BLOలు ప్రజాస్వామ్యానికి పిల్లర్లు- మన ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకం: సీఈసీ
భారత ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైనది- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Published : September 2, 2026 at 8:37 PM IST
CEC Comments On BLOs : బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) 'ప్రజాస్వామ్యానికి పిల్లర్లు' లాంటివారని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడడంలో వారు పోషిస్తున్న పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గోవా పర్యటనలో భాగంగా బుధవారం బూత్ స్థాయి అధికారులను ఉద్దేశించి సీఈసీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"భారత ఎన్నికల వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. వీరు ఉత్సాహవంతులు, చురుకైనవారు, అలసట ఎరగకుండా పనిచేస్తారు. భారతదేశంలో ఓటర్ల జాబితాను ఈ బూత్ స్థాయి అధికారులు తయారు చేస్తారు. అదే సమయంలో అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు వీటిని తనిఖీ (ఆడిట్) చేస్తారు. ఈ పారదర్శకత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా కొనసాగుతుంది. భారతదేశంలో ఏ పోలింగ్ కేంద్రంలోనైనా పోలింగ్ ప్రక్రియను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు" అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ!
భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పాదర్శకమైన ప్రక్రియల్లో ఒకటి అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. భారతదేశంలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పూర్తిగా భారత రాజ్యాంగం, చట్టం, ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘానికి, పౌరులకు మధ్య బీఎల్ఓలు ఒక కనెక్షన్ లాంటివారని సీఈసీ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు ఎంతటి కీలక పాత్ర పోషించారో, ఇప్పటికీ ఎలా పోషిస్తున్నారో చెప్పారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన గోవా ఓటర్లను కూడా ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా కొంకణి, ఇంగ్లీష్ భాషల్లో, బీఎల్ఓల పాత్రను వివరించే చిన్న వీడియోలను సీఈసీ విడుదల చేశారు. గోవా సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ వేడుకలు ప్రదర్శించారు. ఈ సమావేశంలో బీఎల్ఓలు అడిగిన ప్రశ్నలకు జ్ఞానేశ్ కుమార్ నేరుగా సమాధానాలు చెప్పి, వారి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బుధవారం జ్ఞానేశ్ కుమార్ గోవాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఎన్నికల సంసిద్ధతను సమీక్షించనున్నారు.
అది ఓటు చోరీ సంఘం: రాహుల్ గాంధీ
ఇంతకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు చేశారు. అది భారత ఎన్నికల సంఘం కాదని, 'ఓటు చోరీ సంఘం' అని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎస్ఐఆర్ ద్వారా ఓటరు జాబితా నుంచి 2.06 కోట్ల మంది పేర్లను తొలగించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "బీజేపీకి ఎలాగైనా విజయం చేకూర్చాలన్ని లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ, ఓటు చోరీ సంఘం నిరంతరం తమ ఎత్తుగడలను మారుస్తున్నాయి. ఓటు చోరీ చేసి ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం కాదు. అందుకే బీజేపీ ఏనాడూ ప్రజల మాటను పట్టించుకున్న పాపాన పోలేదు. మహారాష్ట్రలో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికల ముందు అకస్మాత్తుగా 39 లక్షల ఓట్లను జతచేశారు. నేను ఆనాడు, ఇప్పుడూ ఒకటే చెబుతున్నాను. ఇది కచ్చితంగా ఓటు చోరీ. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించే సంస్థగా కాకుండా, ఎన్నికల సంఘం బీజేపీ అధికార పీఠాన్ని కాపాడే కమిషన్లా ప్రవర్తిస్తోంది" అని ఆయన ఆరోపించారు.
కెరీర్ అవకాశాలు కోల్పోతున్న జెన్జీ- లింక్డిన్ నివేదికలో వెల్లడి

