2027 జనగణనకు టెక్ హంగులు- 32లక్షల సిబ్బందికి డిజిటల్ డివైజ్‌లు- రియల్ టైమ్ ట్రాకింగ్
తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్‌గా 2027 జనగణన- 32 లక్షల మంది సిబ్బందికి డిజిటల్ డివైజ్‌లు- జనాభా లెక్కల వివరాల నమోదుకు సీఎంఎంఎస్ పోర్టల్-వెబ్ బేస్డ్ మ్యాపింగ్ అప్లికేషన్‌తో కచ్చితత్వంతో ఇళ్ల మ్యాపింగ్


Published : February 26, 2026 at 10:52 AM IST
Census India 2027 Digital : 2027 జనగణనలో భాగంగా క్షేత్రస్థాయిలో జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను అధికార వర్గాలు రియల్ టైమ్‌లో (లైవ్‌లో) ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. ఇందుకోసం సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్) అనే డిజిటల్ పోర్టల్‌ను వినియోగించనున్నారు. మనదేశంలో జరగనున్న జనాభా లెక్కల సేకరణ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా సీఎంఎంఎస్ నిలువనుంది. ఈమేరకు వివరాలతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఒక సర్క్యులర్‌ను పంపారు.
2027 జనాభా లెక్కల సేకరణ, నమోదుల్లో నాణ్యత, సామర్థ్యం, సమయానుకూలతలను పెంచేందుకు పెద్దఎత్తున డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి జనాభా లెక్కలను డిజిటల్ మోడ్‌లోనే సేకరిస్తామని, తద్వారా విప్లవాత్మక రీతిలో సెన్సస్ ప్రక్రియకు ఆధునిక టెక్ హంగును జోడిస్తామని తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డిజిటల్ డివైజ్‌లను జనాభా లెక్కలను సేకరించే 32 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అందిస్తామన్నారు. వీటిలోనే ప్రజలు, కుటుంబాల జనాభా, ఆర్థిక, సామాజిక వివరాలన్నీ నమోదు చేస్తారని మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ చెప్పారు. సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా జనాభా సమాచారం సేకరణ చాలా ఈజీగా జరుగుతుందని, దీనివల్ల ఎంతో టైం ఆదా అవుతుందన్నారు. దీనిలో తప్పుల సవరణ కూడా సులభంగా చేయొచ్చని పేర్కొన్నారు. 2027 జనగణన అనేది దేశంలోనే తొలి పూర్తిస్థాయి డిజిటల్ జనగణనగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారానే అన్ని పనులు
జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 2027లో జరుగుతుంది. అంతకంటే ముందు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు గృహ జాబితా బ్లాక్‌ల (HLB)ను నమోదు చేసే ప్రక్రియ జరుగుతుంది. ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఇందుకోసం ఏదైనా 30 రోజుల వ్యవధిని కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించే వివిధ స్థాయిల ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు సీఎంఎంఎస్ పోర్టల్‌లోనే యూజర్ ఐడీలను కేటాయిస్తామని ఆర్‌జీఐ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. గృహ జాబితా బ్లాక్‌ల (HLB)ను, వాటి పూర్తి వివరాలను, సూపర్‌వైజరీ సర్కిల్స్ సమాచారాన్ని తయారు చేసి దాన్ని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు కేటాయించే బాధ్యతను సైతం సీఎంఎంఎస్ చూస్తుందన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల కోసం ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా సీఎంఎంఎస్ పోర్టల్‌లోనే జనరేట్ అవుతాయని ఆర్‌జీఐ చెప్పారు.
అత్యంత కచ్చితత్వంతో ఇళ్ల సరిహద్దుల మ్యాపింగ్
‘‘ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, జనగణనను పర్యవేక్షించే అధికారులకు హోదాలను బట్టి సీఎంఎంఎస్ పోర్టల్‌లో వివిధ ఫీచర్లు లభిస్తాయి. నియామకాలు చేసేందుకు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఆయా అధికారులకు యాక్సెస్‌ను కేటాయిస్తాం. మేం ఇవ్వనున్న 32 లక్షల డిజిటల్ డివైజ్‌లలో వెబ్ బేస్డ్ మ్యాపింగ్ అప్లికేషన్ ఉంటుంది. దాని ద్వారా గృహ జాబితా బ్లాక్‌ల (HLB)ను జియో ట్యాగింగ్ చేయొచ్చు. ఇళ్ల నిర్దిష్ట భౌగోళిక వివరాలను, అక్కడున్న జనాభా సమాచారాన్ని కచ్చితత్వంతో నమోదు చేయొచ్చు. డిజిటల్ మ్యాపింగ్ టూల్స్ ద్వారా ఇళ్ల సరిహద్దులను అత్యంత కచ్చితత్వంతో మ్యాపింగ్ చేయొచ్చు. ఎలాంటి తప్పిదాలకూ అవకాశం ఉండదు. భవిష్యత్తులో మౌలిక సదుపాయాల వికాస ప్రణాళికలు, విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించేందుకు ఈ సమాచారం ప్రమాణంగా మారనుంది’’ అని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రస్తావించారు.
గృహ జాబితా బ్లాక్‌ల నమోదులో 33 ప్రశ్నలు
2027 జనగణన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,718 కోట్లను వెచ్చించనుంది. ఈసారి జనగణనలో భాగంగానే కులగణన కూడా చేయనున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 16వ జనగణన ఇది. వాస్తవానికి దీన్ని 2021లోనే నిర్వహించాలని భావించారు. కానీ అప్పట్లో కరోనా మహమ్మారి ప్రబలుతుండటంతో జనగణనను వాయిదా వేశారు. 2027 ఫిబ్రవరిలో జనగణన కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి జరగనున్న గృహ జాబితా బ్లాక్‌ల నమోదులో భాగంగా ప్రజలను 33 ప్రశ్నలు అడగనున్నారు. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణ స్థితి, ఇంట్లోని వసతులు, ఒక్కో ఇంట్లో ఉన్న కుటుంబాల సంఖ్య వంటి సమాచారాన్ని సేకరిస్తారు.

