'ఈ స్కామ్‌పై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలి'- సీబీఎస్ఈ OSM వివాదంపై రాహుల్ గాంధీ ఫైర్
ఇటీవలే రిలీజైన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు- కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) పద్ధతిపై తీవ్ర ఆందోళనలు- ఈ విధానం కారణంగా తమ ఆన్సర్ షీట్లు తారుమారయ్యాయన్న కొందరు స్టూడెంట్స్

Published : May 27, 2026 at 3:40 PM IST
Rahul Gandhi on CBSE Row : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు భారీ అవకతవకలతో నిండిపోయాయని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మొత్తం కుంభకోణం వెనుక ఉన్న నిజానిజాలను వెలికితీసేందుకు స్వతంత్రంగా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో గ్లోబరేనాగా పనిచేస్తున్నప్పుడు వివాదాల్లో చిక్కుకున్న కోఎంప్ట్‌కు సీబీఎస్ఈ కాంట్రాక్టును ఎందుకు ఇచ్చారని కేంద్ర సర్కార్‌ను ప్రశ్నించారు. కోఎంప్ట్ యాజమాన్యానికీ, ప్రధాని మోదీ ప్రభుత్వానికీ మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాగా, సీబీఎస్‌ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) పద్ధతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు'
మూల్యాంకన వ్యవస్థలో జరిగిన అవకతవకల కారణంగా దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వివాదం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక కుట్రను సూచిస్తోందని అన్నారు. మూల్యాంకన వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "సీబీఎస్ఈ ఫలితాల స్కామ్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక మోదీజీ విషయానికొస్తే? ఎప్పటిలాగే ఈ విషయంపై ఆయన దగ్గర సమాధానాలు లేవు. జవాబుదారీతనం లేదు." అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
CBSE परीक्षा परिणाम में भयंकर हेर-फेर हो गई जिससे देश के लाखों बच्चे और उनके माता-पिता सदमे में हैं।
— Rahul Gandhi (@RahulGandhi) May 27, 2026
और मोदी जी? हमेशा की तरह - न जवाब, न ज़िम्मेदारी, न शर्म।
जिस कंपनी COEMPT को यह ज़िम्मेदारी मिली, वह पहले Globarena के नाम से तेलंगाना में 2019 में यही कारनामे कर चुकी है।
नाम… pic.twitter.com/iZG8bvUXPJ
"సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల నిర్వహణ బాధ్యత అప్పగించిన కోఎంప్ట్ సంస్థ గతంలో 2019లో తెలంగాణలో గ్లోబరేనా పేరుతో పనిచేస్తూ ఇలాంటి దుశ్చర్యలకే పాల్పడింది. పేరు మారినా ఆ సంస్థ ఉద్దేశం, స్వభావం మారలేదు. ఆ సంస్థ చరిత్ర బహిరంగంగానే ఉన్నప్పటికీ, లెక్కచేయకుండా సీబీఎస్ఈ కాంట్రాక్టును దానికి అప్పగించారు. 18.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అలాంటి సంస్థకు అప్పగించారు. ఇది పొరపాటు కాదు. ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర. గ్లోబరేనాగా పనిచేస్తున్నప్పుడు కోఎంప్ట్ గతంలో వివాదాల్లో చిక్కుకున్న విషయం సీబీఎస్ఈకి ఎలా తెలియకుండా పోయింది? ఆ సంస్థ నేపథ్యం గురించి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు?. అసలు కోఎంప్ట్ యాజమాన్యానికీ, మోదీ ప్రభుత్వానికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీబీఎస్ఈ పరీక్షలు రాసిన జెన్ జెడ్ మిత్రుల కష్టఫలాలను గానీ, భవిష్యత్తును గానీ ఎవరూ దొంగిలించలేరు. మేము ఈ కుట్ర మూలాలను కనుగొని, ఈ అవినీతిని ఒక్కసారిగా సమూలంగా నిర్మూలిస్తాం." అని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి : జైరాం రమేశ్
మరోవైపు, సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు. తన పదవిని వదులుకోకూడదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టుబట్టడం, ప్రధాని మంత్రి ఆయనను కాపాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఓఎస్ఎం విధానాన్ని అమలు చేయడానికి ముందు, వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టులు నిర్వహించాలన్న తమ సొంత పాలకమండలి సభ్యుల అభిప్రాయాలను సీబీఎస్ఈ విస్మరించిందని ఒక మీడియా నివేదిక వెల్లడించిందని ఈ సందర్భంగా జైరాం రమేశ్ ఉటంకించారు.
"విద్యా విధానానికి సంబంధించిన విషయాలపై చర్చించే కేంద్ర విద్యా సలహా మండలి 2019 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి సమావేశం కాలేదు. మోదీ ప్రభుత్వ జాతీయ విద్యా విధానం- 2020 కూడా కేంద్ర విద్యా సలహా మండలిని బలోపేతం చేయాలని పిలుపునిస్తోంది. కానీ కేంద్ర విద్యా శాఖ ఈ విషయాన్ని పక్కన పెట్టేసింది. 2014కు ముందు కౌన్సిల్ దాదాపు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశమయ్యేది. ధర్మేంద్ర ప్రధాన్ కనుసన్నల్లో మన ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రబలిన అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు." అని జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గురువారం సిద్ధరామయ్య రాజీనామా!- మే30న కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం?

