దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్- క్యాన్సర్‌కు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం
జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం వెల్లడి

Published : February 24, 2026 at 4:11 PM IST
HPV Vaccination in India: మహిళల్లో నివారించగలిగే క్యాన్సర్లను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV vaccination) టీకాను అందించేందుకు నిర్ణయించింది. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ సింగిల్ షాట్ గార్డాసిల్ ఇంజెక్షన్‌ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నట్లు వివరించాయి. ఇవి మహిళ్లలో నివారించగలిగే క్యాన్సర్లను ఇది అడ్డుకుంటాయని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి 'ఈటీవీ భారత్'తో కీలక విషయాలు వెల్లడించారు.
నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌లను అడ్డుకట్ట
'గార్డసిల్ వ్యాక్సిన్ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్ 16, 18 తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు, సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ కలుగుతుందని దేశీయంగా, అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో దాదాపు 93- 100 శాతం సమర్థంగా పనిచేసినట్లు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు' అని సదరు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
"జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తారు. అన్ని సామాజిక-ఆర్థిక సమూహాలకు సమాన గుర్తింపును ఇస్తాం. సరైన వయస్సులో నివారణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జీవితాంతం రక్షణను అందించగలం. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ దేశంలో గర్భాశయ క్యాన్సర్‌ను గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నాం. 'స్వస్థ నారి' లక్ష్యాన్ని సాధించడానికి త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న టీకా అమలు ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు, సంరక్షకులు ముందుకు వచ్చి వారి 14 ఏళ్ల కుమార్తెలకు HPV టీకాలు వేయించేలా చూసుకోవాలి."
- ఈటీవీ భారత్‌తో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి
15 ఏళ్ల వయసు దాటిన బాలికలకు మాత్రం మూడు డోసులు
'15ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గార్డాసిల్-4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో దీని ఒక్కో డోసు ధర.3,927గా ఉంది. అదే 15 ఏళ్ల వయసు దాటిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు భద్రత విషయంలో మెరుగైన రికార్డు ఉంది. ఈ టీకా 2006లో అందుబాటులోకి రాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేపట్టారు. ఫలితంగా అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా వేశారు. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి' అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.
"ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల్లో మాత్రమే ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రతి సెషన్ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే నిర్వహిస్తారు. ఏవైనా అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, తక్షణం చికిత్స అందించేలా 24x7 హెల్త్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. కనుక 14 ఏళ్ల కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు వారికి ఈ వ్యాక్సినేషన్ చేయించాలి. ఇది ప్రాణాలను రక్షించే ఒక మంచి ముందడుగు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులకు అనుగుణంగా బాలికలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. కనుక జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చిన 160వ దేశంగా భారత్ అవతరించనుంది." - ఈటీవీ భారత్‌తో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి
42,000 కంటే ఎక్కువ మంది మరణం
సంఖ్యా పరంగా చూస్తే, ప్రపంచంలో ఎక్కువ క్యాన్సర్ బాధితులు ఉన్న దేశాల్లో భారత్ మూడోది. మొదటి, రెండు స్థానాల్లో చైనా, అమెరికాలు ఉన్నాయి. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత డేటా ప్రకారం, భారత మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. ఏటా దాదాపు 80,000 కొత్త కేసులు నమోదు అవుతుండగా, సుమారు 42,000 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇందులో 80 శాతానికి పైగా కేసులు హెచ్‌పివి (HPV) రకాలు 16 మరియు 18 వల్లనే సంభవిస్తున్నాయి.

