అక్కడ గుడిసెలోనే పిల్లలకు పాఠాలు- టీచర్‌గా తొమ్మిదో తరగతి విద్యార్థిని
ప్రభుత్వ పాఠశాల లేక గుడిసెలోనే పాఠాలు- పిల్లలకు పాఠాలు బోధిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని

Published : February 26, 2026 at 6:48 PM IST
9th Student Teaching Classes : పిల్లల కోసం అక్కడ ప్రభుత్వ పాఠశాలే లేదు. గ్రామస్థులే స్వయంగా చిన్న పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ గుడిసెలోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పాఠశాలే కాదు టీచర్లు కూడా లేరు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినే టీచర్‌గా మారింది. ఉచితంగా ఆ గ్రామ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. ఇంతకీ ఎక్కడంటే?
మధ్యప్రదేశ్ బుర్హాన్‌పుర్ జిల్లా నేపానగర్‌లోని మాండ్వాలోని బోమలియపాట్ ఫలియా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదు. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో చిన్నారులు గుడిసెలోనే చదువుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో గ్రామస్థులే స్వచ్ఛంద సహకారంతో ఒక చిన్న పాఠశాలను నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ 60 మందికిపైగా పిల్లలు చదువుకుంటున్నారు. అయితే శాశ్వత ఉపాధ్యాయులు లేరు. ఈ గుడిసెలో పిల్లలకు పాఠాలు చెప్పేది సీమా బడోలే అనే 9వ తరగతి విద్యార్థిని.

గ్రామంలోని చాలా మంది పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నారని సీమా బడోలే అంటోంది. 'పిల్లలకు చదవాలనే ఆసక్తి ఉంది. కానీ ఈ గుడిసెలో తగినంత స్థలం లేకపోవడం వల్ల అందరూ రాలేకపోతున్నారు. రెగ్యులర్ టీచర్లు కూడా ఎవరూ లేరు. నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నా. అయినప్పటికీ పిల్లలకు బోధిస్తున్నాను. దీనికి నాకు ఎలాంటి జీతం లేదు. అయితే అటవీశాఖలోని కమలేశ్ రఘువంశీ కొంత ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు' అని సీమా బడోలే తెలిపింది.
'రహదారి కూడా లేదు'
బోమలియపాట్ ఫలియా వెళ్లేందుకు కూడా సరైన రహదారి కూడా లేదని సీమా బడోలే చెబుతుంది. అయినప్పటికీ గ్రామస్థులు పిల్లల విద్య కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. పిల్లలకు మంచి పాఠశాల, సరిపడా సదుపాయాలు, ప్రభుత్వ మద్దతు అవసరమని తెలిపింది. అప్పుడే వారు మంచి భవిష్యత్తు నిర్మించుకోగలరని సీమా చెప్పింది.
ప్రభుత్వాని స్థానికుల విజ్ఞప్తి
స్థానికులు తక్షణమే పాఠశాల భవనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అప్పటి వరకు ప్రస్తుత గుడిసె పాఠశాలలో రెగ్యులర్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా పిల్లల చదువు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పిల్లల భవిష్యత్తును పాడు చేయమని అధికారులు హామీ
ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భారత్ జాంచపురే స్పందిస్తూ, పిల్లల భవిష్యత్తును పాడు చేయమని అన్నారు. పాఠశాల భవనం కోసం ప్రతిపాదనను భోపాల్‌కు పంపిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధి పనులు జరగకపోతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని నెపానరగ్ ఎస్డీఎం భగీరథ్ వాఖలా అన్నారు.
ఆ ఊరిలో కరెంట్ స్తంభాలే బ్లాక్‌బోర్డులు- రోడ్డే ఓపెన్ ఎయిర్ స్కూల్
మరోవైపు, బంగాల్‌లోని డ్యూల్‌బరి గ్రామం విద్యను వ్యాప్తి చేయడానికి వినూత్న చొరవ తీసుకుంది. ఆ ఊరిలో ఉన్న విద్యుత్ స్తంభాలను బ్లాక్‌బోర్డ్‌లుగా, రోడ్డును ఓపెన్ ఎయిర్ స్కూల్‌గా మార్చేసింది. గ్రామంలోని రోడ్ల వెంబడి ఉన్న దాదాపు 40-45 విద్యుత్ స్తంభాలపై బెంగాలీ వర్ణమాల, ఆంగ్ల సంఖ్యలు మొదలైన వాటితో పెయింటింగ్‌తో రాశారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లే రహదారిని ఓపెన్ స్కూల్‌గా మార్చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఆంగ్ల సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహార చిహ్నాలను నేర్చుకుంటున్నారు.
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్ఫూర్తితో
అయితే డ్యూల్‌బరి గ్రామ ప్రజలు బంగాల్ పునరుజ్జీవనోద్యమానికి మార్గదర్శకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్ఫూర్తిగా తీసుకుని విద్యను వ్యాప్తి చేస్తున్నారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చిన్నతనంలో మేదినీపుర్ జిల్లాలోని తన గ్రామం నుంచి కోల్‌కతాలోని స్కూల్‌కు నడిచి వెళ్లేవారు. ఆ సమయంలో మైలురాళ్లపై ఉన్న ఆంగ్ల సంఖ్యలను చదివేవారట. అదే స్ఫూర్తితో డ్యూల్‌బరి గ్రామంలోని విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. మిగతా కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

