ETV Bharat / bharat

జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: కిరణ్​ రిజిజు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి

Kiren Rijiju calls on Congress to apologise
Kiren Rijiju calls on Congress to apologise (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 9:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Budget Session Of Parliament : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంమవుతాయని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 13తో ముగుస్తుందని, తిరిగి మార్చి 9న సభలు పునఃప్రారంభమయ్యి ఏప్రిల్​ 2 వరకు కొనసాగుతాయని కిరణ్​ రిజిజు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​లో ఆయన పోస్ట్ చేశారు. అయితే, బడ్జెట్ సమర్పణ తేదీకి సంబంధించిన వివరాలను రిజిజు వెల్లడించలేదు. బడ్జెట్ దినంగా నిర్ణయించిన ఫిబ్రవరి 1, ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది.

"భారత ప్రభుత్వ సిఫార్సు మేరకు, గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 బడ్జెట్ సమావేశాల నిమిత్తం పార్లమెంటు ఉభయ సభలను పిలిచేందుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశాలు 2026 జనవరి 28న ప్రారంభమై, ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది, తిరిగి మార్చి 9న సభలు ప్రారంభమవుతాయి. అర్థవంతమైన చర్చలు, ప్రజాకేంద్రీకృత పాలన దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు" అని కిరణ్​ రిజిజు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కీలక బిల్లులు
సాధారణంగా ఒక క్యాలెండర్ ఇయర్​లో పార్లమెంటు మొదటి సమావేశాలు బడ్జెట్ రూపంలోనే మొదలవుతాయి. ఇవి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో ప్రారంభమవుతాయి. వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను స్టాండింగ్ కమిటీలు పరిశీలించేందుకు వీలుగా బడ్జెట్ సమావేశాలను రెండు భాగాలుగా విభజించి, మధ్యలో విరామం ఇవ్వడం ఆనవాయితీ. శీతాకాల సమావేశాల తరహాలోనే, ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ రాజధానిలో జరిగే 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గతంలో పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ సహ-అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే.

కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ అధిపతి, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఏఎన్ఐతో మాట్లాడుతూ, తాము ప్రభుత్వానికి కొన్ని సూచనలు అందజేస్తామని, ఆ నివేదికను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సమర్పిస్తామని తెలిపారు.

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి సంబంధించి ఇప్పటికే పలు దేశాలు నిబంధనలు రూపొందించాయి. మా కమిటీ కూడా ఏఐ విషయంలో ఆందోళన చెందుతోంది. ప్రధానమంత్రి గొప్ప చొరవ తీసుకున్నారు. ఆయన వరల్డ్ ఏఐ సమ్మిట్‌కు సహ-అధ్యక్షత వహించారు. ఇక్కడ కూడా ఒక సమావేశం జరగనుంది. దానికి ముందు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మేము ప్రభుత్వానికి తగు సూచనలు అందిస్తాం. ఆపై వారు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ నివేదికను మేము బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతాం" అని దూబే వివరించారు.

బడ్జెట్ సంగతేంటి?
వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ 2026 బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ (10 బడ్జెట్లు) రికార్డుకు ఆమె చేరువవుతారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ!
త్వరలో కేరళ, తమిళనాడు, బంగాల్, అసోం, పుదుచ్ఛేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమేమి వరాలు కురిపిస్తుందో చూడాలి.