ETV Bharat / bharat

బాధ్యతను నిర్వర్తించడంలో CAQM విఫలం- దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీంకోర్టు- రెండు వారాల్లో నిపుణుల సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశం

SC On Air Pollution
SC On Air Pollution (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 4:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

SC On Air Pollution : దిల్లీలో ఎయిర్ పొల్యూషన్ నివారణ విషయంలో 'వాయు నాణ్యత నిర్వహణ కమిషన్' (CAQM) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి టోల్ ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా తరలింపుపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం CAQMపై అసహనం వ్యక్తం చేసింది. టోల్ ప్లాజాల తరలింపు లేదా మూసివేత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కమిషన్ రెండు నెలల సమయం కోరగా, కోర్టు దానిని తీవ్రంగా తప్పుబట్టింది.

'సీఏక్యూఎం తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతోంది. ముందు కాలుష్యానికి గల కారణాలను గుర్తించాలని, ఆ తర్వాతే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. జనవరి 2న సమావేశం నిర్వహించి, మళ్లీ రెండు నెలల సమయం కావాలని అడగడం ఆమోదయోగ్యం కాదు. రెండు వారాల్లో నిపుణుల సమావేశం నిర్వహించాలి. కాలుష్యం తీవ్రత పెరగడానికి గల ప్రధాన కారణాలపై నివేదిక సమర్పించాలి. ఇన్ని రోజులు గడిచినా కాలుష్యానికి గల అసలు కారణాలను గుర్తించారా? పబ్లిక్ డొమైన్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉందని నిపుణులు వ్యాసాలు రాస్తున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను మాకు మెయిల్ చేస్తున్నారు. కమిషన్ ఏం చేస్తోంది? భారీ వాహనాలు కాలుష్యానికి పెద్ద ఎత్తున కారణమవుతున్నాయని అందరికీ తెలుసు. అయితే వాటిని ఎలా నియంత్రించాలి అనేదే మొదటి ప్రశ్న. కాలుష్య సమస్యకు సంబంధించి దశలవారీగా దీర్ఘకాలిక పరిష్కారాలను పరిగణనలోకి తీసుకోవాలి. టోల్ ప్లాజాల అంశాన్ని కూడా సమగ్రంగా పరిశీలించాలి. టోల్ ప్లాజాల సమస్యతో పాటు, కాలుష్య నివారణకు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను దశలవారీగా అమలు చేయాలి' అని సుప్రీంకోర్టు సూచించింది.

రైతులను నిందించడం సరికాదు : సుప్రీం కోర్టు
బస్సులు, ట్రక్కులు, పంట వ్యర్థాల దహనం తదితర కారణాల వల్ల దిల్లీలో కాలుష్య సమస్య తీవ్రమవుతోందని అధికారులు నివేదికలో పేర్కొనడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యానికి బస్సులు, ట్రక్కులే కారణమని చెప్పడం చాలు సులభమమని పేర్కొంది. కానీ, వాటిని నిలిపివేస్తే సామాన్య పౌరులు ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నించింది. కాలుష్యం ప్రస్తావన వచ్చినప్పుడల్లా రైతులను నిందించడం సరికాదంటూ వ్యాఖ్యానించింది. ఈ సమస్యపై ఊహలకు బదులు శాస్త్రీయ ఆధారాలు సమర్పించాలని సీఏక్యూఎంను ఆదేశించింది.

కొవిడ్‌ సమయంలో రైతులు పెద్ద మొత్తంలో పంట వ్యర్థ్యాలను తగలబెట్టారని, అయినప్పటికీ దిల్లీలో కాలుష్య సమస్య రాలేదని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. ప్రస్తుత కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం, వాహనాలు మాత్రమే కాకుండా ఇంకా సంక్లిష్టమైన కారణం ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు గల ప్రధాన కారణాన్ని గుర్తించగలిగారా? అని అధికారులను ప్రశ్నించింది. కాలుష్య సమస్యపై లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు సూచించింది. ముందుగా కాలుష్యానికి గల ప్రధాన కారణాలను గుర్తించాలని, తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనాలని ఆదేశించింది. కాలుష్య నివారణ చర్యలపై ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని సూచించింది.

'వాయు కాలుష్యంతో భారత్‌కు అతి పెద్ద ముప్పు'
ఇటీవల కొవిడ్‌ అనంతరం భారత్​కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమేననీ పరిశోధకులు తెలిపారు. దీన్ని నివారించడానికి సత్వరం కార్యాచరణ చేపట్టకపోతే పరిస్థితి ఏటేటా దిగజారిపోతుందని హెచ్చరించారు. వాయు కాలుష్యం వల్ల కంటికి కనిపించకుండా శ్వాసకోశ వ్యాధులు ఏకమవుతున్నాయని, ఏదో ఒకరోజు అవన్నీ నిశబ్ధ సునామీలా విరుచుకుపడతాయని వెల్లడించారు. బ్రిటన్‌లోని భారత సంతతి శ్వాసకోశ వ్యాధి నిపుణులు మనీశ్‌ గౌతమ్, రజయ్‌ నారాయణ్‌లతో పాటు బ్రిటిష్‌ మిడ్​ల్యాండ్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయ ఆస్పత్రి ఆచార్యుడు డెరెక్‌ కానల్లీ ఈ విషయాలను తెలియజేశారు. పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్​ చేయండి.