ETV Bharat / bharat

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠం- సుప్రీంకోర్టు సీరియస్- క్షమాపణలు చెప్పిన NCERT

ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 8వ తరగతి పాఠ్యపుస్తక వివాదం- ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం

NCERT
NCERT (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 7:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

NCERT Apologises : విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)’ వివాదంలో చిక్కుకుంది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన అంశాలను చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్‌సైట్ నుంచి తొలగించి, పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.

NCERT వివరణ ఇలా!
అత్యున్నత ధర్మానసం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిర్ణయాత్మక లోపం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఎన్‌సీఈఆర్‌టీ అంగీకరించింది. న్యాయవ్యవస్థను తక్కువ చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని, ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటని పేర్కొంది. తాము భారత రాజ్యాంగాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే న్యాయవ్యవస్థను అత్యున్నత గౌరవంతో చూస్తామని పునరుద్ఘాటించింది.

అలాగే, ఎనిమిదో తరగతికి చెందిన సదరు సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని తన అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఇప్పటికే ముద్రించిన పుస్తకాల పంపిణీని తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. వివాదాస్పదమైన ఆ అధ్యాయాన్ని సంబంధిత నిపుణులు, అధికారుల సంప్రదింపులతో తిరిగి రాయనున్నట్లు ప్రకటించింది.

సరైన సమాచారంతో కూడిన కొత్త పాఠ్యపుస్తకాలు 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని ఎన్‌సీఈఆర్‌టీ సంస్థ స్పష్టం చేసింది. విద్యార్థుల్లో రాజ్యాంగబద్ధమైన అక్షరాస్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం పెంచడం, బాధ్యతాయుతమైన పౌరులుగా వారిని తీర్చిదిద్దడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.

అసలేమైంది?
ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన కొత్త ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాల్లో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఒక అధ్యాయం ఉంది. అందులో భారత న్యాయవ్యవస్థలో 'అవినీతి' ఒక ప్రధాన సమస్యగా పేర్కొనడం, కేసుల విపరీతమైన బ్యాక్‌లాగ్, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను చర్చించారు. అయితే, పాఠశాల స్థాయి విద్యార్థులకు బోధించే పుస్తకాల్లో న్యాయవ్యవస్థను కించపరిచేలా 'అవినీతి' అనే పదాన్ని వాడటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని కోరడంతో కోర్టు దీనిని 'సుమోటో' విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ కీలక కామెంట్స్ చేశారు.

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా, దానిపై మచ్చ వేసేలా వ్యవహరించే వారిని ఎవరినీ సహించబోమని స్పష్టం చేశారు. ఎవరికి కూడా న్యాయవ్యవస్థను కించపరిచే అధికారం లేదన్నారు. విద్యార్థుల మనసుల్లో రాజ్యాంగబద్ధమైన సంస్థల పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా ఇలాంటి పాఠ్యాంశాలు ఉండటంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలు గతంలోనూ పలుమార్లు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. ముఖ్యంగా చరిత్ర, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యాంశాల్లో చేసిన మార్పులు తీవ్ర చర్చకు దారితీశాయి. కరోనా సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పేరుతో ఎన్‌సీఈఆర్‌టీ అనేక పాఠ్యాంశాలను తొలగించింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. 12వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి మొఘల్ దర్బార్, వారి పరిపాలనకు సంబంధించిన అధ్యాయాలను తొలగించడంపై చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌పై విధించిన నిషేధం వంటి అంశాలను తొలగించడంపై విమర్శలు వచ్చాయి. 10వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి చార్లెస్ డార్విన్ 'పరిణామ సిద్ధాంతం' చాప్టర్‌ను తొలగించడంపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1,800 మందికి పైగా శాస్త్రవేత్తలు దీనిపై బహిరంగ లేఖ రాశారు.

'న్యాయ వ్యవస్థలో అవినీతి'పై NCERT బుక్‌లో ఛాప్టర్- సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

'దేశ విభజనకు ఆ ముగ్గురే కారణం'- NCERT కొత్త పాఠంపై కాంగ్రెస్​ విమర్శలు