఎనిమిది సినిమాలు స్క్రీనింగ్ కు ఎంపికవ్వగా, అందులో అందులో 'ఛత్తీస్​గఢ్ కే భీమ్ చింతారామ్' ఒకటి. దీంతో సామాజిక కార్యకర్త, విద్యావేత్త చింతారామ్ తిక్రిహాకి గౌరవం లభించినట్లైంది.

Bheem Chintaram Documentary
ఛత్తీస్​గఢ్​కు చెందిన మల్లయోధుడు, సామాజికవేత్త, విద్యావేత్త చింతారామ్ తిక్రిహా (ETV Bharat)

దర్శకుడు ఏమన్నారంటే?
'ఛత్తీస్​గఢ్ కే భీమ్ చింతారామ్' కేవలం సినిమా మాత్రమే కాదని, ఛత్తీస్​గఢ్​లోని ఒక ప్రముఖ నాయకుడి భావజాలాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నమని దర్శకుడు అన్షు ధురంధర్ తెలిపారు. చింతారామ్ చరిత్రను మనం కాపాడుకోకపోతే, భవిష్యత్ తరాలు ఆయన గురించి తెలుసుకోలేవని అభిప్రాయపడ్డారు. ఈ డాక్యుమెంటరీ ఛత్తీస్​గఢ్ గ్రామాల్లో కూడా ఆదర్శప్రాయమైన జీవనశైలి ఉన్న వ్యక్తులు ఉన్నారని నిరూపించే రుజువుని పేర్కొన్నారు.

"ఈ సినిమా ఒక సూపర్ హీరో కథ కాదు. ఇది ఎప్పుడూ కీర్తిని కోరుకోని నిజమైన మనిషి కథ. అతని జీవితం అందరికీ ప్రేరణను ఇస్తుంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఛత్తీస్​గఢ్ నేలలో కూడా ఒక భీమ్ పుట్టాడని ప్రపంచానికి తెలియజేయాలని మేము కోరుకున్నాం. ఇది ఛత్తీస్​గఢ్ నేల పుత్రుడి కథ. ఆయనను ప్రజలు ముద్దుగా ఛత్తీస్​గఢ్ భీమ్ అని పిలుస్తారు. చింతారామ్ లాంటి వ్యక్తి అమెరికాలో పుట్టి ఉంటే, ఆయన జీవిత కథ ఆధారంగా హాలీవుడ్ సినిమా తీసి ఉండేది" అని దర్శకుడు అన్షు ధురంధర్ తెలిపారు.

Bheem Chintaram Documentary
మల్లయోధుడు చింతారామ్ తిక్రిహా డాక్యుమెంటరీపై స్థానికుల స్పందన (ETV Bharat)

స్కూల్, గుడి నిర్మాణం
సమాజంలోని ఒక వర్గం ఆకలితో ఉన్నంత కాలం ఏ సంపన్నుడు సంతోషంగా ఉండలేరని చింతారామ్ తిక్రిహా నమ్మారు. తన గ్రామంలో పాఠశాల, స్కూల్​ను ఏర్పాటు చేశారు. పొలాలకు సాగు నీరు కోసం కాలువలను తవ్వించారు. చింతారామ్ జంతు ప్రేమికుడు కూడా. మూగజీవాలు సైతం ఆకలితో ఉండడాన్ని సహించలేకపోయేవారు. వాటికి ఆహారం అందించేవారు. తన ఇంటి ధాన్యాగారపు తలుపులు నిత్యం తెరిచి ఉండేవి. ఆహారం అవసరం అయినవారు వాటిలో నుంచి తిండి దినుసులను తీసుకెళ్లేవారు. అలాగే చింతారామ్ మల్లయోధుడులా ఉండేవారు. తన ఇంట్లో 12 టన్నుల బరువున్న ఇనుప స్తంభాలను ఎత్తేవారు.

చింతారామ్ ఒక మల్లయోధుడు మాత్రమే కాదని గ్రామస్థులు చెబుతారు. ఆయన ఒక ఆధ్యాత్మకవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త కూడా. తాను భోజనం తినే ముందు ప్రతిరోజూ ఒక పేద వ్యక్తికి ఆహారం పెట్టేవారు. గోసేవ, ఆలయ నిర్మాణం, జానపద సంప్రదాయాల పరిరక్షణ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన తవ్వించిన కాలువలు నేటికీ రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. కాగా, చింతారామ్ వృద్ధాప్య సమస్యలతో చింతారమ్ 1982లో మరణించారు. ఆయన మరణించి 40 ఏళ్లు దాటినా ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు.

Bheem Chintaram Documentary
మల్లయోధుడు చింతారామ్ తిక్రిహా డాక్యుమెంటరీపై స్థానికుల స్పందన (ETV Bharat)

నాలుగు రాష్ట్రాల్లో షూటింగ్
'ఛత్తీస్​గఢ్​ కే భీమ్ చింతారామ్' డాక్యుమెంటరీ షూటింగ్ నాలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఇందులో 250 మందికి పైగా వ్యక్తుల ఇంటర్వ్యూలు ఉన్నాయి, వీరిలో 40శాతం మంది చింతారామ్​ను చూసినవారు, ఆయన గురించి బాగా తెలిసినవారే. కాగా, తన తండ్రి జీవిత చరిత్ర గురించి డాక్యుమెంటరీ తీయడంపై చింతారామ్ కుమారుడు ధనేశ్ తిక్రిహా సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి బలం ఆయన శరీరంలోనే కాదు, ఇతరుల కోసం జీవించాలనే అచంచలమైన కోరికలో ఉందని తెలిపారు. చింతారామ్ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు అన్షు ధురంధర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తమ కుటుంబంలోని పెద్దలు, గ్రామస్థుల నుంచి తన తాత చింతారామ్ గురించి తెలుసుకున్నానని ఆయన మనవడు డాక్టర్ దీపక్ తిక్రిహా తెలిపారు. "చింతారామ్ మా కుటుంబానికి మాత్రమే కాదు. మొత్తం ఛత్తీస్​గఢ్ రాష్ట్రానికి చెందినవ్యక్తి. ఈ రోజు ఆయన జీవితం గురించి సినిమా రూపంలో ప్రపంచానికి తెలియడం మనందరికీ గర్వకారణం" అని దీపక్ అభిప్రాయపడ్డారు.

ఆదర్శప్రాయంగా నిలుస్తున్న గ్రామీణ మహిళలు- కృత్రిమ పూలతో స్వయం ఉపాధి- లక్షల్లో సంపాదన!

200కిపైగా అరుదైన జానపద వాద్యాల సేకరణ- వాటి కోసం మ్యూజియం- రిఖి క్షత్రియ గురించి మీకు తెలుసా?

Last Updated : November 9, 2025 at 1:46 PM IST