ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- స్లీపర్​ బస్సు, ట్రక్కు ఢీ- ఆరుగురు మృతి

బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి- మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ- పలువురికి తీవ్ర గాయాలు

Balotra Road Accident
Balotra Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 7:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Balotra Road Accident : స్లీపర్​ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికకక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన రాజస్థాన్​లోని బలోత్రాలో శుక్రవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన స్లీపర్​ బస్సు శుక్రవారం జోధ్‌పుర్ నుంచి సాంచోర్‌కు బయలుదేరింది. బలోత్రా జిల్లా సర్వాడి గ్రామం సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్​ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే, డ్రైవర్​ వైపు ఉన్న ప్రయాణికులు ఎక్కువగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని రక్షించారని చెప్పారు. రెండు వాహనాలు అధిక వేగంతో వెలుతున్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

డ్రైవర్ బస్సును చాలా వేగంగా నడిపాడు: ప్రయాణికుడు
ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఓ ప్రయాణికుడు అందించారు. "డ్రైవర్ బస్సును చాలా వేగంగా నడిపాడు. వేగాన్ని తగ్గించమని కూడా నేను అతడికి చెప్పాను. ఆ తర్వాత, నా సోదరుడు నేను వెళ్లి వెనుక సీటులో కూర్చున్నాం. ప్రమాదం జరిగిన తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్​ నుంచి ప్రయాణికులను బయటకు పంపించాను. అందులో కొన్ని మృతదేహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదంలో నా సోదరుడి చేయి విరిగింది" ప్రయాణికుడు రమేశ్​ విష్ణోయ్ చెప్పారు.

"హోలీ సెలవుల కోసం నా భార్య, పిల్లలతో ఇంటికి తిరిగి వెళ్తున్నాను. బస్సు, ట్రక్కను ఢీకొనడంతో డ్రైవర్​ పక్క ఉన్న వారంతా ఎక్కువగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన నా భార్య కాలును తొలగించాల్సి వచ్చింది" అని మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను నహతా ఆస్పత్రిలో మార్చురీలో ఉంచారన్నారు. కాగా, ఈ ఘటనతో హైవే పై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, రెండు వైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయని బలోత్రా ఎస్​పీ రమేశ్​ కుమార్​ పేర్కొన్నారు. వెంటనే స్థానిక యంత్రాగం అక్కడికి చేరుకుని ట్రాఫిక్​ను క్లియర్ చేసిందని పేర్కొన్నారు.

సంతాపం తెలిపిన ప్రముఖులు
ఇదిలా ఉండగా, ప్రమాద ఘటనపై నాగౌర్ ఎంపీ హనుమాన్​ బెనివాల్ స్పందించారు. ఈ ఘటనపై​ విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్​లో పోస్ట్​ చేశారు. 'బలోత్రా జిల్లాలోని కల్యాణ్‌పుర్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని తెలిసింది. ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు మరణించారని, పలువురు గాయపడ్డారన్న వార్త అందింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ఎక్స్​లో రాసుకొచ్చారు.

మరోవైపు, ఈ ప్రమాదంపై బైటు ఎమ్మెల్యే హరీశ్ చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'బస్సు, ట్రక్కు ప్రమాద వార్త చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 10 మంది మృతి!

యువతి ప్రాణాలు కాపాడిన సింగింగ్ కాప్​- పాటలు పాడుతూ ట్రాఫిక్ రూల్స్‌పై అవేర్‌నెస్!